-సమస్యలు పరిష్కరించమంటే మొఖం చాటేశారు…
-గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని ఎదుట ఏకరువు
-దశలవారీగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ
-14,15,16 వార్డుల్లో ఇంటింటి ప్రచారం
‘మాకు కళ్యాణ మండపం సమస్య ఉంది. మండపం నిర్మాణం చేసి ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటువైపు రావడమే మానేశారు’ అని మంగళగిరిలోని 16వ వార్డుకు చెందిన ఓ మహిళ స్థానిక ఇబ్బందులను గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు వివరించారు. మంగళగిరి పర్యటనలో భాగంగా గురువారం ఉదయం స్థానిక 14, 15, 16 వార్డుల్లో డాక్టర్ పెమ్మసాని పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో భాగంగా నివాస ప్రాంతాలు, వస్త్ర, వాణిజ్య, వ్యాపార, కూరగాయల దుకాణాలలోని వ్యక్తులను ఆయన కలుసుకున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే ఆర్కే కారణంగా తలెత్తిన ఇబ్బందులపై వివరాలు సేకరించారు.
పర్యటనలో భాగంగా కబేళా, టౌన్ హాల్, కళ్యాణ మండపం తదితర సమస్యలపై స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించమని స్థానిక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ సమస్యలకు దశలవారీగా పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబద్దయ్య, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, కార్యదర్శి షేక్ రియాజ్, జనసేన మంగళగిరి, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు మునగపాటి మారుతీరావు, జనసేన చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సాంబశివరావు, దుగ్గిరాల మండల అధ్యక్షుడు పసుపులేటి శ్రీని వాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు కాండ్రు భాను కిశోర్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తులిమిల్లి శ్రీనివాసరావు, నరసరావుపేట ఓబీసీ ఇన్చార్జ్ కొలివికారు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.