ఆర్థిక ఉల్లంఘనలతో అంధకారంలోకి రాష్ట్ర భవిష్యత్

Spread the love

– రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలి
– వైసిపికి 28 మంది ఎంపిలు ఉండి 32 నెలల్లో రాష్ట్రానికి ఏం తెచ్చారు?
– రాష్ట్ర సమస్యలపై, వైసిపి ప్రభుత్వ అక్రమాలపై పార్లమెంట్ లో గళం ఎత్తాలి
– చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలపై కేంద్రం దృష్టి పెట్టాలని టిడిపి డిమాండ్ చేసింది. వ్యవస్థలను ధ్వంసం చేస్తూ…..నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న వైసిపి ప్రభుత్వ నిర్ణయాలపై కేంద్రం దృష్టి పెట్టాలని అన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో…..చంద్రబాబు అధ్యక్షతన తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పార్లమెంట్ లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.

టిడిపిపిలో చర్చకు వచ్చిన అంశాలు…
పాలన అంటే అప్పులు చెయ్యడం, దోచుకోవడం అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్ర భవిష్యత్ అత్యంత ప్రమాదంలోపడిపోయిందని సమావేశంలో నేతలు అభిప్రాయ పడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తరవాత అన్ని ప్రభుత్వాలు చేసిన అప్పుల కంటే….కేవలం 32 నెలల్లో వైసిపి ప్రభుత్వం చేసిన అప్పు ఎక్కువగా ఉందన్నారు. 2019 లో వైసిపి అధకారం లోకి రాకముందు అన్ని ప్రభుత్వాలు కలిపి 3.14 లక్షల కోట్ల అప్పులు చెయ్యగా….వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత 3.64 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. ఎటువంటి అభివృద్ది లేకుండా, నింబంధనలకు విరుద్దంగా చేస్తున్న ఈ అప్పులతో తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.

మరోవైపు ఇసుక, మద్యం, మైనింగ్ లలో జరగుతున్న అధికారిక దోపిడీ రాష్టర అభివృద్ది కి విఘాతంగా మారిందన్నారు. ఈ అక్రమాలపై, రాష్ట్రంలో ఉన్న దారుణ పరిస్థితులపై….కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ల అప్పులకు ఇచ్చే గ్యారెంటీ లను 90 శాతం నుంచి 180 శాతం పెంచుతూ FRBM యాక్ట్ కు చేసిన చట్ట సవరణను పార్లమెంటరీ పార్టీ తప్పు పట్టింది. చట్ట సవరణ ద్వారా ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా రాబోయే రోజుల్లో దాదాపు రూ.80 వేల కోట్ల వరకు అదనపు అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అప్పులు తెచ్చుకునేందుకు చట్టాలను మార్చిన చరిత్ర లేదని, దీనిపై భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టేలా పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. దక్షిణ భారత దేశంలో తలసరి ఆదాయం తక్కువ ఉన్న రాష్ట్రంగా ఎపి ఉందని అన్నారు. రాష్ట్రం తిరగమనంలో ఉంది అనడానికి ఇదోక ఉదాహరణగా ఉందన్నారు. ఎపి కార్పొరేషన్ల ద్వారా తెచ్చేఅప్పులు ఆయా కార్పొరేషన్ల కు ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తూ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తుందని అన్నారు.

కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని….సుప్రీం కోర్టు, కేంద్రం చెప్పిన తరువాత కూడా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారని… అంశాలను పార్లమెంట్ లో ప్రస్తావించాలని అన్నారు.

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే…..ఇప్పటికిప్పుడు కొత్త జిల్లాలు అంటూ వైసిపి ప్రభుత్వం కొత్త డ్రామా మొదలు పెట్టిందని నేతలు అన్నారు. ఉద్యోగుల పిఆర్సి తో పాటు…..రాష్ట్రంలోని ఇతర సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ డ్రామా మొదలు పెట్టారని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముందని అన్నారు.

రాష్ట్రంలో క్యాసినో నిర్వహించి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలపై దెబ్బకొట్టిన అంశాన్ని కూడా పార్లమెంటులో లేవనెత్తాలని నిర్ణయించారు. చట్ట పరిరక్షణలో రాష్ట్ర పోలీసు శాఖ విఫలం అవుతున్న తీరుతో పాటు……అక్రమ కేసుల వంటి చర్యలపైనా పార్లమెంట్ లో ప్రస్తావించాలని అన్నారు. క్యాసినో విషయంలో ED, DRI, NCB లతో పాటు ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చెయ్యాలని ఎంపిలకు చంద్రబాబు సూచించారు.

వైసీపీకి పార్లమెంట్ లో 28 మంది ఎంపీల బలం ఉన్నప్పటికీ రాష్ట్రం కోసం సాధించింది మాత్రం శూన్యం అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావొస్తున్నా…ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకు రాలేదని అన్నారు. సిఎం జగన్ డిల్లీ వెళ్లి జరపుతున్న చర్యల సారాంశం కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. సిఎం డిల్లీ పర్యటనలతో ఏం సాధించారు అనేది చెప్పలేకపోతున్నారని అన్నారు.

ప్రత్యేక హోదా, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులుతో పాటు విభజన హామీలను వైసిపి ఎంపిలు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు, పెండింగ్ అంశాలపై మన వంతుగా పోరాటం చెయ్యాలని అధినేత చంద్రబాబు పార్టీ ఎంపిలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వని కారణంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఈ అంశాలు బహిర్గతం చెయ్యాలని ఎంపిలకు సూచించారు. పార్లమెంట్ లో ప్రశ్నలు సంధించడం తో పాటు…తీవ్రమైన సమస్యలపై డిల్లీలో గళం వినిపించాలని ఎంపిలకు సూచించారు.
సమావేశంలో ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని శ్రీనివాస్ (నాని) కనకమేడల రవీంద్ర తో పాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.

Leave a Reply