Suryaa.co.in

Andhra Pradesh

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీయే ధ్యేయం

– అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలి
– కేవలం ఏడు నెలల్లోనే తీసుకొచ్చిన పెట్టుబడులు, రాబోతున్న ఉద్యోగ అవకాశాలను ప్రచారం చేయాలి
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం జిల్లాల ఇన్‌ఛార్జీ మంత్రులతో సమావేశం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఆలపాటి రాజా, తూర్పు గోదావరి – పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ఇన్‌ఛార్జీ మంత్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలని నారా లోకేష్ అన్నారు.

ఈ సందర్భంగా 2023 లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను లోకేష్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు టీడీపీ గెలిచిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేశాయని, సాధారణ ఎన్నికలో సాధించిన ఘన విజయానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయం నాంది అయ్యిందని అన్నారు. అప్పుడు ఎనిమిది నెలల ముందే అభ్యర్థులను ఖరారు చేయడం, ప్రతి వారం అభ్యర్థులు, పార్టీలో ముఖ్య నాయకులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించి అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చించిన విషయాన్ని మంత్రులకు వివరించారు.

సాధారణ ఎన్నికలను ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నమో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా అంతే సీరియస్ గా తీసుకోవాలని లోకేష్ అన్నారు. ప్రతి ఓటరును పార్టీ శ్రేణులు నేరుగా కలవాలి, సోషల్ మీడియా పెద్ద ఎత్తున వినియోగించుకోవాలి, పట్టణ ప్రాంతాల్లో ఉండే పట్టభద్రుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని లోకేష్ అన్నారు. జగన్ రెడ్డి పాలనలో అప్పుల ఊబిగా మారిన రాష్ట్రాన్ని కేవలం ఏడు నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి బాట పట్టిస్తున్నారో ఓటర్లకు వివరించాలి. ఏడు నెలల్లోనే రూ.6,33,568 కోట్లు పెట్టుబడులు తీసుకురావడం తద్వారా 4,10,125 మంది యువత రానున్న ఉద్యోగ అవకాశాల గురించి వివరించాలని కోరారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పట్టభద్రులకు వివరించాలి. ఏడేళ్ల తరువాత ప్రజా ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లింపులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యా వ్యవస్థ లో తీసుకొస్తున్న మార్పులు, ఉన్నత విద్య ను గాడిన పెట్టేందుకు విసీల నియామకం, రిక్రూట్మెంట్, తదితర అంశాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని లోకేష్ అన్నారు. ఇన్‌ఛార్జీ మంత్రులు అంతా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం సన్నద్ధం చేయాలని లోకేష్ అన్నారు.
ఈ సమావేశంలో మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మడి సంధ్యారాణి, పొంగూరు నారాయణ, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE