– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి: అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల అభివృద్ధే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ సంఘం, ఏపీ ఆర్యవైశ్య మహాసభ, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి, వాసవీ ఫౌండేషన్, ఐవీఎఫ్ ప్రతినిధులు ప్రతినిధులు గురువారం కలిశారు.
రాష్ట్రంలోని వైశ్యులను ఆర్య, శెట్టి, గుప్త, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి అనే పేర్లతో సంభోదిస్తున్నారని, వారందరినీ ఆర్యవైశ్యులుగా ప్రభుత్వం గుర్తిస్తూ చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఆది నుంచి సీఎం చంద్రబాబునాయుడు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఆర్థికంగానూ, రాజకీయంగానూ అభివృద్ధి చెందేలా ప్రాధాన్యమిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. 2018-19లో ఆర్యవైశ్యుల అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.30 కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.
అన్ని కులాల మాదిరిగానే ఆర్యవైశ్యుల్లోనూ పేదలున్నారని, అటువంటి వారిని గుర్తించి ఆర్థికంగా అభివృద్ధే చెందేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ఏపీ బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మాదిరిగా ఆర్యవైశ్యులకు ఆర్థిక భరోసా కల్పించడానికి సహకార క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. త్వరలోనే ఏపీ ఆర్యవైశ్య కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
అమ్మవారి పేరుతో వాసవీ పెనుగొండగా నామకరణం
అమరావతిలో పొట్టి శ్రీరాముల స్మారక స్మతివనం ఏర్పాటుకు 6.8 ఎకరాల కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ఇటీవల ఆర్యవైశ్యుల కులదైవం కన్యకాపరమేశ్వరి అమ్మవారికి ఆత్మార్పణ దినోత్సవం రోజున ప్రభుత్వ తరఫున అధికారికంగా పట్టు వస్త్రాల సమర్పించారన్నారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు జన్మించిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామానికి వాసవీ పెనుగొండ గ్రామంగా త్వరలో పేరు మార్చనున్నామని, ఈ మేరకు త్వరలో జీవో రానుందని తెలిపారు. దామాషా ప్రకారం ఆర్యవైశ్యులకు పదవుల కేటాయిస్తున్నామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు అందజేయబోతున్నామన్నారు.
ఆర్యవైశ్యులుగా గుర్తించేలా కృషి
వివిధ పేర్లతో సంభోదిస్తున్న ఆర్యవైశ్యులను ఒకే గొడుగు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామని, ఇదే విషయం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని మంత్రి సవిత వెల్లడించారు. ఆర్య, శెట్టి, గుప్త, కోమటి, వేగిన, బుక్క, జనపశెట్టి…ఇలా వివిధ పేర్లతో పిలుస్తున్న వైశ్యులందరినీ ఆర్యవైశ్యులుగా గుర్తిస్తూ చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొంథా తుఫాన్ తో భారీ నష్ట కలుగుకుండా సీఎం చంద్రబాబునాయుడు, అధికార యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆర్యవైశ్య సంఘాలు ప్రతినిధులు కొనియాడారు. అనంతరం మంత్రి సవితను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేశ్, భగవాన్ నారాయణ, చిన్ని రామసత్యనారాయణ, కె.రజనీ, తల్లం సత్యనారాయణ, వీవీకే నర్సింహారావు, కోనా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు