– రాజధాని నిర్మాణంలో అంతులేని అవినీతి
– ఏడాదిలో ఏకంగా రూ.1,37,576 కోట్ల అప్పు
– అభివృద్ధి, సంక్షేమం రెండూ లేనే లేవు
– ప్రభుత్వ ఆదాయం దారుణంగా పతనం
– విద్యుత్ కొనుగోలు ఒప్పందంలోనూ అవినీతి
– యాక్సిస్‌తో ఒప్పందంలో రూ.11 వేల కోట్ల స్కామ్
– ఒక్కో యూనిట్ రూ.4.60తో కొనుగోలు ఒప్పందం
– గతంలో ‘సెకీ’తో వైయస్సార్‌సీపీ ప్రభుత్వ ఒప్పందం
– యూనిట్ విద్యుత్ ధర కేవలం రూ.2.49 మాత్రమే
– దాని వల్ల 25 ఏళ్లలో రూ.89,675 కోట్లు ఆదా
– ‘లిక్కర్ స్కామ్’ పేరుతో దారుణంగా వ్యవహారం
– 2014–19 నాటి మద్యం విధానాలే ఇప్పుడు అమలు
– వచ్చే నెల 4న ‘వెన్నుపోటు’ దినం
– రాష్ట్రమంతా నిరసన కార్యక్రమం.. కలెక్టర్లకు విజ్ఞప్తులు
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి
తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు.
ఏడాది గడుస్తున్నా ఒక్క పథకం అమలు చేయకపోగా, ఇంత తక్కువ వ్యవధిలోనే దాదాపు రూ.1.40 కోట్ల అప్పులు చేశారని, ఇదే సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందని, ఆదాయమంతా.. చంద్రబాబు, ఆయన తోడు గజదొంగల జేబుల్లోకి వెళ్తోందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్ స్పష్టం చేశారు.
మా హయాంలో కోవిడ్ వంటి మహమ్మారిని రెండేళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా రాష్ట్రాన్ని గొప్పగా నడిపాం. అదే చంద్రబాబుఏడాది పాలన చూస్తే, కాగ్ నివేదిక గమనిస్తే, ఎక్కడా అభివృద్ధి, సంక్షేమం లేనే లేదు. బాబు పాలనంతా కూడా ఈ ఏడాది మోసాలతో సాగింది. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగరగొట్టారు.
రాష్ట్ర సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్). పన్ను, పన్నేతర ఆదాయం రెండు గమనిస్తే, ప్రభుత్వ పనితీరు దారుణంగా ఉంది.
కేవలం 3.08 శాతం మాత్రమే గ్రోత్‌రేట్ కనిపిస్తోంది. అందుకు కారణం ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు తగ్గాయి. ఇదే సమయంలో దేశంలో దాన్ని చూస్తే, గ్రాస్ టాక్స్ రెవిన్యూస్, నాన్ టాక్స్ రెవిన్యూస్‌లో ఏకంగా 13.76 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.36,97,545 కోట్లు. అదే గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ ఆదాయం రూ.32,50,181 కోట్లు.
మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది రూ.67,720 కోట్ల అప్పులు చేస్తే.. ఈ పెద్దమనిషి 12 నెలల కాలంలో, ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పులు ఏకంగా రూ.81,597 కోట్లు. అది మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది చేసిన అప్పుల కన్నా 30 శాతం ఎక్కువ.
ఇంకా మూలధన వ్యయం చూస్తే, మా హయాంలో చివరి ఏడాది ఆ మొత్తం రూ.23,330 కోట్లు కాగా, చంద్రబాబు 12 నెలల పాలనలో అది కేవలం రూ.19,177 కోట్లు. అంటే మైనస్ 17.80 శాతం అన్నమాట. ఈ గణాంకాలన్నీ చంద్రబాబు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితి.
చంద్రబాబునాయుడు 2019లో దిగిపోయే నాటికి ఉన్న మొత్తం అప్పులు రూ.3,90,247 కోట్లు కాగా, అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ (పవర్ సెక్టార్ నాన్ గ్యారెంటీ అప్పులు సహా) అన్నీ కలిపి ఉన్న అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే మా హయాంలో రూ.3,32,671 కోట్ల అప్పులు చేసినట్లు కనిపిస్తుంది.
మా హయాంలో అప్పుల పెరుగుదల (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్–సీఏజీఆర్) 13.57 శాతం. అదే అంతకు ముందు రాష్ట్రం విడిపోయి 2014లో చంద్రబాబునాయుడు చేతికి అధికారం వచ్చే నాటికి ఉన్న అప్పులు రూ.1,40,717 కోట్లు కాగా, 5 ఏళ్లలో ఆ మొత్తం ఏకంగా రూ. 3,90,247 కోట్లకు చేరింది.
అంటే చంద్రబాబు తన హయాంలో రూ.2,49,350 కోట్ల అప్పులు చేసి, ‘అప్పుల సామ్రాట్’ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన హయాంలో సీఏజీఆర్ 22.63 శాతంగా నమోదైంది.
2019–24 మధ్య 5 ఏళ్లలో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మొత్తం రూ.3,32,671 కోట్ల అప్పు చేస్తే, చంద్రబాబునాయుడు కేవలం ఈ 12 నెలల్లోనే రూ.1,37,546 కోట్ల అప్పు చేశారు. అంటే వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో ఏకంగా 41 శాతం, చంద్రబాబు ఒక్క ఏడాదిలోనే చేశాడు. అదే ఒక ఆర్ధిక సంవత్సరాన్ని పరిగణలోకి తీసుకుంటే, ఈ ప్రభుత్వం ఏకంగా రూ.81,597 కోట్ల అప్పు చేసింది.
ఆ అప్పులు వివరాలు ఇవీ..
ఎస్‌డీఎల్ ఇన్సూరెన్స్ ఇన్ ఏప్రిల్–2025: రూ.5750 కోట్లు
ఎస్‌డీఎల్ ఇన్సూరెన్సెస్ ఇన్ ఫస్ట్ వీక్ ఆఫ్ మే–2025: రూ7 వేల కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీపీఎఫ్‌సీ: రూ.710 కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మార్క్‌ఫెడ్: రూ.6 వేల కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్: రూ.2 వేల కోట్లు
ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఏపీఎండీసీ బాండ్స్: రూ.3,489 కోట్లు
బారోయింగ్స్ సెక్యూర్డ్ ఫర్ అమరావతి బై ఏపీ గవర్నమెంట్: రూ.31 వేల కోట్లు
మొత్తంగా కలిపితే, మొత్తం అప్పు: రూ.1,37,576 కోట్లు. ఇందులో ఒక్క అమరావతి నిర్మాణం కోసం చేసిన అప్పు రూ.31 వేల కోట్లు.
చంద్రబాబు అప్పుల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు.
రాష్ట్రంలో ఉన్న 436 గనులపై ఉన్న హక్కులను ఏపీఎండీసీకి తీసుకొచ్చి, ఆ విలువను రూ.1.91 లక్షల కోట్లుగా వెల కట్టి, వాటిని తాకట్టు పెట్టి, బాండ్లు జారీ చేయడం ద్వారా రూ.9 వేల కోట్ల అప్పు చేస్తున్నారు. ఆ అప్పు కోసం చట్ట విరుద్ధంగా, రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు హక్కులు కల్పిస్తున్నారు. అది నేరం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 293(1) ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్‌ను తాకట్టు పెట్టి అప్పు తీసుకునే వెసులుబాటు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కానీ అప్పు కోసం చట్ట విరుద్ధంగా ఏకంగా రాష్ట్ర ఖజానాపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించిన చరిత్ర రాష్ట్ర చరిత్రలో కాదు.. దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఉండదు. ఇది చట్టరీత్యా నేరం.
ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఈ ఎక్స్‌క్లూజివ్ అథారిటీ ఉంటుంది. అలాంటిది ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ను ఏకంగా చంద్రబాబునాయుడు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం అన్నింటికన్నా రాజ్యాంగ ఉల్లంఘన.
యాక్సిస్ ఎనర్జీ వెంచర్ ఇండియా కంపెనీతో చంద్రబాబు ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఇది ఏకంగా రూ.11 వేల కోట్ల స్కామ్. యాక్సిస్ సంస్థ నుంచి 400 మెగావాట్ల పవర్, వారి పీఎల్‌ఎఫ్ ప్రకారం ఏడాదికి 10 కోట్ల యూనిట్లు, యూనిట్ రూ.4.60 చొప్పున కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా 210 కోట్ల యూనిట్లు కొంటున్నారు. ఒక్కో యూనిట్ ధర రూ.4.60. అదే మా హయాంలో మేము సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం యూనిట్ విద్యుత్ రూ.2.49 మాత్రమే. అంటే ఒక్కో యూనిట్‌కు చంద్రబాబు ప్రభుత్వంలో అదనంగా రూ.2.11 చెల్లిస్తున్నారు. అంటే 210 కోట్ల యూనిట్లు ఇంటూ 2.11 లెక్కిస్తే ఏటా రూ.440 కోట్ల చొప్పున 25 ఏళ్లకు పడే భారం రూ.11 వేల కోట్లు.
ఇది ఇచ్చేటప్పుడు చంద్రబాబు తెలివిగా బీబీబీ (బండ్లింగ్ బ్యాంకింగ్ బ్యాలెన్సింగ్) అన్న ప్రస్తావన తెచ్చారు. అంటే 4 గంటల పీక్ అవర్ అని చెప్పి, మొత్తం 24 గంటలకు యూనిట్ రూ.4.60కి కొంటూ, స్కామ్ చేస్తున్నారు. ఈ మధ్య సెకీ పలు సంస్థలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ విద్యుత్ ధర కేవలం రూ.3.53 మాత్రమే. వాటిలో ఎన్టీపీసీ, రిలయెన్స్ సంస్థలు ఉన్నాయి. ఆ ధర లెక్క వేసుకున్నా, రూ.1.07 ఎక్కువ ధర చెల్లిస్తున్నట్లే. ఆ విధంగా చంద్రబాబు స్కామ్‌లు చేస్తున్నారు.
ఇక్కడ మరో విషయం చూస్తే, మనం చేసుకున్న ఒప్పందం ధర రూ.2.49 వల్ల జరిగిన మేలు చూస్తే.. రూ.2.11 వ్యత్యాసం వల్ల రూ.11 వేల కోట్ల భారం మోపితే, మా ప్రభుత్వం ఒప్పందం వల్ల, ప్రభుత్వానికి 7 వేల మెగావాట్లు, అంటే 17 మిలియన్ యూనిట్లు విలువ లెక్కిస్తే ఏటా రూ.3,587 కోట్లు. అలా 25 ఏళ్లలో రూ.89,675 కోట్లు ఆదా.
ఉర్సా కంపెనీ. ఊరూ పేరూ లేదు. అలాంటి సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి రూ.3 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారు. దాన్ని క్యాబినెట్‌లో క్లియర్ చేశారు. ఆ కంపెనీ యజమాని నారా లోకేష్‌కు స్నేహితుడు. ఇంకా లులూ సంస్థకు మాల్ కట్టడానికి రూ.2 వేల కోట్ల విలువైన భూమి అప్పనంగా ఇస్తున్నారు.
ఈరోజు రాష్ట్రంలో ఇసుక, లిక్కర్, సిలికా, మైనింగ్, క్వార్ట్›్జ ఎక్కడికక్కడ యథేచ్ఛ దోపిడి. ఇసుకను మొత్తం దోచేస్తున్నారు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రావడం లేదు. మా ప్రభుత్వ హయాంలో రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. మేము దిగిపోయే ముందు వర్షాకాలం వస్తోంది 80 లక్షల టన్నుల స్టాక్ ఇసుక పెడితే, రెండు నెలల్లో మొత్తం దోచేశారు.
స్కామ్‌లలో పరాకాష్ట అమరావతి పనుల్లో అవినీతి వ్యవహారం. ఆ పనులకు సంబంధించి 2018లో టెండర్ల విలువ రూ.41,170.78 కోట్లు కాగా, అందులో అప్పుడు రూ.5,587.28 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇంకా రూ.35,583 కోట్ల పనులు మిగిలాయి.
వాటిని రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు విపరీతంగా పెంచి ఇప్పుడు దోపిడి చేస్తున్నారు. ఈ స్కామ్‌లో తమ సదుపాయం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ విధానం తీసుకొచ్చారు. మా హయాంలో అది లేదు. కానీ, చంద్రబాబు దాన్ని తీసుకొచ్చి, టెండర్ ఇవ్వగానే 10 శాతం అడ్వాన్స్ ఇచ్చి, అందులో ఇచ్చి, 8 శాతం కమిషన్ తీసుకుంటున్నారు.
5 ఐకానిక్ టవర్ల కోసం 2018లో టెండర్లు పిల్చినప్పుడు అప్పుడు వాటి విలువ రూ.2,271.14 కోట్లు కాగా, ఇప్పుడు మిగిలిపోయిన పనుల విలువను 105 శాతం పెంచి ఏకంగా రూ.4,668.82 కోట్లకు పెంచారు. ఒక్కో చదరపు అడుగు వ్యయం రూ.8,931. ఆ టవర్లు దేనితో కడుతున్నారు. బంగారంతో కడుతున్నారా? వెండితో పూతలు వేస్తున్నారా? ఇదే ప్రభుత్వం వేరే చోట్ల పనులకు ఇస్తున్న మొత్తం అన్ని పనులతో కలిపి చదరపు అడుగుకు రూ.2500 మాత్రమే.
ఇక సచివాలయం. అసెంబ్లీ నిర్మాణాలు. ఇప్పటికే అవి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల భవనాలు ఉన్నాయి. ఇవి ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ కడతారట. హెచ్‌ఓడీ ఆఫీసులు కడతారట. వాటి కోసం 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణాలు చేస్తారట. నిజానికి సచివాలయం, అసెంబ్లీ, హెచ్‌ఓడీలతో కలుపుకుని అంతా 12 వేల మంది వరకు ఉంటారు. వారు ఇప్పటికే 6 లక్షల చదరపు అడుగుల భవనాల్లో పని చేస్తున్నారు. మరి కొత్తగా 53,57,389 చదరపు అడుగులతో నిర్మాణం ఎందుకు? అంటే, ఆ పనులు నిరంతరం జరగాలి. కమిషన్లు రావాలి.
హైదరాబాద్‌లో ఇటీవల కొత్త సచివాలయం 8.58 లక్షల చదరపు అడుగుల భవనం. రూ.600 కోట్లతో కట్టారు. దాంతో పాటు, హెచ్‌ఓడీ ఆఫీసులు కూడా తరలించారు. మరి ఇక్కడ 53.57 లక్షల చదరపు అడుగుల భవనాలు ఎందుకు?.
ఇప్పటికే కట్టిన అసెంబ్లీ వ్యయం రూ.180 కోట్లు. సచివాలయ వ్యయం రూ.300 కోట్లు. రెండూ గంగపాలు. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.173 కోట్లు. అలా మొత్తం రూ.600 కోట్లు. కొత్త భవనాలు కట్టాలనుకున్నప్పుడు, ఈ రూ.600 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు?. ఈ నిర్ణయాలు సమంజసం అని ఎలా చెబుతారు? అప్పులు తెచ్చి భవనాలు కట్టి, ప్రజలపై భారం మోపడం ఎందుకు?. ఒక్కో చదరపు అడుగు నిర్మాణ వ్యయం ఏకంగా రూ.8,900. సాధారణంగా ఒక్కో చదరపు అడుగుకు రూ.4500 పెడితే, ఫైవ్ స్టార్ వసతులతో అపార్ట్‌మెంట్ దొరుకుతుంది. హైదరాబాద్‌లో అయినా, బెంగళూరులో దొరుకుతాయి.
ఇంకా అమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయం కూడా దారుణం. జాతీయ రహదారులు ఫోర్ లైన్ల నిర్మాణం కోసం కిలో మీటరు వ్యయం రూ.11.16 కోట్ల నుంచి రూ.14.42 కోట్లు. అదే అమరావతిలో కిలో మీటరు రోడ్డుకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. కొన్ని చోట్ల రూ.60 కోట్లు ఖర్చు.
అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని అందరినీ మభ్య పెడుతూ, చేస్తున్న అప్పులు ఆకాశాన్ని అంటుతున్నాయి.ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, కేఎఫ్‌డబ్ల్యూ (జర్మనీ) బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు, సీఆర్‌డీఏ బాండ్ల నుంచి రూ.21 వేల కోట్లు.. ఇలా ప్రస్తుతానికి రూ.52 వేల కోట్ల అప్పులు చేస్తున్నారు. ఇవి కాక ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ నుంచి మరో రూ.6 వేల కోట్లు కేటాయించారు. మరి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్?
కావాలంటే విజయవాడ–గుంటూరు మధ్య ఎన్‌హెచ్ దగ్గర్లో నాగార్జునా యూనివర్సిటీలోనో, లేదంటే విజయవాడ –గుంటూరు మధ్య ఓ 500 ఎకరాలు తీసుకుని నువ్వు కట్టాల్సిన బిల్డింగ్‌లు ఏవో కట్టు. రీజనబుల్‌గా ఏదో సైజ్‌లో అయిపోతుంది. గుంటూరు–విజయవాడ ఎప్పుడైనా కలిసిపోతాయి. ఇప్పటికే నువ్వు చేసిన పనికి విజయవాడ, గుంటూరుల్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఢమాలయ్యాయి.
ఇంతింత అప్పులు చేసి, ఇన్నిన్ని స్కామ్‌లు చేసే బదులు, నీ సొంత ఆస్తులు పెంచుకునే విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయండి చంద్రబాబు.
నాగార్జున యూనివర్సిటీ పక్కన రాజధాని బిల్డింగ్‌లు నిర్మించండి. మా హయాంలో విజయవాడ నుంచి మచిలీపట్నం దాకా రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగింది. మచిలీపట్నంలో పోర్టు కట్టాం. మెడికల్ కాలేజీ నిర్మించాం. విజయవాడ– గుంటూరు మధ్య కడితే రేట్లు పెరుగుతాయి.
ఒకసారి రెండు ప్రభుత్వాల హయాంలో మద్యం అమ్మకాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం చూస్తే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐఎంఎల్, బీర్ల అమ్మకాల ద్వారా చివరి ఏడాది 2018–19లో రూ.17,341 కోట్ల ఆదాయం వస్తే, మా ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది 2023–24లో వచ్చిన ఆదాయం రూ.25,082 కోట్లు. అదే సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మద్యం అమ్మకాలు తగ్గాయి. అయినా ఆదాయం ఎందుకు పెరిగిందంటే, పన్నులు వేశాం. ఆ విధంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చాం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది ఐఎంఎల్ 3.84 కోట్ల కేసులు, బీర్లు 2.77 కోట్ల కేసులు అమ్ముడుపోతే, మా ప్రభుత్వ చివరి ఏడాదిలో ఐఎంఎల్ 3.32 కోట్ల కేసులు, బీర్లు 1.12 కోట్ల కేసులు అమ్ముడుపోయాయి.
పేరుకు లాటరీ ద్వారా మద్యం షాపులు కేటాయించినా, తమకు కావాల్సిన వారికే షాపులు వచ్చేలా చేశారు. వేరే ఎవరు షాప్ దక్కించుకుంటే నిస్సిగ్గుగా 30 శాతం వాటా తీసుకున్నారు. ఏ డిస్టిలరీకి మేలు చేయాలనుకుంటే, ప్రైవేటు షాపుల ప్రైవేటు సైన్యంతో ఆ డిస్టిలరీ ఉత్పత్తులకు ఇండెంట్ వేయిస్తారు. ఆ విధంగా ఆ కంపెనీకి మేలు చేస్తున్నారు.
బేవరేజెస్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న సత్యప్రసాద్ అనే వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి. సూపరింటెండెంట్ స్థాయి. ఎంత మంది ఉంటారో తెలుసా సూపరింటెండెంట్ లు? పదుల సంఖ్యలో ఉంటారు. అనూష అనే ఇంకో అమ్మాయి. చిన్న క్లరికల్ ఉద్యోగి. అది కూడా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. వాళ్లను బెదిరించి తీసుకోవడం ఏందండీ ఇది?
ఇక బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి. ఈ ప్రభుత్వం తనను వేధిస్తోందని హైకోర్టులో మూడు సార్లు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అలాంటి వ్యక్తిని బెదిరించి, భయపెట్టి, లొంగదీసుకుని, స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత, మళ్లీ సెంట్రల్ సర్వీస్‌కు వెళ్లిపోవడానికి ఎన్‌ఓసీ ఇచ్చారు. అంత వరకు బ్లాక్ చేశారు.
ఇలాంటి వ్యక్తులు ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది? బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. ఎన్‌ఓసీలు ఆపుతున్నారు. మూడుసార్లు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నా దిక్కూ దివాణం లేదు.
మరో నిందితుడిగా చెబుతున్న రాజ్ కేసిరెడ్డి.. అసలు ఈయనకు, బేవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం? ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు, ఒక వ్యాపారస్తుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు. అదీ 2 సంవత్సరాలు మాత్రమే. అది కూడా కోవిడ్ సమయంలో. విజయవాడకు వచ్చింది కూడా తక్కువే. రెండేళ్ల తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు.
ఆయన ప్రస్తుత టీడీపీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరూ కలిసి వ్యాపారాలు కూడా చేస్తున్నారు.
ఇద్దరూ కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు, సులభంగా ప్రలోభపెట్టవచ్చని తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొచ్చి, ప్రలోభాలు పెట్టి అప్రూవర్ గా నిన్ను మారుస్తాను, వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పమంటే.. ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల అక్యూజ్డ్ గా చేర్చారు. అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేశాడు.
రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బేవరేజెస్ కార్పొరేషన్, లిక్కర్ తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్ సభ ఎంపీ, లోక్ సభలో ఫ్లోర్ లీడర్. వాళ్ల నాన్న కూడా కనీసం ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్‌రెడ్డికి?
ఇప్పుడు అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వ అధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి. అసలు వీళ్లిద్దరికీ కేసుతో ఏం సంబంధం? ధనుంజయ్ అన్నకు కానీ, కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం? మద్యంకు సంబంధించి ఒక్క ఫైలు అయినా సీఎంఓకు వచ్చినట్లు ఒక్క సంతకం అయినా చూపించగలరా? సవాల్ విసురుతున్నా చంద్రబాబుకు నేను. అసలు ధనుంజయరెడ్డి కనీసం ఎక్సైజ్ శాఖ కూడా చూసేవాడు కాదు. మరి ఏం సంబంధం?.
ఇంకొకాయన బాలాజీ గోవిందప్ప. ఆయన మల్టీ నేషనల్ కంపెనీ వికాట్ కంపెనీలో వారి గ్రూప్ కంపెనీల్లో హోల్ టైమ్ డైరెక్టర్. ఆయన ఏపీలోనే ఉండరు. వికాట్ అనేది యూరప్ లోనే టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్లకు టైమ్ ఉండదు చంద్రబాబు, ఈనాడు రాతలు, వీళ్ల ప్రకారం మాటలు చూస్తే ఆయనేదో ఖాళీగా ఉన్నాడు, నా పనులు చక్కబెట్టేవాడు అని ఏదో రాసుకొచ్చారు.
అసలు నా పనులు చక్కబెట్టడానికి నా కంపెనీ డైరెక్టర్లు చానా మంది నాకున్నారు. నా కంపెనీలో పని చేస్తున్న ఎంప్లాయీస్ నాకు కూడా ఉన్నారు. అసలు వీకా అనేది నా కంపెనీనే కాదు. రిలయన్స్ లో నాకు కొన్ని షేర్లు ఉంటే రిలయన్స్ నాది అయిపోదు. నాకు ఓనర్‌షిప్ ఉన్న కంపెనీలు నాకు ఉంటాయి.
దాంట్లో ఎంప్లాయీస్ నాకు ఉంటారు. దాంట్లో డైరెక్టర్స్ నాకు ఉంటారు. నేను ఏదైనా పని చేయించుకోవాలనుకుంటే వాళ్లతో చేయిస్తా. నా వ్యాపారాలకు సంబంధించి. అంతే తప్ప నా కంపెనీ కాని కంపెనీలో డైరెక్టర్లను, బిజీగా ఉండేవాళ్లు నాకెందుకు పని చేస్తారు? కేవలం భారతి సిమెంట్స్, జగన్ మోహన్ రెడ్డికి కొద్ది వాటాలు ఉన్నాయి. ఆ కంపెనీని అప్రతిష్టపాలు చేయాలి. చేసేది ఏం చేస్తున్నారో తెలుసా? ఒక మల్టీ నేషనల్ కంపెనీకి రాంగ్ వైబ్ పంపుతున్నారు. 12 దేశాల్లో వాళ్లకు ఆపరేషన్స్ ఉన్నాయి.
ఇప్పటికే సజ్జన్ జిందాల్‌ను బెదరగొట్టారు. జత్వానీ గిత్వానీ అని చెప్పి అధికారులను అరెస్టు చేసి ఆ మనిషి ఇక్కడ వ్యాపారం చేయకుండా ఆంధ్ర రాష్ట్రం అంటే సార్ నమస్కారం పెట్టి వ్యాపారం చేయొద్దని సజ్జన్ జిందాల్ చెబుతున్నాడు. అరబిందో వాళ్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడికి నమస్కారం పెడుతున్నారు. షిప్, సీజ్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు వాళ్ల మీద ఆరోపణలు చేసి, లాస్ట్ కి షిప్ పోయింది, సీజ్ పోయింది. బియ్యం పోయాయి. వాళ్లేమో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే నమస్కారం సామీ వ్యాపారం చేయలేం అంటున్నారు.
ఈ మల్టీ నేషనల్ కంపెనీ. ఫ్రాన్స్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. యూరప్ లో టాప్ 5 సిమెంట్ కంపెనీల్లో ఒకటి. వీళ్లు ప్రపంచానికి చెబుతారు. ఆంధ్ర రాష్ట్రం నమస్కారం సామీ ఈడ వ్యాపారాలే వద్దు అని. ఇప్పటికే వీళ్ల ఎమ్మెల్యేలు, మంత్రుల పుణ్యమా అని కుమారమంగళం బిర్లా అల్ట్రాటెక్ సిమెంట్స్.. ఆయన నమస్కారం పెడుతున్నాడు.
చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను నిలదీస్తూ, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమయ్యాయని ప్రశ్నిస్తూ 143 హామీలు ఏమయ్యాయని గట్టిగా అడుగుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో చేస్తున్న అరాచక, అన్యాయాలపై గళమెత్తుతూ వచ్చే నెల 4వ తేదీన ‘వెన్నుపోటు’ దినం నిర్వహిస్తున్నాం.
ఇప్పడు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి?
ఇప్పడు చంద్రబాబు అమ్ముతున్న బ్రాండ్లు ఏమిటి? ఈ బ్రాండ్ల ఫొటోలు ఎప్పుడన్నా చూశారా? సుమో అంట.. కేరళా మాల్ట్ అంట ఎప్పుడన్నా చూశారా? షార్ట్ విస్కీ అంట ఎప్పుడన్నా చూశారా? బెంగళూరు విస్కీ అంట ఎప్పుడన్నా చూశారా? బావుండదని, పక్కన మళ్లీ బెంగళూరు బ్రాందీ.. రాయల్ ల్యాన్సర్ విస్కీ అంట ఎప్పుడన్నా విన్నారా? ఓల్డ్ క్లబ్ అంట ఎప్పుడన్నా చూశారా? గుడ్ ఫ్రెండ్స్ అంట.. ఎప్పడన్నా విన్నారా? నేను ఒక్కటే అడుగుతా ఉన్నా..
ఎప్పుడూ చూడని బ్రాండ్లు కాదా ఇవి? ఏ శాస్త్రీయత ఆధారంగా ఈ ఆర్డర్లు ప్లేస్ చేస్తా ఉన్నారని నేను అడుగుతూ ఉన్నా.. ఇవన్నీ ప్రైవేటు మాఫియా చేత.. తన ప్రైవేటు షాపులు.. తన కావాల్సిన డిస్టిలరీస్ కు మేలు చేసేందుకు.. ఇండెంట్లు ప్లేస్ చేస్తా ఉన్నాడు. ఆర్డర్లు ఇస్తా ఉన్నాడు.. ఇలాంటి ఊరూ పేరూ లేని బ్రాండ్లు కావాలని ఎవరన్నా అడుగుతారా?.
విజయసాయి స్టేట్‌మెంట్‌కు విలువేముంది?
ఇంకొకాయన విజయసాయిరెడ్డి. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరాలు టర్మ్ ఉండగా, చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. వైయస్సార్ సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్లీ రాజ్యసభకు వైయస్సార్ సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన మూడున్నర సంవత్సరం టర్మ్ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేశారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్‌మెంట్స్‌కు ఏం విలువ ఉంటుంది?. అటువైపు నుంచి మనం కూడా ఎవర్ని అయినా తీసుకుని ఇదే మాదిరిగా చెప్పిస్తే వ్యాల్యూ ఉంటుందా?
వాళ్లు ఎలాంటి మచ్చలేని వారు
ధనుంజయరెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్. రిటైర్డ్ ఐఏఎస్. పాపం ఆయన కొడుక్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. తీసుకొచ్చి ఆయన్ను జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఒక రిటైర్డ్ ఆర్డీఓ. మచ్చలేని ఆఫీసర్ ఆయన. ఆయన కూతురుకు ఈ మధ్య కాలంలోనే పెండ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప.. పాపం ఆయన కూతురుకు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
ఎక్కడికి పోతున్నాం మనం. ఇంకో ఆఫీసర్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు. డీజీ స్థాయి ఐపీఎస్. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ లను జైల్లో పెట్టడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే లేదు. పీఎస్‌ఆర్ ఆంజనేయులు రెండో కొడుక్కు పెళ్లి ఖాయమైంది. వాళ్లు ఏమనుకుంటారో అని, పీఎస్‌ఆర్ ఆంజనేయులు భార్య పోయి వాళ్లతో మాట్లాడుకోవాల్సి వచ్చింది.
సునీల్ కుమార్ డీజీ స్థాయి అధికారి. ఐపీఎస్. దళిత ఆఫీసర్. సస్పెండ్ చేసి హరాస్ చేస్తున్నారు. సంజయ్ అడిషనల్ డీజీ. దళిత ఆఫీసర్, సస్పెండెడ్, హరాస్డ్. కేసులుపెట్టారు. విజయ్ పాల్ ఏఎస్పీ. తప్పుడు కేసులతో అరెస్టు, హరాస్మెంట్. కాంతిరానా టాటా ఐపీఎస్. ఐజీ. విశాల్ గున్నీ సీనియర్ ఐపీఎస్ ఇద్దరూ సస్పెండెడ్, హరాస్మెంట్.
జాషువా, ఐపీఎస్, ఎస్పీ. కేసులు పెట్టి హరాస్మెంట్. రఘురామిరెడ్డి ఐజీ, ఐపీఎస్. రిషాంత్ రెడ్డి ఎస్పీ, ఐపీఎస్. పోస్టింగుల్లేవు. అలా వేధిస్తున్నారు. దాదాపు 199 మంది పోలీసు అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో పెట్టింది. వీళ్లే అసెంబ్లీలో ఓ ప్రశ్నకు రిపై ఇచ్చారు. డీఎస్పీలు, సీఐలకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా వేధిస్తున్నారు.