అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన దుస్థితి

-ఈనాడు రాసింది అక్షర సత్యం
-ఓటు వేయాలనుకునేవారు తస్మాత్ జాగ్రత్త
-ఇసుక ధర తగ్గించండి… భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించండి
-ఎంపీ రఘురామకృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు తీర్చడానికి అప్పులు చేయాల్సిన దుస్థితిని ఎదుర్కొంటుందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరిస్తూ ఆయన ఒక లేఖ రాశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల సంఖ్య ప్రస్తుతం తగ్గినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం 8.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. ఇప్పటికే 1.50 లక్షల కోట్ల రూపాయలు చేయించుకున్న పనులకు, కొనుగోలు చేసిన సామాగ్రికి చెల్లించవలసి ఉందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం 8.50 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, కేవలం 4.50 లక్షల కోట్ల రూపాయల రుణాలను మాత్రమే చేసినట్లుగా చెబుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర జి ఎస్ డి పీ లో 40 శాతం అప్పులను మాత్రమే చేశామని చెబుతున్నప్పటికీ, 70 నుంచి 75% మేరకు అప్పులు చేశారని తెలిపారు. ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం విధించిన రుణ పరిమితికి మించి ఏడు నెలల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులను చేసిందన్నారు. ఇప్పటికే 49,500 కోట్ల రూపాయల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం చేయగా, మరో 8 వేల కోట్ల రూపాయలు లిక్కర్ బ్రాండ్ల ద్వారా, రెండు వేల కోట్ల రూపాయలు వివిధ కార్పొరేషన్ల పేరిట రుణాలను పొందినట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 7, 8 వ తేదీల నాటికి పూర్తిస్థాయిలో జీతాలు చెల్లించే వారిని, కానీ ఈ నెల 12వ తేదీ వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి జీతాలు చెల్లించలేదన్నారు. ఇదే విషయమై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కట్టా నరసింహారెడ్డి ముఖ్యమంత్రి కి లేఖ రాశారని తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఉపాధ్యాయులకు ఏడు డీ ఏ లను, పోలీసులకు మూడు నెలల జీతాలింకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డిఏల మొత్తం 12 వేల కోట్ల రూపాయలు కాగా, పోలీసులకు చెల్లించాల్సిన మూడు నెలల జీతం కూడా వందల కోట్లలోనే ఉంటుందన్నారు. నిజాయితీగా పని చేసే పోలీసులు, ఉపాధ్యాయులు రాష్ట్రంలో పని చేసే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు చెల్లించ లేకపోతే, ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబితే ఎవరూ నమ్ముతారని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో ఆర్టికల్ 360 ని ప్రయోగించి అయినా సరే ఈ పెను ఉపద్రవం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడాలని రఘురామకృష్ణం రాజు ప్రధానమంత్రిని కోరారు. రాష్ట్ర ప్రజలను ఆర్థిక సుడిగుండం నుంచి బయటపడేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ వాలంటీర్ల గురించి ఈనాడు దినపత్రిక రాసిన వార్తా కథనం అక్షర సత్యమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు ఏవైనా సరే బ్యాంకు అకౌంట్ ద్వారా నేరుగా చెల్లించవచ్చు. పింఛన్లు ఇంటికి వెళ్లి చెల్లించడం కోసం గ్రామం వాలంటీర్ వ్యవస్థ సృష్టించారు. వాలంటీర్లు ఇళ్లల్లోకి ప్రవేశించడానికి ప్రభుత్వం అధికారం కల్పించింది. దాన్ని వారు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు.

జగన్ బాబు ఉన్నంతవరకే ఈ పథకాలు అమలు జరుగుతాయని చెబుతున్నారు. లేకపోతే ఈ పథకాలు ఉండవని నిరక్షరాస్యులైన వృద్ధులను బెదిరిస్తున్నారు. పింఛన్లు ఇచ్చేవారు గుడాచారులా అని సాక్షి దినపత్రికలో రాసిన కథనంపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ… మంత్రులు అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా లు గతంలో చేసిన ప్రసంగాల వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు. వాళ్లు ఏమి పని చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, రాజకీయ లబ్ధి కోసమే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు.

డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన దాన్ని ఉపయోగించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి?. రాష్ట్రంలోని మూడు లక్షల 25 వేల మంది గ్రామ వాలంటీర్లకు డబ్బులు డ్రా చేసి ముందుగానే ఇస్తే, వారు దాన్ని చక్ర వడ్డీలకు తిప్పుకుంటున్నారని తెలుస్తోంది. గ్రామ వాలంటీర్ల వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతో ప్రజాస్వామ్యం పై నమ్మకం ఉన్న పత్రికగా ఈనాడు దినపత్రిక చక్కటి వార్తా కథనాన్ని ప్రచురించింది అని రఘురామకృష్ణం రాజు అభినందించారు.

గ్రామ వాలంటీర్ల పుణ్యమా అని రాష్ట్రంలో ఓటు వేసే ప్రజల సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉందని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లను, ఓటరు జాబితాలో నుంచి తొలగించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులైన వారిని హీనపక్షంగా పదివేల మందినిఓటర్ల జాబితా నుంచి తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. దీనితో స్వల్ప మెజారిటీతోనైనా రానున్న ఎన్నికలలో కొన్ని స్థానాలలో బయటపడవచ్చునని అధికార పార్టీ భావిస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించాలనుకునేవారు ముందు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సూచించారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందే ఓటర్ల జాబితాలో పరిశీలించాలన్న ఆయన, ఒకవేళ ఓటు హక్కు లేకపోతే తొలగించిన వారిపై చర్యలకు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలన్నారు.

గ్రామ వాలంటీర్లను ఎన్నికల కమిషన్ ఎన్నికల విధుల నుంచి తొలగించడం ఖాయమని తెలిసిన తర్వాతే గృహ సారధులు అనే వ్యవస్థను తమ ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చిందన్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను తొలుత ఒడిషా ప్రభుత్వం అమలు చేసినప్పటికీ, ఆశించిన ప్రయోజనాలు కనిపించకపోవడంతో తొలగించిందన్నారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ పై ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు న్యాయస్థానాలకు ఫిర్యాదు చేసి, ఈ ఇనుప చట్రాల నుంచి రాష్ట్ర ప్రజలను బయట పడేలా చూడాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సరసమైన ధరకే ఇసుకను విక్రయిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలోని 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని ఉండాలంటే, ఇసుక అందుబాటులో ఉండాలన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం టర్న్ కి అనే సంస్థ ద్వారా ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటుందన్నారు.

ఇసుకపై ఉన్న ధన దాహంతో ప్రభుత్వ పెద్దలు, రాష్ట్రంలోని 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెబుతున్న ధరలకు ఇసుక లభిస్తే భవన నిర్మాణరంగం ఊపందుకొని రాష్ట్ర జి ఎస్ డి పీ కూడా వృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో విరివిగా లభించే ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించి ప్రభుత్వ పెద్దలు సొమ్ము చేసుకుంటున్నారు అన్నారు. దీనితో రాష్ట్రంలోని తాపీ మేస్త్రీలు హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్ వంటి పట్టణాలకు వలసలు వెళుతున్నారని తెలిపారు. 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అంటే, ఇంటికి మూడు ఓట్లు వేసుకున్న 30 లక్షల ఓట్లు అని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఆ ఓట్లు రానున్న ఎన్నికల్లో ఎలాగు మనకు పడే అవకాశం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దన దాహం తీరితే ఇకనైనా ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులకు చేతినిండా పని కల్పించాలని కోరారు. ఎమ్మెల్సీ అనంత బాబుకు డిపాల్టర్ బెయిలు లభించడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని పేర్కొన్నారు. ఈ సంఘటన ద్వారా న్యాయానికి, ధర్మానికి అన్యాయం జరిగినా, తాము హత్యలు చేసిన కాపాడేందుకు తమ ప్రభుత్వ పెద్దలు ఉన్నారనే ధీమా నిందితుల్లో కనిపించే అవకాశం ఉందన్నారు.

Leave a Reply