Suryaa.co.in

Telangana

జూన్ 1 నుంచి యాదాద్రిలో సంప్రదాయ దుస్తుల తో ఆర్జిత పూజలు

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అధికారులు ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యాదాద్రి పంచనారసింహుల దైవారాధనల్లో (ఆర్జిత పూజలు) పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని, ఈ ఆచారాన్ని జూన్‌ 1వ తేదీ నుంచి ఆచరణలోకి తెస్తున్నట్లు ఆలయ ఈవో ఎ.భాస్కర్‌రావు తెలిపారు.

ఆర్జిత పూజలతో పాటు బ్రేక్‌ దర్శనానికి వెళ్లే భక్తులు కూడా సంప్రదాయ దుస్తులతో రావాలని ఆయన సూచించారు.మరోవైపు సీనియర్‌ సిటిజన్లకు ప్రతి మంగళవారం ఉచితంగా దైవదర్శనం చేసుకునే అవకాశాన్ని జూన్‌ నుంచి అమలులోకి తెస్తున్నట్లు ఈవో భాస్కర్ రావు తెలిపారు.

సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు గంటపాటు ఈ దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. భక్తులంతా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకుని పైన చెప్పినట్లుగా వచ్చి ఆలయ సిబ్బందికి సహకరించాలని ఈవో కోరారు.

మరోవైపు వేసవి నేపథ్యంలో రోజురోజుకు యాదాద్రికి పోటెత్తుతున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. సెలవుల నేపథ్యంలో కుటుంబంతో కలిసి పెద్ద ఎత్తున భక్తులు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి తరలివస్తున్నారు.

LEAVE A RESPONSE