ముస్లిం వర్గాన్ని వేధిస్తున్న వైసిపి ప్రభుత్వం తప్పక మూల్యం చెల్లిస్తుంది

– టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
– తమకు అండగా నిలవాలని చంద్రబాబు కు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి విన్నపం

అమరావతి:- అధికార పార్టీ ప్రోద్భలంతో దాడులకు గురవుతున్న ముస్లిం వర్గానికి టీడీపీ అండగా ఉంటుందని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం వర్గం తీవ్రంగా నష్టపోయిందని ఆయన అన్నారు. ముస్లింలను వేధిస్తున్న వైసిపి ప్రభుత్వం ఖచ్చితంగా దానికి గట్టి మూల్యం చెల్లిస్తుందని అన్నారు.

పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడుతో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లింలపై దాడులు, వేధింపులు పెరిగాయని…ఇప్పటి వరకు 72 తీవ్ర స్థాయి ఘటనలు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎం. ఫరూక్ షుబ్లీ చంద్రబాబుకు వివరించారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ద్వారా ముస్లిం ల హక్కుల కోసం, రక్షణ కోసం పోరాడుతున్నాం అని…తమకు అండగా నిలవాలని టీడీపీ అధినేతను కోరారు.

ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకుని ముస్లిం వర్గానికి అండగా నిలుస్తామని…ఆయా ఘటనలపై న్యాయ పోరాటం చేస్తామని తమకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత 70 శాతం వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూములు అన్యాక్రాంతం అయ్యాయని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము ఎదుర్కొన్న వేధింపులను వివరించారు.

రాయచోటి నుంచి వచ్చిన అజీదా అనే మహిళ తనను అంగన్ వాడీ ఉద్యోగం నుంచి ఎలా తొలగించిందీ వివరించారు. సొంత మనుషులకు పోస్టు ఇప్పించేందుకు తనపై తప్పుడు ఆరోపణలతో ఏకంగా రాజద్రోహం కేసు పెట్టారని చెప్పారు. నెల్లూరు నుంచి వచ్చిన వక్ఫ్ బోర్డు ఉద్యోగి మున్వర్… వక్ఫ్ బోర్డు ఆస్తుల అన్యాక్రాంతంపై ప్రశ్నించిన తనను ఎలా ఉద్యోగం నుంచి తొలగించిందీ చెప్పారు. వక్ఫ్ బోర్డు భూముల అన్యాక్రాంతంపై తాను ఫిర్యాదు చేశాను అని తనను ఉద్యోగం నుంచి తొలగించారని….జీతంపై ఆధారపడి కుటుంబాన్ని పోషించుకునే తాను ఉద్యోగం పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని చెప్పాడు.

జగన్ ముస్లిం పక్షపాతి అయితే మా ఆస్తులు మాకు ఇవ్వాలి…మా వక్ఫ్ బోర్డు ఆస్తుల కోసం మేం బిక్షం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని మున్వర్ అన్నారు. ఇక మార్కాపురం నుంచి వచ్చిన రెహానా బాను అనే మహిళ….వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ముస్లింలకు వచ్చే పథకాలు అన్నీ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన టీడీపీ అధినేత….దాడులకు, వేధింపులకు గురైన వారికి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో బయటకు తెలిసే ముస్లింపై దాడులు, వేధింపుల్లో 72 ఘటనలు జరిగాయని…ఎన్నో ఘటనలు వెలుగు చూడలేదని అన్నారు. ముస్లిం వర్గంపై దాడులు విషయంలో, వక్ఫ్ బోర్డు ఆస్తుల రక్షణ విషయంలో సమితి చేస్తున్న పోరాటాన్ని అభినందించారు.

తెలుగు దేశం పార్టీ ముస్లి వర్గానికి అండగా ఉంటుందని తెలిపారు. ముస్లిం మహిళపై దేశ ద్రోహం సెక్షన్ కింద కేసు పెట్టడం, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నించిన మున్వర్ ను ఉద్యోగం నుంచి తొలగించడం దారుణం అన్నారు. మైనారిటీ హక్కుల కోసం గళం వెత్తిన షుబ్లీని గతంలో అరెస్టు చేశారని, కౌన్సిల్ చైర్మన్ గా ఉన్న షరీఫ్ ను వైసిపి మంత్రులు నాడు దారుణంగా దూషించారని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలపై దాడులు చేస్తోందని…చివరికి సొంత పార్టీ వారిపైనా దాడులు చేస్తున్నారని…వారి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అన్నారు.

తెలుగు దేశం ఆవిర్భావం నుంచి ముస్లింలకు అండగా నిలిచిందని చంద్రబాబు అన్నారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా, అబ్దుల్ కలాంను రాష్ట్ర పతిగా చేసినా అది టీడీపీ వల్లనే జరిగిందని అన్నారు. రంజాన్ తోఫా, దుల్హన్ సహా అనేక పథకాలు నాడు ఇచ్చామని…ఇప్పుడు ఈ ప్రభుత్వం అన్నీ రద్దు చేసిందని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ అహ్మద్ షరీఫ్, మాజీ మంత్రి ఎన్ ఎండి ఫరూక్, మాజీ ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, అత్తర్ చాంద్ భాషా, మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్, గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇంచార్జ్ నసీర్ అహ్మద్, కడప అసెంబ్లీ పార్టీ ఇంచార్జ్ అమీర్ బాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ నజీర్, రాష్ట్ర అధికార ప్రతినిధులు నాగుల్ మీరా, సయ్యద్ రఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్వీన్ తాజ్ తో పాటు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి నేతలు, మైనారిటీ సెల్ నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.