– టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర
మచిలీపట్నం : ఉద్యోగ, ఉపాధ్యాయులు చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమంపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పోలీసులను పెట్టి ఉద్యోగుల ఉద్యమాన్ని ఎంత అణచివేయాలని చూసినా ఉవ్వెత్తున ఎగిసిపడి విజయవాడను హోరెత్తించింది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి ఉద్యోగుల పట్ల కక్ష ధోరణితో వ్యవహరించకుండా వారి డిమాండ్ల పరిష్కరదిశగా ముందుకెళ్ళాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
ప్రభుత్వం ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా, మీ ఇష్టం వచ్చినట్లు జి.వో.లు ఇస్తూ, వారికి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న ఉద్యోగులను పోలీసులతో అణచాలని చూడటం సిగ్గుచేటు.
ఐకమత్యంగా పోరాటం చేస్తున్న ఉద్యోగస్తులకు మా సంపూర్ణమద్దతు తెలియజేస్తున్నాం. ఉద్యోగస్తుల పోరాటానికి రాష్ర్టంలోని అన్ని ప్రజాసంఘాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలతో పాటు సామాన్యప్రజల మద్దతుకూడా పుష్కలంగా ఉంది.
జగన్‌మోహన్ రెడ్డి ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు, వారి డిమాండ్లపై పునరాలోచించుకోని వారికి అన్నివిధాలుగా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అని తెలిపారు.