Suryaa.co.in

Editorial

ఆడు మగాడ్రా బుజ్జీ!

( మార్తి సుబ్రహ్మణ్యం)

డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సస్పెన్షన్ కాలం పూర్తయినందున మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా ఏబీవీ మీడియాతో మాట్లాడుతూ తనపై కావాలనే విషప్రచారం చేశారన్నారు. తన సస్పెన్షన్‌పై ప్రభుత్వ ఎస్‌ఎల్పీని న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. చట్ట ప్రకారమే తాను పోరాటం చేశానని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఏ సైకో కళ్లల్లో ఆనందం చూడ్డం కోసం ఇలా చేశారు?.. ఇదంతా జరిగేందుకు కారకులెవరని ఆయన ప్రశ్నించారు. సస్పెన్షన్‌ను ప్రశ్నించడమే తన తప్పా..? అని ఏబీవీ నిలదీశారు. ఈ కేసు రెండేళ్ల రెండు నెలలపాటు కొనసాగిందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.

న్యాయవాదులకు ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఒక తప్పుడు నివేదిక ఆధారంగా 24 గంటల్లో తనను సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరునెలల కోసారి సస్పెన్షన్‌ పొడిగిస్తూ రిపోర్టులిచ్చారన్నారు. ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఫిర్యాదు చేశానన్నారు. కొనుగోలు అనేదే లేనప్పుడు అవినీతి ఎలా జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. తనను, తన కుటుంబాన్ని క్షోభ పెట్టి ఏం సాధించారన్నారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన అధికారుల నుంచి.. రెవెన్యూ రికవరీ చేయాలని ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఇదీ.. ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం డిజిపి స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు.

ఉండటానికి.. చేయడానికి.. చూడ్డానికి చాలామంది అధికారులుంటారు. కానీ ఆత్మాభిమానం, గుండెధైర్యం, ఒత్తిళ్లకు లొంగని నైజం ఉన్న అధికారులు బహుతక్కువ మందే కనిపిస్తారు. వాళ్లకు బతుకుమీద బెరుకు ఉండదు. ఉద్యోగం మీద తీపి ఉండదు. పీఎఫ్‌లు, హెచ్చార్యేలు, టీఏ, డీఏల గురించి ఆలోచించరు. దేనికయినా తగ్గేదేలా అని చివరివరకూ పోరాడేతత్వం. ఇక సాక్షాత్తూ సర్కారుపైనే సమరశంఖం పూరించడమంటే తమాషా కాదు. అలాంటి అధికారులను సర్కారుతోపాటు, సదరు అధికారి బ్యాచ్‌మెట్లూ దాదాపు వెలివేసినంత పనిచేస్తారు. ఆయనతో మాట్లాడేందుకూ వ ణికిపోతారు. ఎదురుపడకుండా జాగ్రత్తపడతారు. ఇళ్లలో ఎలాంటి కార్యక్రమం జరిగినా ముఖం చాటేస్తారు.

అలాంటి ‘ఒంటరి యోధ’ కడదాకా నిలిచి, సర్కారుపై గెలవడమంటే తమాషా కాదు. ఆషామాషీ అసలే కాదు. సర్కారు వేధింపులు, అవమానాలు, తోటి అధికారుల సహాయనిరాకరణ, సన్నిహితుల అనుమానపు చూపులు, కోర్టు-లాయర్ల చుట్టూ చక్కర్ల మధ్య ప్రత్యర్ధులు సంధించే లీకువార్తలతో మానసిక నలిగిపోకుండా.. కుటుంబాన్ని కుంగిపోనీయకుండా.. నిటారుగా నిలబడి.. సర్కారుతో కలబడి, నిలబడి విజయాన్ని సొంతం చేసుకునే ఆ అధికారి ఎవరైనా.. మగాడికిందే లెక్క. రెండేళ్ల ఏపీ ప్రభుత్వ సస్పెన్షన్ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో, తిరిగి పోలీసుశాఖలోకి కాలుపెట్టనున్న సీనియర్ ఐపిఎస్, డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కూడా అలాంటి మగాడి కిందే లెక్క.

ఆలూరి బాల వెంకటేశ్వరరావు… ఏబీ వెంకటేశ్వరరావు.. ఏబీవీ… తాజాగా సుప్రీంకోర్టు బయట నిలబడి సంధించిన ప్రశ్నాస్త్రాలతో వెన్నులేని చాలామంది ఐఏఎస్-ఐపిఎస్ అధికారుల వీపులు పగిలిపోయే ఉండాలి. సుప్రీంకోర్టు బయట నిలబడిన ఆయనను చుట్టుముట్టిన మీడియా కూడా, మతిపోయేంతగా మాట్లాడిన ఏబీవీ తదుపరి లక్ష్యం ఏమిటన్నదే ప్రశ్న.

‘‘ఏ సైకో కళ్లలో ఆనందం చూడటం కోసం ఇదంతా చేశారు? ఏ బావకళ్లలో ఆనందం చూడ్డానికి ఇదంతా చేశారు? ఏ శాడిస్ట్ కళ్లలో ఆనందం చూడ్డం కోసం సస్పెండ్ చేసి ఇదంతా చేశారు. నేను లోకల్’’ యస్. ఇవ న్నీ సినిమా డైలాగులు కాదు. టీవీ సీరియల్ డైలాగులు అసలే కావు. అచ్చంగా.. అక్షరాలా.. తన సస్పెన్షన్‌కు కారకులయిన ‘ముసుగువీరులై’పె ఏబీ వెంకటేశ్వరరావు సంధించిన ప్రశ్నాస్త్రాలే. ఇంతకూ ఆ సైకోలు, ఆ శాడిస్టులు, బావ ఆనందిస్తే చూసి మురిసిపోయే ఆ బామ్మర్దులెవరు? ఇదొక్కటే.. అందరికీ తెలిసీ-తెలియని ‘సమాధానపు ప్రశ్న’.

అంతేనా? కొందరు ఐఏఎస్‌ల బానిస మనస్తత్వాన్నీ నిగ్గదీసి ప్రశ్నించారు. ‘‘ ఈరోజు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు ఓడిపోవడానికి కారణమెవరు? రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ కొనసాగించడం కుదరదు కాబట్టి ఆర్డరివ్వమని సీఎస్‌కు లేఖ రాశా. ఆయన స్పందించలేదు. ఆయన తన చేతిలో అధికారం

వినియోగించి నిర్ణయం తీసుకుని ఉంటే ఇక్కడిదాకా వచ్చేదా? ఇంత ఖర్చు పెట్టాల్సిన పని ఉండేదా? దీనికి బాధ్యులెవరు? ఒక డీజీపీ ఇచ్చిన ఫోర్జరీ మెమో ఆధారంగా, ఒక ఏడీజీ సీఐడీ రాయించిన తప్పుడు రిపోర్టు ఆధారంగా అప్పట్లో ఉన్న ప్రముఖులు, చీఫ్ సెక్రటరీలు ఏమీ చదవకుండానే వాటిపై సంతకాలు పెట్టి 24 గంటల్లో నన్ను సస్పెండ్ చేశారు. ఆరునెలలకోసారి పొడిగించారు. తప్పుదోవపట్టించిన వ్యవహారంపై సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాటిని అందించా. అయినా ఏం చర్యలు తీసుకున్నారో తెలీదు’’ అంటూ తనపై వేటుకు దారితీసిన తెరవెనుక కారణాలను, వాటిని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారుల అసమర్ధతనూ చూపుడు వేలితో ప్రశ్నించడం అద్భుతమే.

‘‘ సీఐడీ డీఎస్పీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకూ అందరిదీ ఒకే ఆవు వ్యాసం. అసలు కొనుగోలే జరగని దాంట్లో అవినీతి ఎలా జరింగదని ఎవరూ ప్రశ్నించరా? మీకు వృతి నైపుణ్యాలు లేవా? ప్రభుత్వాలను నడిపేవాళ్లు వస్తుంటారు, పోతుంటారు. చీఫ్ సెక్రటరీలు వస్తుంటారు, పోతుంటారు. ప్రజలు శాశత్వతం. దీనికి ఇంత ఖర్చయింది. దీనికి కారణం ఎవరు? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తారా? ఎప్పుడైనా పార పట్టుకుని పొలానికి నీళ్లు పెట్టారా? ఉదయం నుంచి రాత్రి వరకూ ఏైదె నా దుకాణంలో కూర్చున్నారా? కూరగాయలబండి పెట్టుకుని వీధి వీధి తిరగండి. కష్టం విలువేమిటో తెలుస్తుంది? చెమటోడ్చి ప్రజలు కడుతున్న పన్నులను దొంగకేసులు వేసి ఖర్చు చేయడానికి మీకు పాపం అనిపించడం లేదా? దీనికోసమేనా మనం ఐఏఎస్-ఐపిఎస్ అధికారులమయింది? నేను ఎవరినీ వదిలిపెట్టను. నేను లోకల్. ప్రతి పైసాకూ లెక్కచెప్పాల్సిందే. ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్న అధికారులకు బుద్ధి వచ్చేలా శిక్షించాలి. ప్రభుత్వానికయిన ఇంత ఖర్చునూ, తప్పుడు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిన అధికారుల నుంచి రెవిన్యూ రికవరీ యాక్టు ప్రకారం వసూలు చేయాల్సిందే’ అంటూ వెన్ను లేని, పాలకుల మెహర్బానీ కోసం మోకరిల్లే అధికారులపై.. ఈటెల్లాంటి మాటలతో దాడి చేసిన ఏబీవీ ధైర్యాన్ని మెచ్చుకోనివాడు, ప్రజాస్వామ్యవాదే కాదన్నది బుద్ధిజీవుల ఉవాచ.

నాకు తెలిసి.. గత మూడు దశాబ్దాల నుంచి ఏ ఒక్క అధికారీ ఇలా నిటారుగా నిలబడి తోటి అధికారుల బానిసత్వాన్ని నిలబెట్టి, నిగ్గదీసిన దాఖలాలు లేవు. అందుకే.. సుప్రీంకోర్టు బయట నిలబడి, నిర్భయంగా ప్రశ్నాస్త్రాలు సంధించిన ఏబీవీ మాటలు చూస్తే, తనికెళ్ల భరణి అదేదో సినిమాలో చెప్పిన ‘ఆడు మగాడ్రా బుజ్జా’ డైలాగు గుర్తుకొచ్చింది. అవును.. నిజమే. ఆడు మగాడ్రా బుజ్జీ!

సహజంగా ఏబీవీ స్థానంలో మరొక ఆఫీసరు ఉంటే.. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత.. నేరుగా ఢిల్లీలోని ఏ వెంకటేశ్వరస్వామి గుడికో, ఏ గురుద్వారాకో వెళ్లి పూజలు చేసి, ప్రసాదం కళ్లకద్దుకుని తినేవాళ్లు. తీర్పు వచ్చిన ఆనందంలో ఢిల్లీ మార్కెట్‌లో షాపింగ్ చేసి, అమరావతికి వెళ్లి సీఎస్‌ను కలసి ‘కోర్టు తీర్పు వచ్చింది కదా మరి నా పోస్టింగు, రావలసిన జీతం గురించి చూడండి’ అని ప్రాధేయపడేవాళ్లు.

కానీ.. ఏబీవీ రొటీన్‌కు భిన్నంగా వ్యవహరించి, సర్కారుకు సాగిలబడే సాటి అధికారులపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడమే విశేషం. సర్కారుకు సాగిలబడి నిర్ణయాలు తీసుకునే అధికారులపై అవి ఒకరకంగా అంకుశాలే. నిజంగా ఆత్మాభిమానం ఉన్న అధికారులెవరైనా, ఏబీ కొరడాల తర్వాత అద్దం ముందు చూసుకుని ఆత్మవిశ్లేషణ చేసుకోవలసిందే. ఆయనను కలిసిన విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చే సమయంలో… ఏబీవీ ప్రదర్శించిన బాడీలాంగ్వేజ్, తెగింపు, దేనికైనా రెడీ అన్న సమరసన్నద్ధత స్పష్టంగా కనిపించాయి. అంత ఆనంద-ఆవేశ సందర్భంలోనూ ఆయన, పాలకులను ఒక్కమాట కూడా అనకపోవడం విశ్లేషం.

ఇక ఏబీ ఏం చేయబోతున్నారు? సగటు అధికారి మాదిరిగా ఇచ్చిన పోస్టింగ్ తీసుకుని సర్దుకుంటారా? లేక తాను మానసికంగా, ఆర్ధికంగా ఇబ్బందిపడేందుకు కారకులయిన అధికారుల నుంచి కోర్టు ఖర్చులు రికవరీ అయ్యేవరకూ.. ఉద్యోగం చేస్తూనే పోరాడి, కొత్త చరిత్రకు తెరలేపుతారా? దానితోపాటు పెండింగ్‌లో ఉన్న తాను వేసిన పాత పరువునష్టం కేసు కోసం మరో పోరాటం చేస్తారా? ఇవన్నీ కాక.. పోస్టింగ్ తీసుకుని లక్ష్యం నెరవేరిందన్న తృప్తితో రాజీనామా చేస్తారా? ఇవీ ఇప్పుడు ఏబీ వైపు ఆసక్తిగా చూస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే… ఏబీవీ మీడియాతో మాట్లాడే సందర్భంలో ఆయన ఆవేదన, ఆగ్రహం, తిరుగుబాటు తీరు చూస్తే ‘ఇది సంసారం చేసే కళకాదన్న’ పాత సామెత గుర్తుకొచ్చింది. అదీ ఆ అనుమానానికి కారణం.

LEAVE A RESPONSE