• టీడీపీ కార్యకర్త రోడ్లు వేస్తే.. వైసీపీ నేతలు బిల్లులు చేసుకున్నారు!
• స్థలాన్ని లీజ్ కు తీసుకుని దొంగపత్రాలతో భూమిని కొట్టేయాలని వైసీపీ నేత కుట్ర
– గ్రీవెన్స్ లో మొరపెట్టుకున్న బాధితులు
• న్యాయం చేస్తామని బాధితులకు నేతల హామీ
మంగళగిరి: వైసీపీ నేతల దౌర్జన్యాలు, కబ్జాలపై వినతులు వెల్లువెత్తున్నాయి. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు తమ అర్జీలు ఇచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని వేడుకున్నారు. మాజీ శాసన మండలి ఛైర్మన్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్, రాష్ట్ర వినియోగదారుల పరిరక్షణ మండలి చైర్ పర్సన్ పీతల సుజాత, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు సమస్యలు విని పరిష్కారానికి కృషి చేశారు.
• తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం జంగావాండ్లపల్లె గ్రామ పంచాయతీకి చెందిన బి. ప్రతాప్ రెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. 2017 -2018 సంవత్సరంలో చినిగేపల్లిలో తాను సిమెంట్ రోడ్ల పనులు చేయగా.. వచ్చిన బిల్లుల డబ్బులను వైసీపీ నేతలు కొట్టేశారని.. వారిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని… తనకు న్యాయం చేయాలని.. తనకు రవాల్సిన డబ్బులు ఇప్పించి సహకరించాలని నేతలకు విజ్ఞప్తి చేశారు.
• గత ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నాయకులు దళితులమైన తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకొని కులం పేరుతో దూషించి దౌర్జన్యం చేయగా.. పోలీస్ కేసు పెడితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారని, అయినప్పటికీ వైసీపీ నాయకులు తమను బెదిరిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకొని తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు నిర్మించుకొనుటకు రక్షణ కల్పించాలని వారు నేతలకు వినతి పత్రం ఇచ్చి అభ్యర్థించారు.
• డిగ్రీ చదువుతున్న తన కుమారుడిని ఎవరో దారుణంగా కొట్టి చంపారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. కేసును పక్కదారి పట్టించేందుకు యాక్సిడెంట్ లో చనిపోయాడని చెబుతున్నారని .. తన కుమారుడి చావుకు కారణమైనవారిని గుర్తించి వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం చోడవరం రెల్లివీధికి చెందిన సోమాదుల కృప అనే మహిళ నేతలకు అర్జీ ఇచ్చి ఆవేదనను వ్యక్తం చేసింది.
• చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెద్ద రాజుపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నేతలకు ఫిర్యాదు చేస్తూ.. తన భూమిని లీజ్ కు ఇస్తే.. లీజుకు తీసుకున్న వైసీపీ నేతలకు భూమిపై కన్ను పడి తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కొట్టేసేందుకు యత్నించారని.. దీనిపై పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని. అధికారులు విచారించి తగిన న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
• తన అనుభవంలో ఉండి తన పేరుమీద ఆన్ లైన్ అయిన భూమిని కొట్టేసేందుకు గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ కుట్ర పన్నుతోందని.. మనుషులతో వచ్చి దౌర్జన్యం చేస్తోందని.. అధికారులు తమ భూమిని సర్వే చేసి పూర్తి హక్కులు తమకు కల్పించాలని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం కోవిలంపాడు గ్రామానికి చెందిన నన్నెసాని గుంటెయ్య నేతల ఫిర్యాదు చేశారు.
• ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉర్దూ ఉపాధ్యాయ పోస్టుల భర్తికి తగిన చర్యలు తీసుకోవాలని.. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులు కూడా భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు తమ ఆవేదనను గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి తెలిపారు. గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని.. తమకు అన్యాయం చేసిందని.. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
• క్లాప్ ఆటోడ్రైవర్లు, సూపర్వైజర్ల నియామకం నిర్వహణను ఏజెన్సీ వ్యవస్థ నుంచి తప్పించి మున్సిపాలిటీ ఆఫీసు పరిధిలోకి తెచ్చి స్వచ్ఛాంధ కార్పొరేషన్ నుండి వేతనాలు చెల్లించాలని పలువురు అర్జీదారులు నేతలకు విజ్ఞప్తి చేశారు.
• ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది ట్యాంక్ వాచర్, ఎవిన్యూ వాచర్, గేట్ వాల్ ఆపరేటర్, ఎలక్ట్రీషియన్ ఇలా వివిధ రకాల పేర్లతో తాము 30 ఏళ్ళ నుండి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నామని.. తమకు ఉద్యోగ భద్రత కల్పించి ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.