Suryaa.co.in

Andhra Pradesh

1న లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్రం పనులకు శంకుస్థాపన

లిడ్‌ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు

మంగళగిరి: గిద్దలూరు యడవల్లిలో ఫిబ్రవరి 1వ తేదీన 25 ఎకరాల లిడ్ క్యాప్ స్థలంలో లెదర్ ఉత్పత్తుల తయారీ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు తెలిపారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాణిక్యరావు మాట్లాడారు. లెదర్ ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ. 6 కోట్లు కేటాయించి ఆ ప్రాంత చర్మకారులకు జీవనోపాధి మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

రాష్ట్రంలో చర్మ పారిశ్రామికాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం. అనేక రంగాల పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చినట్లే, చర్మ పారిశ్రామికాభివృద్ధికి కూడా త్వరలో పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రానున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన చర్మశుద్ది కేంద్రాలు, లెదర్ గూడ్స్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు లిడ్ క్యాప్ కోసం మినీ, మీడియం, మెగా పార్క్ ల నిర్మాణం కోసం స్థలాలను కేటాయిస్తే.. జగన్మోహన్ రెడ్డి వాటిని తన స్వార్థానికి వాడుకున్నారు. జగన్ అన్యాక్రాంతం చేసిన లిడ్ క్యాప్ భూములు ఆ సంస్థకే చెందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

LEAVE A RESPONSE