తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు

రెండు రాష్ట్రాలలోనూ కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను ఈనెల 14నుంచి స్వాధీనం చేసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డు తీర్మానించడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం, కల్వకుర్తి ఎత్తిపోతల మొదటి పంపు హౌస్‌, నాగార్జునసాగర్‌ క్రిందనున్న 15 పాయింట్లు, కుడి, ఎడమకాలువలతోపాటు ప్రధాన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, హైదరాబాద్‌ మంచినీటి సరఫరా ప్రాజెక్టు, సాగర్‌ టెయిల్‌పాండ్‌ కింద హెడ్‌వర్క్స్‌, విద్యుత్‌ కేంద్రం, పులిచింతల హెడ్‌వర్క్స్‌, విద్యుత్‌ బ్లాక్‌, ఆర్డీఎస్‌ క్రాస్‌ రెగ్యులేటర్‌, తుమ్మిళ్ల ఎత్తిపోతల తెలంగాణ ప్రాజెక్టులు కాగా, శ్రీశైలం స్పిల్‌వే, కుడిగట్టు విద్యుత్‌కేంద్రం, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, హంద్రీనీవా, మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలు, సుంకేశుల, నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఇవీ ఆంధ్రాకు చెందిన ప్రాజెక్టులు.
ఈ ప్రాజెక్టులు మొత్తం కేంద్రం ఆధీనంలోకి వెళ్తాయి. ఇవేగాక గోదావరిపై ఉన్న ఆంధ్రా`తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కేంద్ర సన్నాహాలు చేస్తోంది. ఈ విధంగా నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు చివరకు మంచినీటి సరఫరా ప్రాజెక్టులు కూడా కేంద్రానికి అప్పగించి రెండు రాష్ట్రాలు తమ జుట్టును కేంద్రం చేతికి అందించాయి. ఈ బోర్డుల నిర్వహణకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం చెరో రూ.200కోట్లు కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క యూనిట్‌ కరెంట్‌ కావాలన్నా, చివరకు తాగటానికి గుక్కెడు మంచినీరు కావాలన్నా కేంద్రం దయాదాక్షిణ్యాలపై ఆధారపడి రెండు రాష్ట్రాలు మనుగడ సాగించాల్సిన దుస్థితి ఈ నిర్ణయం కారణంగా ఏర్పడుతుంది.
ఇప్పటికే కేంద్రం అధికారాలు మొత్తం తన గుప్పెట్లో పెట్టుకొని నిధులు ఇవ్వకుండా రెండు రాష్ట్రాలను వేధిస్తోంది. విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు వేటినీ నెరవేర్చడం లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోని సమస్యలను సానుకూలంగా పరిష్కరించాల్సిందిపోయి ఇద్దరూ పంతాలకు పోయి సమస్యలను తెగేదాకా లాగి నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారు. దీనితో ఒక్క ఎకరాకు నీరు కావాలన్నా కేంద్రం దయాక్షిణ్యాలపై రెండు రాష్ట్రాల ప్రజలు ఆధారపడాలి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అసమర్థత కారణంగా ప్రజలు గుక్కెడు మంచినీరు కావాలన్నా కేంద్రంవైపు చూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితిని తెచ్చిపెట్టారు.
ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బే. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకలు తమ అస్థిత్వానికి ఏమాత్రం దెబ్బతగిలినా సహించరు. కానీ ఇంత జరిగినా ఇక్కడి తెలుగువారిలో ఏమాత్రం చలనం లేకపోవటం బాధాకరం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు రెండు రాష్ట్రాలలోనూ ప్రతిపక్షాలు, ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా రెండు ప్రభుత్వాలు రాష్ట్ర అధికారాలను కేంద్రానికి దఖలు పరచడాన్ని అప్రజాస్వామిక నిర్ణయంగా తెలుగుదేశం పార్టీ పరిగణిస్తోంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రజలకు తీవ్రమైన నష్టాలను కలగజేస్తుంది కనుక దీనిపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలి.

– కాట్రగడ్డ ప్రసూన
(మాజీ  ఎమ్మెల్యే, టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు )

Leave a Reply