Suryaa.co.in

Andhra Pradesh

అధికారుల్ని ప్రలోభపెడుతూ, అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ గుర్తింపుని తక్షణమే రద్దు చేయాలి

• వైసీపీనాయకుల్ని నమ్మి గిరీశా.. చంద్ర మౌళీశ్వర్ రెడ్డి లాంటి అధికారులు బలైపోయారు.. మరి మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి లాంటి వారి సంగతేమిటి?
• ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ముచేసేలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న వైసీపీ నేతల్ని ఎన్నికల్లో పోటీచేయకుండా ఎన్నికల సంఘం టెర్మినేట్ చేయాలి
• ఓటర్ల జాబితాలో అవకతవకలు.. ఇతర తప్పిదాలకు పాల్పడే చిన్నస్థాయి అధికారులతో పాటు, పెద్దపెద్ద తిమింగలాలపై కూడా ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలి
– మాజీ మంత్రి కె.ఎస్.జవహర్

అధికారాన్ని అడ్డుపెట్టుకొని, వ్యవస్థల ద్వారా లబ్ధిపొందేందుకు, జగన్ రెడ్డి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడని, చివరకు ఎన్నికల వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికి అధికార యంత్రాంగాన్ని భ్రష్టుపట్టించాడని, ఓటర్లను.. అధికారుల్ని ప్రభావితం చేస్తూ, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తహతహలాడుతున్నాడని, దేశంలో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా ఓటర్ల జాబితాను జగన్ రెడ్డి దుర్వినియోగం చేస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కే.ఎస్.జవహర్ తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..

“ అధికారుల లాగిన్ ఐడీతో ఓటర్ కార్డుల్లో మార్పులుచేర్పులు చేయించిన జగన్ రెడ్డి నిర్వాకంతో చివరకు అధికారులు బలైపోతున్నారు. గతంలో తిరుపతి ఎంపీ ఉపఎన్నికల్లో జగన్ రెడ్డి, అతని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల సాయంతో చేయాల్సిన అక్రమాలన్నీ చేశారు. ఇప్పుడు మరలా అదే తిరుపతి అసెంబ్లీ పరిధిలో మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల తాము చేసే తప్పులకు అధికారుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. తమ తప్పులకు కింది స్థాయి అధికారుల్ని బలిచేస్తూ, పైనుండే పెద్ద తిమింగలాల్ని ఎందుకు వదిలేస్తున్నారో ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి.

మంగళగిరి తహసీల్దార్ గా పనిచేసిన రామ్ ప్రసాద్ డిప్యుటేషన్ పై ఎన్నికల సంఘం కార్యాలయంలో పనిచేయడమేంటి?
గతంలో మంగళగిరి తహసీల్దార్ గా పనిచేసిన రామ్ ప్రసాద్, నేడు ఎన్నికల సంఘం కార్యాలయంలో డిప్యుటేషన్ పై పనిచేయడం ఏమిటి? ఆరోపణలున్న ఇలాంటి వారే కీలకస్థానాల్లో మరీ ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో ఎలా విధులు నిర్వహిస్తున్నారో ప్రభుత్వం, ఎన్నికల సంఘమే చెప్పాలి. ఎన్నికల వ్యవస్థని మేనేజ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని చూస్తున్న జగన్ రెడ్డికి సహకరిస్తున్న అధికార యంత్రాంగంపై, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఎందుకు తటపటాయిస్తోంది. ఎన్నికల సంఘం వైఖరితో ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం సన్నగిల్లదా?

గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరక్షరాస్యులతో ఓట్లు వేయించారు. అదెలా జరిగిందో అప్పుడు ఎన్నికలవిధుల్లో పాల్గొన్న అధికారులే చెప్పాలి. గతంలో స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో కూడా దొంగఓట్లు పడుతున్నాయని అప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెబితే, ఆయనపై జగన్ సర్కార్ కక్ష కట్టింది. నానా రకాలుగా వేధించి, చివరకు ఆయన రాష్ట్రం వదిలిపోయేలా చేసింది.

ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడి, తన పార్టీ వాళ్లను గెలిపించిన అధికారులకు.. పార్టీనేతలకు జగన్ రెడ్డి కీలక పదవులు కట్టబెట్టడాన్ని ఏమనాలి?
ప్రభుత్వాధికారుల లాగిన్ ఐడీలతో ఎక్కడెక్కడ ఏఏ నియోజకవర్గాల్లో జగన్ పార్టీ వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు? తమకు ఉన్న అధికారాలు. స్వేచ్ఛను అధికారపార్టీకి ధారాధత్తం చేసి, వ్యవస్థల నిర్వీర్యానికి పాటుపడు తున్న అధికారులు ఎవరు.. వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ప్రభుత్వం స్పందించకపోయినా ఎన్నికల సంఘం వారిని ఎందుకు ఉపేక్షిస్తోంది?

చంద్ర మౌళీశ్వర్ రెడ్డి అనే అధికారి మంత్రి పెద్దిరెడ్డికి చుట్టమా? గిరీశా అనే అధికారి ఎవరి అండతో తప్పుచేశాడు? ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడి, తన వాళ్లను గెలిపించిన తన పార్టీ వారికి, అధికారులకు ముఖ్యమంత్రి కీలక పదవలు కట్టబెట్టడాన్ని ఏమనాలి? గతంలో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఉపఎన్నికలో అక్రమాలకు పాల్పడినందుకు గాను, జగన్ రెడ్డి ఆయన్ని టీటీడీ ఛైర్మన్ ని చేశాడు. తప్పులు చేసేవాళ్లను ముఖ్యమంత్రే కాపాడుతుంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా?

అధికారంలో ఉన్న వైసీపీ ఇష్టానుసారం రాజ్యాంగవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నా ఎన్నికల సంఘం ఆ పార్టీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఆఖరికి ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించే ఉపాధ్యాయుల్ని కాదని, తాను నియమించిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాబోయే ఎన్నికలు నిర్వహించాలని జగన్ రెడ్డి చూస్తున్నాడు. వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలే అని గతంలో స్వయంగా ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, కొందరు మంత్రులు బహిరంగంగానే చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తే, అధికారులు తప్పు చేయడానికి వెనకాడతారు
రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ, ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజాస్వామ్య హననానికి పాల్పడుతున్న వైసీపీ గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. అలానే ఏపీ ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా అధికారపార్టీ తీరుపై ఎందుకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తోంది అనేదానిపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలి. చేనుకి కాపాలకోసం వేసిన కంచే ఆ చేనుని మేస్తుంటే రాష్ట్రంలో ఇక ప్రజల స్వేచ్ఛకు రక్షణ ఎక్కడ ఉంటుంది?

ఎన్నికల గొప్పతనం, ఓటువిలువ, ఓటుహక్కుకి ఉండే ప్రాధాన్యత ప్రజలకు తెలియాలంటే తప్పుచేసిన అధికారుల్ని కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే శిక్షించాలి. చంద్ర మౌళీశ్వర్ రెడ్డి, అనంతపురం డీఐజీ లాంటి అధికారుల్ని, పూర్తిగా ఎన్నికలకు దూరంచేస్తూ చర్యలు తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించాల్సిన విధంగా స్పందిస్తే ఇకపై ఎవరైనా తప్పుచేయాలంటే వెనకాడతారు. పెద్దపెద్ద తిమింగ లాల్ని వదిలేసి చిన్నచిన్న చేపల్ని శిక్షించినందువల్ల ఉపయోగం ఉండదనే వాస్తవాన్నికూడా కేంద్ర ఎన్నికల సంఘం గ్రహించాలి.

వైసీపీ ఎంపీ గురుమూర్తి, మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు తటపటాయిస్తున్నారు?
ఎన్నికల తంతుని అపహాస్యం చేస్తున్న వైసీపీ ఎంపీ గురుమూర్తి, మంత్రి పెద్దిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలాంటి కొందరు ప్రజాప్రతినిధులు, వారికి స హకరిస్తున్న అధికారులపై చర్యలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎందుకు సంకో చిస్తున్నారు. ఆయన కళ్లప్పగించి చూస్తుంటే అధికారంలో ఉన్నామన్న అహంకారంతో వారు పేట్రేగిపోతున్నారు.

వారు తమకు అండగా ఉన్నారన్న ధైర్యంతో అధికారులు కూడా ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఎన్నికల్లో పోటీ చేయకుం డా అనర్హులుగా ప్రకటించాలి. ఓటర్లజాబితాలో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ గుర్తింపుని కూడా తక్షణమే రద్దుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం.

విలేకరుల ప్రశ్నలకు జవహర్ స్పందన
“ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి, ఓటర్ల జాబితాలో పారదర్శకత కనిపించడంలేదు. మంగళగిరిలో పనిచేసిన రామ్ ప్రసాద్ లాంటి వారిని ఎన్నికల కార్యాలయంలో ఉంచితే ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది. మేజిస్ట్రేట్ హోదా ఉండి కూడా ప్రలోభాలుకు, భయాలకు లొంగిపోయి కొందరు కలెక్టర్లు మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. వ్యవస్థలు బాగుంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది. వచ్చే ఎన్నికల్లో నేను ఎక్కడ పోటీచేయాలనేది చంద్రబాబు నిర్ణయిస్తారు” అని జవహర్ తెలిపారు

LEAVE A RESPONSE