జగన్ ను ఓడించాలి

-జగన్ లాంటి నేరస్థులు ఉండకూడదు
-షర్మిలకు మద్దతు లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా?
-జగన్ మళ్లీ రావడం రాష్ట్రానికి మంచిది కాదు
-జగన్ ప్రభుత్వం రక్తంతో మునిగి ఉంది
– జగన్ సోదరి, వైఎస్ వివేకా కూతురు డాక్టర్ సునీతారెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘‘ఇలాంటి అన్నయ్య వచ్చే జన్మలోనూ మా ఇంట్లోనే పుట్టాలి. మా అన్నయ్య మాకు తండ్రి, గురువు, దైవం. మమ్మల్ని బిడ్డలుగా చూసుకునే అన్నయ్యకు చెల్లిగా పుట్టడం మా అదృష్టం’’ ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే కాదు. అప్పుడప్పుడూ మన ఇళ్లలోనూ వింటుంటాం. చూస్తుంటాం. కానీ ఎదుగూరి సందింటి.. అందే వైఎస్ కుటుంబంలోని ఆడబిడ్డల మాటలు మాత్రం, అందుకు రివర్స్‌గా వినిపిస్తున్నాయి.

‘‘మా అన్నయ్య హంతకులను రక్షిస్తున్నాడు. నాకు ఈమె చెల్లికాదు. బిడ్డ అని చెప్పిన ఆ అన్నయ్య జగన్ మాత్రమేనాకు తెలుసు. కానీ ఈ జగన్మోహన్‌రెడ్డి ఎవ రో నాకు పరిచయం లేడు. మా అన్నయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మారిపోయాడ’’ని సొంత చెల్లి షర్మిల చెప్పింది.

‘‘మా ఇంట్లోనే మా చుట్టూ హంతకులున్నారన్న సంగతి మాకు తెలియదు. నా తండ్రి హత్య తర్వాత నిజాలు దాచి మమ్మల్ని మోసం చేశాడు. నా తండ్రిని చంపింది అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి. అతనికి దన్నుగా నిలిచింది జగన్ అన్నయ్య. అధికారం అడ్డుపెట్టుకుని వారిని కాపాడుతున్నాడు. ఆయన ప్రభుత్వం రక్తంతో తడిసిపోయింది. ఎవరైనా చెల్లిని ప్రాణంతో చూసుకుంటారు. కానీ ఈ అన్నయ్య సొంత చిన్నాన్నను చంపిన వారిని ప్రాణంగా చూసుకుంటున్నాడు. మా తండ్రిని మేమే చంపించామని నీచమైన రాతలు రాయిస్తున్నాడు. మమ్మల్ని రోడ్డుమీదకు తెచ్చాడు. ఈ జగన్‌ను ప్రజలు ఓడించాలి. అవినాష్‌రెడ్డిని కూడా ఓడించాలి. నాకు రాజకీయాలు తెలియవు. ప్రజలు మరోసారి మోసపోవద్దు’’ అని చిన్నాన్న కూతురు, జగన్‌కు సోదరి అయిన డాక్టర్ సునీతారెడ్డి చెబుతోంది.

కానీ మంత్రి రోజా మాత్రం.. వేదికలపై జగన్ గారు షర్మిల, సునీతతో సమానంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను చూసుకుంటున్నారని చెబుతున్నారు. ఆ వీడియో ఇప్పుడు మళ్లీ సోషల్‌మీడియాలో ప్రత్యక్షమై వైసీపీని తెగ ఇబ్బంది పెడుతోంది.

ఇప్పుడు జగన్ సోదరి డాక్టర్ సునీతారెడ్డి మరోసారి గళం విప్పారు. తన అన్నయ్య జగన్‌ను ఓడించాలని, ఈ విషయంలో ప్రజలు మరోసారి మోసపోవద్దని పిలుపునిచ్చింది. తన అన్నయ్య ప్రభుత్వం రక్తంతో నిండిపోయిందని ఘాటు వ్యాఖ్యలతో సంచలనం సృష్టించిన డాక్టర్ సునీత ఇంకా ఏమన్నారంటే…

షర్మిలకు మద్దతు కూడా లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాలి. వీలైతే జగన్ ను కూడా ఓడించాలి. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి. ప్రస్తుతానికి ఇదే నా లక్ష్యం. కోర్టుల్లో శిక్ష పడకుండా జగన్ తప్పించుకుంటున్నారు. ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్థులు ఉండకూడదు . మరోసారి మోసం చేసి గెలవాలని జగన్ చూస్తున్నారు.

ప్రజల్ని పదేపదే మోసం చేయడం కుదరదు. వివేకాను సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా హత్య చేశారు. హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదు. జగన్ మళ్లీ రావడం రాష్ట్రానికి మంచిది కాదు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే హత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలి. జగన్ ప్రభుత్వం రక్తంతో మునిగి ఉంది. నేనెప్పుడూ రాజకీయాల్లో లేను. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జగన్ ను కోరుతున్నా. రెండేళ్ల క్రితం పులివెందులలో మాపై కేసు పెట్టారు. తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తున్నామని పెట్టిన కేసు ఇటీవల ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోర్టుకు వచ్చాను.

Leave a Reply