– ప్రభుత్వ నియంతృత్వ పోకడతో దిగజారిన విద్యా ప్రమాణాలు
ప్రభుత్వం అశాస్త్రీయమైన విధానాలు, జీవం లేని విద్య ప్రమాణాలు తో నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తూనే ఉంది. ఉద్యోగాలు లేక కాదు అందుకు తగ్గ పని చేసే వాళ్ళు లేక. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలల్లో దశాబ్ద కాలంగా శ్మశాన ప్రశాంతత నెలకొంది. ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు మరచి పదిహేను సంవత్సరాలయ్యింది. మెరుగైన జీతాలు లేక ప్రభుత్వ ఉపాధ్యాయులు, జీతాలే లేక ప్రైవేటు ఉపాధ్యాయులు కాలం వెళ్లబుచ్చుతున్నారు.
ఈ సంక్షోభం ఇక్కడితో ఆగదు, అజ్ఞాన సమాజం లో వికృత రూపాలు తో సామాజిక సంక్షోభం రాబోతున్నది. ఇప్పుడైనా ప్రభుత్వ సలహాదారులు, ఉపకులపతులు, విద్యా రంగంలోని నిష్ణాతులు, మేధావులు, ఉపాధ్యాయులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులకు మంచి జీతాలు ఇచ్చి శాస్త్రీయమైన పర్యవేక్షణ ఏర్పాటు చేసి విలువలు తో కూడిన విద్య ప్రమాణాలు ను తీసుకొని రావాలి.
దశాబ్ద కాలంగా ఒక్కటంటే ఒక్క రీసర్చ్ ప్రాజెక్టు రాలేదంటే మన విశ్వవిద్యాలయాల ఘనత వేరే చెప్పనక్కర్లేదు. గతమెంతో ఘనకీర్తి దశాబ్దాల చరిత్ర కలిగిన విశ్వవిద్యాలయాలు నేడు నిర్మానుష్యంగా ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఒక్క బోధనా సిబ్బంది పోస్టు భర్తీ చేయకపోగా, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఇబ్బడి ముబ్బడిగా శాంక్షన్ చేసి విద్య తమ బాధ్యత కాదని చేతులు దులుపుకుంది.
శతాబ్దం కిందట వెలసిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యాభై సంవత్సరాల క్రిందట 52 విభాగాలు ఆరు వందల మంది బోధనా సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు కేవలం 24 విభాగాలు పట్టుమని ఎనభై మంది సిబ్బందితో, విభాగాలు ఉన్నాయా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇక పదిహేను సంవత్సరాల క్రిందట వెలసిన తెలంగాణ విశ్వవిద్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ట్రిపుల్ ఐటీ లో బోధనా సిబ్బందిలేక శ్మశాన ప్రశాంతత నెలకొంది.
ఇలాగే మరికొద్ది కాలం గడిస్తే అన్ని విభాగాలు మూసుకోవాల్సిందే. కీలకమైన విభాగాలలో బోధనేతర సిబ్బంది లేరు. పరీక్షల విభాగం, కాలేజీ డెవలప్మెంట్ సెల్, కాన్ఫిడెన్షియల్ పనులు కూడా కాంట్రాక్టు సిబ్బంది చేతుల్లోకి వెళ్ళి చాలా కాలం అయ్యింది.ఏడాదికి ఒకసారి కళాశాలలకు తనిఖీలు చేయాలన్న కనీసం ఎనిమిది వందల మంది అధ్యాపకులు కావాలి. అలాగే సెలక్షన్ కమిటీ తూతూ మంత్రంగా జరపాలన్న ఐదు వందల మంది అధ్యాపకులు కావాలి. ఉన్న అధ్యాపకులు ప్రిన్సిపాల్, రిజిస్ట్రార్, రెక్టార్, డీన్, డైరెక్టర్ అడ్మిషన్స్, అకడమిక్ అడిట్, ప్లానింగ్, రీసర్చ్, ఎవాల్యుయేషన్, కాంట్రొల్లర్, అసిస్టెంట్ కంట్రోల్లర్, వైస్ ప్రిన్సిపాల్, వార్డెన్, ప్లేస్మెంట్ ఆఫిసర్, అకడమిక్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ ఇలా ప్రతి ఒక్కరికి రెండు లేదా మూడు పోస్టులు అదనంగా ఉంటున్నాయి.
వీళ్ళు బోధన మరచి చాల రోజులయ్యింది. ఒక్కటంటే ఒక్క రీసర్చ్ గ్రాంటు కు రిపోర్టు రాయడం చేతకాదు. మైనర్, మేజర్, టెక్విప్, స్టార్ట్ అప్ గ్రాంట్లు రావడం లేదు, యూనివర్సిటీ కళాశాలల్లో పరిశోధనలు పడకేసి చాలాకాలమయింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి ఏడాది అయింది.
విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీని ఈ బోర్డు చేపట్టనుంది. ప్రస్తుతం యూనివర్సిటీలు వేర్వేరుగా ఖాళీలను భర్తీ చేస్తున్నాయి. వేర్వేరుగా కాకుండా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను ఒకే బోర్డు ద్వారా ఒకేసారి భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నరు కొత్త పద్దతిలో చిక్కులు ఉంటాయని అది యూజీసీ కి విరుద్దంగా ఉన్నట్లు తనకు తోచిందని తక్షణమే విద్యాశాఖ మంత్రి రాజభవన్ కు వచ్చి వివరణ ఇవ్వాలని తెలిపారు.
తెలంగాణలో ప్రస్తుతం మెడికల్ యూనివర్సిటీలు కాకుండా 15 విశ్వవిద్యాలయాలున్నాయి. ఈ విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత నియామకాలు చేపడుతున్నాయి విశ్వవిద్యాలయాలు. వేర్వేరుగా రిక్రూట్‌మెంట్స్ చేయడం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. నిరుద్యోగులు కూడా ప్రతీ యూనివర్సిటీకి అప్లై చేయాల్సి వస్తోంది.
ఇలా పలు అంశాలను, సమస్యల్ని పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు వేర్వేరుగా కాకుండా ఈ 15 యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఒకే బోర్డు ద్వారా జరపాలని భావించింది. అందుకే కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఉంటారు. కన్వీనర్‌గా కళాశాల విద్యా శాఖ కమిషన్ మెంబర్ ఉంటారు. ఆర్థిక శాఖ, విద్యాశాఖ అధికారులు బోర్డు సభ్యులుగా ఉంటారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు విధివిధానాలు ఎలా ఉంటాయన్నదానిపై గైడ్‌లైన్స్ విడుదల కాలేదు.
ఈ బోర్డు పనిచేయడానికి అయ్యే ఖర్చుల్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు సమానంగా భరిస్తాయి. ఈ బోర్డు ఏర్పాటు చేసేందుకు యూనివర్సిటీ చట్టాల్లో సవరణలను కూడా ప్రతిపాదించనుంది ప్రభుత్వం. ఏదో ఒక రూపాన ఉద్యోగం దక్కితే చాలని అభ్యర్థులు వేయికళ్లతో ఎదురు చూశారు. రిజర్వేషన్ రోస్టర్ ఎలా పాటిస్తారన్న సందేహం బిసి, ఎస్సి,ఎస్టీ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందారు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
లాస్ట్ రోస్టర్ పాయింట్ ఎక్కడ నిలిచింది ఇప్పుడు ఎక్కడ నుండి మొదలవుతుంది అలాగే లోకల్ నాన్ లోకల్ సమస్య రాకుండా చూడాలి. తీవ్ర కాలయాపన చేసి, వాటిపై తమ పార్టీ వారినే కోర్టులో కేసులు వేసి నాన్చే ధోరణి అవలంబిస్తు, నియామకాలపై చిత్తశుద్ధి లేక విశ్వవిద్యాలయాలు శాశ్వితంగా మూసుకోవాల్సిన స్థితికి తీసుకొచ్చారు. ఇక ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. గత ఐదు ఆరు నెలలు గా జీతాలు లేవు.
సక్రమంగా జీతాలు ఇస్తున్న కళాశాలలు అధ్యాపకులకు ముష్టి వేస్తున్నారు. ఎంటెక్ కంప్యూటర్స్ అధ్యాపకుడికి 18000/- . పీహెచ్డీ చేసిన వారికి డెబ్భై వేలు మించి ఇవ్వట్లేదు. ఇలాంటి కళాశాలలకు ఎన్బిఏ, న్యాక్ అక్రిడేషన్ ఏ+ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారు. కోర్ ఇంజినీరింగ్ బ్రాంచీలను సరండర్ చేసి దిక్కుమాలిన కోర్సులు తెచ్చుకుంటున్నారు. ఆ కోర్సులలో చదువు చెప్పే నాథుడే లేడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఐఓటీ, విఎల్ఎస్ఐ కోర్సులకు అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.
అధ్యాపకులకు ఓరియెంటేషన్ లేదు, విశ్వవిద్యాలయాలలో అకడమిక్ స్టాఫ్ కాలేజీలు లేవు. ఏవో కొన్ని విశ్వవిద్యాలయాలు జూమ్ ద్వారానో, గూగుల్ మీట్ ద్వారా నో మొక్కుబడిగా పాఠాలు చెపుతున్నారు. హాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అవి ప్రాక్టికల్స్ చేయించినప్పుడు వస్తుంది. గత రెండు సంవత్సరాలుగా దిక్కుమాలిన అకడిమిక్ క్యాలండర్ వల్ల అడ్మిషన్స్ యాభై శాతం కాలేదు. సివిల్, మెకానికల్, ఎలెక్ట్రికల్ చివరికి ఎలెక్ట్రానిక్స్ బ్రాంచీలకు గడ్డుకాలం వచ్చింది.
ఇంటర్మీడియట్ ఫలితాలు జూన్ లో ప్రకటించి అక్టోబరులో ఎంసెట్ నిర్వహిస్తే విద్యార్థులును ఇంతవరకు ఖాళీగా ఏ తల్లి తండ్రి ఉంచరు అన్న సంగతి తెలియదా ? తల్లితండ్రులు తమ పిల్లలను దిక్కుమాలిన ప్రైవేటు విశ్వవిద్యాలయంలో లక్షలు కట్టి చేరుస్తున్నారు. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు జీతాలు ఇవ్వక, అధ్యాపకులకు ఉద్యోగ భద్రత లేక, అధ్యాపకులు లేక పిల్లలకు పాఠాలు కాక, విపత్కర పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేక, నిర్వహించినా నెలల కొద్దీ ఫలితాలు ప్రకటించక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో విశ్వవిద్యాలయాల అధికారులు ఉన్నారు.
సరియైన విద్యా ప్రణాళిక లేకపోతే భవిష్యత్ అంధకారంగా మారనుంది. ఆరునెలలు జీతాలు ఇవ్వలేని ప్రైవేటు కళాశాల యజమానులను, విశ్వవిద్యాలయం అభివృద్ధి పై ఏమాత్రం శ్రద్ధ చూపని వారిని ఉపకులపతులుగా, రిజిస్ట్రార్, నియంత్రణ మండలి కార్యదర్శులు గా, పాలక మండలి సభ్యులుగా, సలహాదారులుగా నియమిస్తే ఇలాగే ఉంటుంది.