– వర్ల రామయ్య
ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడింది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం వద్ద లేదు. పండగరోజున కూడా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ప్రభుత్వం పస్తులు పెట్టింది. సామాజిక పెన్షన్లు కూడా నేటికి 50శాతం మాత్రమే పంపిణీ చేశారు. వై.ఎస్.ఆర్ ఆసరా డబ్బులు కూడా మహిళల ఖాతాలోకి 30శాతం మాత్రమే జమయ్యాయి. జగన్ రెడ్డి నొక్కి బటన్లు కేవలం డబ్బులు లేని ఉత్తుత్తి బటన్లు మాత్రమే. జగన్ రెడ్డి పాలనలో ఆర్థిక సంక్షోభం రావడం ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అడ్డగోలుగా నిత్యావసరాలపై రేట్లు పెంచి దోచుకుంటుందనే వాస్తవాలు ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి.
వీటి నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్ రెడ్డి ఇటీవల టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు పేరును ఎన్ఠీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తొలగించారు. తాజాగా విజయనగరంలో ఆసుపత్రులకు పెట్టిన మహారాజు పేర్లను మార్పిడికి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి తన అసమర్థతను, చేతగానితనాన్ని కప్పి పుచుకునేందుకే మహనీయుల పేర్లపై దాడి చేసి వర్గ, ప్రాంత వైషమ్యాలు సృష్టించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రను తాకనున్న నేపథ్యంలో ప్రజలు దానివైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు జగన్ రెడ్డి పన్నిన కుట్రలో భాగమే మహారాజు పేరు తొలగించడం. దీన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ అం టే మహనీయుల పేర్లు తొలగించి విద్వేషాలు రెచ్చగొట్టడమేనా జగన్ రెడ్డి? సమాధానం చెప్పాలి