Suryaa.co.in

Telangana

ప్రకృతి విజ్ఞానమే సమస్త ప్రాణ కోటికి జీవాధారం

-వ్యాపార దృక్పథ విజ్ఞానం విశ్వ మానవాళికి ప్రమాదకరం
-మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి శిరోధార్యం
-ప్రకృతి వైద్యం, విద్య, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాల కట్టడి ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది
-ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి
-మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి

దేశంలో ప్రకృతి వైద్యం, విద్య , సేంద్రియ వ్యవసాయం, కుటీర, భారీ పరిశ్రమలు, పర్యావరణం వంటి అంశాలు స్వదేశీ ఆలోచనలతో స్వావలంబన దిశగా పురోగతి సాధించాల్సిన అవసరం ఉందని, అలా జరిగినప్పుడే దేశం స్వాభిమానంతో వర్ధిల్లుతుందని, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి శిరోధార్యం అని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

మంగళవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్ ప్రాంగణంలోని తెలంగాణ – ఏపీ భూదాన్ యజ్ఞ బోర్డ్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను వేసి డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మహాత్మా గాంధీ కన్న కలలు ఇప్పటికి సాకారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

భారతీయ సంస్కృతి కలుషితం అయిపోయిందని, ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోందని, మాదక ద్రవ్యాల విజృంభణ… తద్వారా మనిషి జీవితం దుర్భరంగా తయారయ్యింది అని రాజేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలాంటి విష వలయం నుంచి ప్రజలు బయటకు రావాలంటే సుస్థిర అభివృద్ధి అవసరమని, నాణ్యమైన విద్య, ప్రకృతి వైద్యం, సేంద్రియ వ్యవసాయం, కుటీర పరిశ్రమల అభివృద్ధి వంటి అంశాల అత్యంత ఆవశ్యకత ఉందని డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ప్రకృతి విజ్ఞానమే సమస్త ప్రాణ కోటికి జీవాధారమని, వ్యాపార దృక్పథం విశ్వ మానవాళికి ప్రమాదకరం అని రాజేందర్ రెడ్డి అన్నారు.

మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దేశానికి శిరోధార్యం అని, అహింసా మార్గం అనుసరణీయం అని, శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యమని, సుస్థిర ప్రకృతి వైద్యం, విద్య, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలను అదుపు చేయడం వంటి అంశాలపై ప్రజలు.. ముఖ్యంగా యువత దృష్టిని సారించాలని డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి పిలుపనిచ్చారు.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థలు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను రాజేందర్ రెడ్డి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, కే. సుభాష్ చంద్ర, పీ. హరదీప్ రెడ్డి, ప్రభు, స్వరూపా, మనీషా, మణి సాయి, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE