– చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
అమరావతి: పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం సాకారం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అసెంబ్లీలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. తద్వారా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా, కరవు రహితంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై స్వల్ప కాలిక చర్చలో భాగంగా మంగళవారం ఆంజనేయులు మాట్లాడారు. చీఫ్‌విప్‌గా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్‌కి ధన్యవాదాలు తెలిపిన ఆయన గడిచిన అయిదేళ్లలో జగన్ చేసినంత ద్రోహం రాష్ట్ర రైతాంగానికి ఎవరూ చేయలేదన్నారు.
2014-19 మధ్య మొత్తం రూ.7లక్షల కోట్ల బడ్జెట్‌లో సాగునీటి రంగానికి 68,293 కోట్లు ఇచ్చి 62 ప్రాజెక్టులు మొదలు పెట్టామన్నారు. వాటిల్లో 23 ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత కూడా నాటి సీఎంగా చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తద్వారా 32 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తీసుకుని వచ్చామని, జగన్ వచ్చాక సాగునీటికి కేవలం 34 వేల కోట్లు ఖర్చు చేశారని, అందులో జీతాలకే 10వేల కోట్లు పోయాయన్నారు. ఫలితంగానే రాష్ట్రంలో సాగునీటి రంగం అస్తవ్యస్తంగా మారిందన్నారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ టెండ రింగ్ పేరుతో సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 71% పూర్తి చేస్తే జగన్ 4.8% మాత్రమే చేయగలిగారని దుయ్యబట్టారు. జగన్ రాకుండి ఉంటే 2020-21 కల్లా పోలవరం పూర్తయ్యేదని, రాష్ట్రం మొత్తం బాగుపడేదన్నారు. 2014-19 మధ్య బడ్జెట్‌లో సాగునీటికి 9.7% ఇస్తే జగన్ 2.7శాతమే ఖర్చు చేశారన్నారు. రాయలసీమ కోసం తెలుగుదేశం ప్రభుత్వం రూ. 12,441 కోట్లు ఖర్చు పెడితే జగన్ ప్రభుత్వం కేవలం రూ.2వేల కోట్లే ఖర్చు చేసిందన్నారు. అది రాయలసీమకు ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంలో 450 ఎత్తిపోతల పథకాలు మూతబడ్డాయన్న జీవీ ట్రాన్స్‌ఫార్మర్లు పోయినా, మోటార్లు రిపేర్లు వచ్చినా పట్టించుకోలేదన్నారు.
గుండ్లకమ్మ పులిచింతల గేట్లు కొట్టుకుని పోయినా కనీసం పట్టలేదన్నారు. నిర్వహణకు కూడా నిధులివ్వలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలవరం, వినుకొండ ప్రాంతానికి కీలకమైన బొల్లాపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేస్తుందని, గోదావరి-పెన్నా అనుసంధానంతో గుంటూరు, ప్రకాశం, రాయలసీమను సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.