– 6గురు డిఐజిలకు బదిలీ ?
– 12 నుంచి 14 మంది ఎస్పీలు బదిలీ
– విశాఖకు సర్వశ్రేష్ఠ త్రిపాఠీ?
– జగన్ జమానాలో లేని వారికే బదిలీ బాధ్యతలు?
– జగన్ బాధితులు, సానుభూతిపరులెవరో తెలిసిన వారెవరు?
– వాటిపై అవగాహన ఉన్న ఏబీ రిటైర్
– అందుకే ఏడాదిగా బదిలీలలో దొర్లిన తప్పులు
– సోషల్‌మీడియాలో విమర్శల తర్వాత దిద్దుబాటు
(సుబ్బు)
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఆయా నియోజకవర్గాల్లోను, జిల్లాల్లోనూ అధికారుల పనితీరుపై నిఘా వర్గాల ద్వారా పూర్తి సమాచారం సేకరించిన ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు తీసుకోనుంది. అన్ని కోణాలలో అధికారుల వ్యవహారశైలిపై పూర్తి సమాచారం సేకరించారు.
గత ప్రభుత్వ హయాంలో తప్పు చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్స్, కేసులు నమోదు, అరెస్ట్ లు జరిగి పోయాయి. తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది సివిల్ సర్వీసెస్ అధికారులు హైదరాబాదులో రహస్య సమావేశమయ్యారనే దానిపై కూడా ప్రభుత్వం పూర్తి సమాచారం సేకరించింది. కానీ ప్రభుత్వ అధినేత ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లో సమర్ధులకు స్ధానం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఆ మేరకు పలు వడపోతల అనంతరం ఒక ప్రాథమిక జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 12 నుంచి 14 మంది ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 6గురు డిఐజిలకు కూడా బదిలీ జాబితాలో ఉన్నారు. నలుగురు ఐజిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే సమాచారం. గుంటూరు, ఏలూరు రేంజ్ లకు కొత్త పోలీస్ బాస్ లు రానున్నారని తెలుస్తోంది. అదేవిధంగా విశాఖపట్నం కమిషనర్ మార్పు కూడా ఉండనున్నట్లు సమాచారం. ఈ బదిలీల ప్రక్రియలో ఒక రిటైర్డ్ డిజిపి చక్రం తిప్పుతున్నారు.
గత ఏడాదికాలంలో ఒక రేంజి ఐజిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఐ బదిలీలను కూడా విడిచిపెట్టరన్న ఆరోపణలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఏది చెబితే అది చేస్తారన్న పేరుంది. దానికితోడు ఎమ్మెల్యేలు చెప్పిన వెంటనే, వారికి నచ్చనివారిని వీఆర్‌కు పంపించడం, వారు సిఫార్సు చేసిన సీఐలకు పోస్టింగులివ్వడంతో ఎమ్మెల్యేలు సైతం.. తమ పనులు అవుతున్నాయి కదా అని మౌనంగా ఉంటున్నారు.
దీంతో మంచి పోస్టింగులు ఎవరికి దక్కుతాయి, లూప్ లైన్ లోకి వెళ్లేది ఎవరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే వ్యవస్ధను గాడిలో పెట్టాలనే ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ బదిలీలు ఉంటాయని సమర్ధులైన అధికారులకు తమ ప్రభుత్వంలో స్ధానం ఉంటుందనే మెసేజ్ ఇవ్వటానికి ప్రభుత్వాధినేత ప్రయత్నిస్తున్నారు. ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి.
పోలీసు శాఖపై పట్టున్నవారేరీ?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎస్పీ నుంచి ఎస్పీ స్ధాయి అధికారుల వరకూ జరిగిన బదిలీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. చివరకు సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారుల బదిలీలపైనా విమర్శలు వెల్లువెత్తాయి. బాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనను అర్ధరాత్రి కాలినడక నడిపించిన అధికారి నుంచి, టీడీపీ వారిని వేధించిన వారి వరకూ పోస్టింగులివ్వటం మీడియా-సోషల్‌మీడియాలో విమర్శలకు గురయింది. దానితో ఇచ్చిన పోస్టింగులు రద్దు చేసి, డజన్ల మందిని వీఆర్‌కు పంపాల్సివచ్చింది. దీనికి కారణం పోలీసుశాఖపై పట్టులేని వారికి బదిలీ బాధ్యతలు అప్పగించడమేనన్న వ్యాఖ్యలు టీడీపీ వర్గాల నుంచి వినిపించాయి.
కాగా రాష్ట్రంలో డీఎస్పీ, ఐపిఎస్ బదిలీలు చూస్తున్న ఒక మాజీ డీజీపీ స్థాయి అధికారి.. జగన్ హయాంలో నాలుగున్నరేళ్లు మంచి పోస్టింగులు దక్కించుకున్నారు. ఆయనను జగన్ సర్కారు బాగానే గౌరవించింది. ఆ సమయంలో ఆయన లా అండ్ ఆర్డర్‌లో కాకుండా, ఇతర విభాగాల్లో కొనసాగారు. ఎన్నికలకు కొద్దినెలల ముందు మాత్రమే ఆయన పార్టీకి పనిచేశారు. దానితో జగన్ హయాంలో, బాధిత అధికారులపై ఆయనకు అవగాహన ఉండే అవకాశం లేదు.
జగన్ జమానాలో ఆర్టీసీ ఎండిగా ఉన్న ద్వారకా తిరుమలరావు కూడా.. లా అండ్ ఆర్డర్, అంటే పోలీసుశాఖకు పూర్తి దూరంగానే ఉన్నారు. కూటమి వచ్చిన తర్వాత కొద్దికాలం డీజీపీగా చేసినప్పటికీ, సహజంగా ఆయనకూ జగన్ హయాంలో బాధిత పోలీసులెవరన్నది అవగాహన ఉండే అవకాశం తక్కువ.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాజీ ఐజి కూడా పోలీసు బదిలీలలో చక్రం తిప్పుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన జగన్ హయాంలో అసలు రాష్ట్రంలోనే లేరని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఎన్నికలకు కొద్దినెలల ముందు మాత్రమే ఆయన పార్టీకి పనిచేశారు. కాబట్టి ఆయనకూ జగన్ బాధిత పోలీసులు ఎవరో తెలిసే అవకాశం తక్కువ. ఎన్నికల ముందు రేంజ్‌ల వారీగా నమ్మకస్తులైన పోలీసు అధికారులతో ఆయన పనిచేయించుకున్నారు. అంతవరకూ ఆయన సక్సెస్ కాగలిగారు.
ప్రస్తుతం ఇంటలిజన్స్ చీఫ్‌గా ఉన్న అధికారికి నిజాయితీపరుడు, ముక్కుసూటి అధికారి అనే పేరుంది. అయితే ఆయన కూడా జగన్ హయాంలో రాష్ట్ర సర్వీసులో లేనందున, జగన్ జమానాలో పోలీసు బాధితులెవరన్న దానిపై ఆయనకూ అవగాహన ఉండే అవకాశం లేదు.
ఈరకంగా జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పోలీసు శాఖలో ఏం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? బాధితులెవరు? దోషులెవరన్న దానిపై అవగాహన ఉన్న ఐపిఎస్ అధికారి ఎవరూ లేకపోవడం, వారంతా బదిలీలలో కీలకపాత్ర పోషిస్తుండటమే విచిత్రం. ఆ విషయాలపై అవగాహన ఉన్న మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు రిటైరయిపోగా, తటస్తులయిన మరికొందరు మౌనంగా ఉన్నారు. ఈ క్రమంలో ఐపిఎస్ బదిలీలపై పార్టీ ముద్ర ఉంటుందా? లేక తమ వారన్న కోణంలో ఉంటుందా అన్నది చూడాలి.
పోస్టింగులిచ్చే వారిలో జగన్ బాధితులేరీ?
సహజంగా బాధితులకే బాధలు తెలుస్తాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నత హోదాలు అనుభవిస్తున్న వారిలో ఏ ఒక్కరూ జగన్ బాధితులు కారు. ఐపిఎస్,ఐఏఎస్‌లలో చాలామంది జగన్ హయాంలో మంచి పోస్టింగులు అనుభవించినవారే. వారిపై విపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన అనేక ఆరోపణలు చేసింది. చాలామందిని ఉద్యోగాలు వదిలి వైసీపీ కండువాలు కప్పుకోమని విమర్శించింది. వైపీఎస్ అధికారులుగా అభివర్ణించింది. విచిత్రంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, అత్యున్నత పదవులు వారికే కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది.
ప్రధానంగా ఐపిఎస్‌లలో కొద్దిమంది అధికారులు లూప్‌లైన్‌లోనే మగ్గిపోయారు. డీఎస్పీలదీ అదే పరిస్థితి. గుంటూరు రేంజ్‌లో అయితే కమ్మ సీఐల పరిస్థితి మరీ దారుణం. నాలుగున్నరేళ్లు ఎలాంటి పోస్టింగులు లేక, జీతాలు రాని దుస్థితి. కూటమి అధికారంలోకి వచ్చిన చాలాకాలం తర్వాత వారికి పోస్టింగులు ఇచ్చినట్లే ఇచ్చి, మళ్లీ వీఆర్‌కు పంపిన దయనీయం. గుంటూరు రేంజ్ ఐజి ఇప్పటిదాకా దానిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏడాదిలో ఆయన.. జగన్ జమానాలో ఐదేళ్లు లూప్‌లైన్‌లో ఉన్న సీఐ, ఎస్‌ఐలపై సమీక్షించిన దాఖలాలు లేవన్న విమర్శలు లేకపోలేదు.
దీనికి కారణం.. జగన్ హయాంలో బాధలు అనుభవించిన వారెవరూ ఇప్పుడు.. పోస్టింగులు ఇచ్చే స్థానాల్లో లేకపోవడమేనన్నది టీడీపీ నేతల వాదన. ‘‘అసలు జగన్ హయాంలో లా అండ్ ఆర్డర్‌లో ఉన్న అధికారులు ఎవరు? లూప్‌లైన్‌లో ఉన్న వాళ్లు ఎవరన్నది ఒక జాబితా తయారుచేస్తే.. ఎవరికి లా అండ్ ఆర్డర్ పోస్టులు ఇవ్వాలి? ఎవరిని లూప్‌లైన్‌కు పంపించాలన్నదానిపై స్పష్టత ఉంటుంది. దీనికి పెద్దగా తెలివికూడా ఉపయోగించాల్సిన పనిలేదు. కాకపోతే కాస్త మెదడు ఉపయోగిస్తే సరిపోతుంద’’ని మాజీ ఐపిఎస్ అధికారి ఒకరు విశ్లేషించారు.