– వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ ఆదేశం
– ఢిల్లీ వెళ్లి ఎన్ఎంసితో సమావేశం కానున్న ఎపిఎంసి చైర్మన్ , రిజిస్ట్రార్
విజయవాడ: పలు విదేశాల్లో వైద్యవిద్యనభ్యసించి శాస్వత రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్న వైద్యుల డిమాండ్ పై వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులతో డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో బుధవారంనాడు విస్తృతంగా చర్చించారు.
ఈ విషయంపై ఆయన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ వైద్య సంఘం చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్, డిఎంఇ డాక్టర్ నరసింహం ఇతర ఉన్నతాధికారులతో పలు అంశాలపై చర్చించారు.
విదేశీ వైద్య విద్యార్థుల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి జాతీయ వైద్య సంఘం(ఎన్ ఎంసి) పలు విడతలుగా జారీ చేసిన ఆదేశాలు, కోవిడ్ కాలంలో ఆన్‌లైన్ వైద్య విద్య అభ్యసించిన వారు మన దేశంలో చేయాల్సిన ఇంటర్నెషిప్ కాలపరిమితి, విద్యార్థుల అభిప్రాయాల్ని ఎన్ ఎంసికి తెలియజేసి సమస్యకు పరిష్కార మార్గాన్ని కనుగొనాలని మంత్రి ఆదేశించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య సంఘం చైర్మన్ డాక్టర్ శ్రీహరిరావు, రిజిస్ట్రార్ డాక్టర్ రమేష్ త్వరలో ఢిల్లీ వెళ్లి ఎన్ ఎంసి అధికారులతో భేటీ కానున్నారు.
2021 వరకు శాస్వత రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ రిజిస్ట్రేషన్ చేశామని ఎపిఎంసి అధికారులు మంత్రికి వివరించారు. తదుపరి వచ్చిన దరఖాస్తులు మన దేశంలో చేయాల్సిన ఇంటర్నెషిప్ కాలపరిమితిపై స్పష్టత కోసం పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా జాతీయ వైద్య సంఘం విదేశాల్లో వైద్యవిద్యనభ్యసించిన ప్రతి విద్యార్థీ నిబంధనల మేరకు ఒకటి నుండి రెండు సంవత్సరాల పాటు భారత దేశంలో ఇంటర్నెషిప్ చేయాలని నిబంధన విధించింది.