Suryaa.co.in

Andhra Pradesh

మెరుగైన పారిశుద్ధ్య సేవలను అందించడమే క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
పామర్రు, అక్టోబర్ 6: గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజలకు సురక్షితమైన, మరింత మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సేవలను అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం – క్లీన్ ఆంధ్రప్రదేశ్ 100 రోజుల కార్యక్రమాన్ని కృష్ణాజిల్లాలో చేపట్టడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా పామర్రు ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి మంత్రి కొడాలి నాని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యకరమైన పరిసరాల్లో ఆహ్లాదకరంగా నివసించాలన్నదే సీఎం జగన్మోహనరెడ్డి లక్ష్యమని చెప్పారు.
క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,097 చెత్త సేకరణ వాహనాలను అందించామన్నారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా సీఎం జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. జిల్లాలోనే అత్యధికంగా 32 వేల మెజార్టీతో పామర్రు నియోజకవర్గాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కైలే అనిల్ కుమార్ మరింత బాధ్యతగా పనిచేయడం జరుగుతుందన్నారు. పామర్రు నియోజకవర్గంలో ఉన్న పామర్రు, పెదపారుపూడి మండలాలు గతంలో గుడివాడ నియోజకవర్గంలో ఉండేవన్నారు. రెండు మండలాల్లోని నాయకులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. పామర్రు ఎమ్మెల్యేగా అనిల్ ప్రజలకు అందుబాటులో ఉంటూ గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కన్నా సమర్ధవంతంగా పనిచేస్తున్నారని చెబుతున్నారన్నారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ఏ సమస్యపై వెళ్ళినా వెంటనే స్పందించి పరిష్కరించడం జరుగుతోందన్నారు. అనిల్ కుమార్ వంటి శాసనసభ్యుడు పామర్రుకు దొరకడం తమ అదృష్టమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భావిస్తున్నారని తెలిపారు. ఇదే అభిప్రాయంతో పామర్రు నియోజకవర్గ ప్రజలు కూడా ఉన్నారన్నారు.
సీఎం జగన్మోహనరెడ్డిపై ఉన్న అభిమానం, ఎమ్మెల్యే అనిల్ పట్ల నమ్మకం పెరుగుతూ వస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా మరింత మెజార్టీతో ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ గెలుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జే. నివాస్, ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, దూలం నాగేశ్వరరావు, కొక్కిలిగడ్డ రక్షణనిధి, సింహాద్రి రమేష్ బాబు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివశంకర్, జిల్లా పరిషత్ సీఈవో సూర్యప్రకాశరావు, డీపీవో జ్యోతి, డీఎల్పీవో నాగిరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE