సేవ చేయడం కర్తవ్యంగా భావించాలి

-సేవ చేయడం అంటే ముష్టి వేయడం కాదు
-ప్రతి హిందువుకు విశ్వహిందూ పరిషత్ అండ
-ప్రతి హిందువు విశ్వహిందూ పరిషత్ కు ఆత్మబంధువే
-విశ్వహిందూ పరిషత్ ఉన్నంతవరకు సమాజంలో ఏ హిందువూ అనాథ కాలేడు
-కరుణ శ్రీ సేవా సమితి రజోత్సవాల సందర్భంగా భవనం మూడవ అంతస్తు ప్రారంభం
-దాతల సహకారంతోనే “కరుణశ్రీ” సేవలు
-విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన కార్యదర్శి వినాయకరావు దేశ్ పాండే

హైదరాబాద్: “సేవ చేయడం అంటే జాలి చూపడం.. దయ చూపడం.. ముష్టి వేయడం కాదు.. సేవ అనేది కర్తవ్యంగా భావించాలి” అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ సహ సంఘటన మంత్రి వినాయకరావు దేశ్ పాండే అన్నారు. తమ రక్తసంబంధీకులకు ఏ విధమైన సేవ చేస్తామో.. ఆపద కాలంలో ఏ విధంగా అండగా నిలుస్తామో.. సమాజంలోని దీనుల విషయంలో కూడా అదే విధమైన ప్రేమ చూపాలని పేర్కొన్నారు.

కరుణ శ్రీ సేవాసమితి 25వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం సైదాబాద్ లోగల కరుణ శ్రీ సేవా సమితి ఆశ్రమాన్ని వినాయకరావు దేశ్ పాండే సందర్శించారు. కరుణ శ్రీ సేవా సమితి అనే స్వచ్చంద సంస్థను 1995లో స్థాపించారని.. నేడు అది 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన స్వచ్ఛంద సేవా సంస్థ మూడవ అంతస్తు భవనం, ఆపై పెంట్ హౌస్ తో పాటు, సోలార్ ప్రాజెక్టును వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో హోమం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశానికి కరుణ శ్రీ సేవా సమితి అధ్యక్షులు ఆచార్య కడారి సత్యమూర్తి అధ్యక్షత వహించారు.

విశ్వహిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర సంఘటన కార్యదర్శి సత్యం జి, రాష్ట్ర అధ్యక్షులు భోజనం పల్లి నరసింహమూర్తి , రాష్ట్ర కార్యదర్శి శాలివాహన పండరినాథ్ , క్షేత్ర సేవ ప్రముఖ్ బండారి రమేష్ , ప్రాంత సేవా ప్రముఖ్ రాజేందర్ రెడ్డి , కరుణ శ్రీ సేవా సమితి కార్యదర్శి పుప్పాల వెంకటేశ్వర్ రావు సభా ప్రారంభంలో సరస్వతీ మాత, భరతమాత చిత్రపటాలకు పూజ చేశారు.

ఈ సందర్భంగా వినాయక రావు దేశ్ పాండే మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి హిందువు తమ ఆత్మబంధువు అనే భావనతో 1964లో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించిందని చెప్పారు. సమాజంలోని ఏ హిందువు కూడా అనాధ కాదని, ప్రతి హిందువుకూ విశ్వహిందూ పరిషత్ ఆత్మబంధువు అని ఆయన చెప్పారు. సృష్టిలోని హిందువులంతా ఒకే కుటుంబమని, వారంతా విశ్వహిందూ పరిషత్ బంధువులని స్పష్టం చేశారు. విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా 6వేల సేవ ప్రకల్పాల ద్వారా సమాజానికి సేవ చేస్తుందన్నారు.

ఆకలిగా ఉన్నప్పుడు భోజనం పెట్టి, బాధగా ఉన్నప్పుడు కళ్ళు తుడిచి పంపడం సేవ కాదన్నారు. విద్యా బోధన, ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాల పై అవగాహన, శిక్షణ తరగతులు నిర్వహించడం, కుట్టు పనులు నేర్పించడం, డ్రైవింగ్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, జూట్ బ్యాగు తయారీ వంటి అనేక స్వయం ఉపాధి కల్పన కేంద్రాలు నిర్వహిస్తూ సమాజానికి చేదోడువాదోడుగా విశ్వహిందూ పరిషత్ పనిచేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 80 శాతం ఎస్సీ ,ఎస్టీ ,గిరిజన, వనజాతి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని చైతన్యం చేస్తుందన్నారు.

కొండ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో విద్య నేర్పితే మతమార్పిడి ఆగిపోతుందని.. క్రైస్తవ మిషనరీల ఆగడాలకు అడ్డుకట్టపడుతుందన్నారు. సమాజంలోని వైపరీత్యాల వల్ల రకరకాల కారణాలవల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చేరదీసి ప్రయోజకులుగా తీర్చిదిద్దేందుకు విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ హిందూ సమాజానికి అండగా నిలుస్తుందని ఉదాహరణలతో సహా వివరించారు. ఈశాన్య రాష్ట్రాలతో సహా గోవా రాష్ట్రాల్లో విశ్వహిందూ పరిషత్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో క్రైస్తవ మిషనరీల మత మార్పిడి చాలావరకు ఆగిపోయిందని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్ సేవ ప్రకల్పాల ద్వారా చదువుకున్న వేలాది మంది యువకులు ప్రయోజకులయ్యారని పేర్కొన్నారు.డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, చివరకు ఉత్తరప్రదేశ్ ,మహారాష్ట్ర క రాష్ట్రాల్లో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలిచి సమాజ సేవలో తరిస్తున్నారని వివరించారు. గోవా రాష్ట్రంలో మాతృమయి పేరుతో కొనసాగుతున్న సేవా సంస్థ రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నదని గుర్తు చేశారు. సమాజంలోని ప్రతి హిందువులకు విశ్వహిందూ పరిషత్ అండగా ఉంటూ వారిని చైతన్య పరుస్తూ పరివర్తన దిశగా తీసుకెళ్తుందని చెప్పారు.

విశ్వహిందూ పరిషత్ ఉన్నంతవరకు సృష్టిలో ఏ హిందువు అనాధ కాదని వివరించారు. భాగ్యనగర్ లో కూడా నిరుపేద కాలనీలు, వెనుకబడిన ప్రజల చేయూత కోసం విశ్వహిందూ పరిషత్ సేవ ప్రకల్పాలు పనిచేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 160 ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, 33 బాల కళ్యాణ్ కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో 500 కు పైగా పాఠశాలలు, 1600కు పైగా వైద్య కేంద్రాలు, 900 సంస్కార శాలలు, 400 శిక్షణ కేంద్రాలు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని వినాయక్ రావు జి చెప్పారు.

అంతకుముందు కరుణశ్రీ సేవాసమితి కార్యదర్శి పుప్పాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంస్థ నివేదిక వివరించారు. విశ్వహిందూ పరిషత్ షష్టిపూర్తి సందర్భంగా భవనం మూడవ వంతస్తు నిర్మించుకోవడం సంతోషకరమని, అందుకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సత్యమూర్తి గారు మాట్లాడుతూ 1995లో విశ్వహిందూ పరిషత్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు దివంగత మాణిక్య చారి గారు కరుణ శ్రీ సేవా సమితి నీ ప్రారంభించారని.. అప్పుడు కేవలం ఐదుగురు విద్యార్థులతో ఆశ్రమం ప్రారంభమైందని.. నేడు 40 మంది విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నారని చెప్పారు.

దాతల ప్రేమను రాగాలతోనే తమ ఆశ్రమం ముందుకు సాగుతుందన్నారు. ఎటువంటి ప్రభుత్వ సహకారం లేకుండా సమాజంలోని ఉదార భావం గల దాతల విరాళాలతో తాము విద్యార్థులను తీర్చి దిద్దుతున్నామని వివరించారు. కార్యక్రమంలో కరుణ శ్రీ సేవా సమితి కోశాధికారి రాజపేట సత్యనారాయణ, గుర్రం సుదర్శన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ నాయకులు జగదీశ్వర్ , రాజేశ్వర్ రెడ్డి, పగుడకుల బాలస్వామి, కుమారస్వామి, శివ రాములు, రాజేందర్ రెడ్డి, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply