Suryaa.co.in

Telangana

మార్కెటింగ్ శాఖలో అంతా ‘లేట్‌లతీఫ్’లే

– మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలో బట్టబయలు
– 53 మంది రెగ్యులర్ సిబ్బందిలో 16 మంది ఆలస్యంగా హాజరు
– 42 ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో 5 గురు ఆలస్యం
– ఆలస్యంగా వస్తున్న ఉద్యోగులు
– నోరెళ్లబెట్టిన మంత్రి తుమ్మల
– మెమో ఇవ్వాలని ఆదేశం
– ఇకపై ఫేస్ రికగ్ననైజేషన్‌తో బయోమెట్రిక్ ఏర్పాటు
– ఆకస్మిక తనిఖీతో హడలెత్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– మంత్రి తనిఖీ చేసేవరకూ డుమ్మా సంగతి తెలియని డైరక్టర్

హైదరాబాద్: వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మిక తనిఖీతో మార్కెటింగ్ శాఖ ఉద్యోగులను హడలెత్తించారు. తనిఖీ సందర్భంగా ఉద్యోగులు ఆఫీసుకు సక్రమంగా నిర్దిష్ట పనివేళకు రావడం లేదని తెలుసుకున్న మంత్రి అవాక్కయ్యారు. రిజిస్టర్ తనిఖీ చేసిన ఆయన.. ఇకపై ప్రతి ఒక్కరికీ ఫేస్ రికగ్నైజేషన్‌తో బయోమెట్రిక్ ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ దానిని తన ఆఫీసుకు పంపించాలని ఆదేశించారు. అయితే మంత్రి తనిఖీలు చేసే వరకూ తన విభాగంలో ఉద్యోగులు ఆలస్యంగా వస్తున్నారని మార్కెటింగ్ డైరక్టర్‌కు తెలియకపోవడమే వింత.

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బిఆర్కె భవన్‌లోని మార్కెటింగ్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా, కార్యాలయానికి ఆలస్యంగా హాజరైన అధికారులపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, మార్కెటింగ్ డైరెక్టర్ కి ఆలస్యంగా వచ్చిన సిబ్బంది మీద వెంటనే మెమో ఇచ్చి, సంజాయిషీ తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

ఈ మేరకు మార్కెటింగ్ డైరెక్టర్ మొత్తం 53 మంది రెగ్యులర్ సిబ్బందిలో 16 మంది ఆలస్యంగా హాజరయ్యారని, 42 ఔట్ సోర్సింగ్ సిబ్బందిలో 5గురు మాత్రమే ఆలస్యంగా హాజరయ్యారని, వారికి మెమో జారీ చేశామని తెలిపారు.

దీనికి మంత్రి మార్కెటింగ్ డైరెక్టర్ కి వెంటనే ఫేస్ రికగనైజేషన్ తో బయో మెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇకపై ఆలస్యాన్ని వచ్చిన అధికారులు, అందుబాటులో లేని అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ ని ఆదేశించారు. ప్రతిరోజు సిబ్బంది యొక్క హాజరు పట్టికను మంత్రి ఆఫీసుకు పంపాల్సిందిగా ఆదేశించారు.

LEAVE A RESPONSE