Suryaa.co.in

Telangana

రైతుల పొలాల్లో పంట‌ల సిరులు… క‌ళ్ళ‌ల్లో ఆనందోత్సాహాలు

-తెలంగాణ‌లో రైతు శ్రేయోరాజ్యం
-కెసిఆర్ పాల‌నే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ ర‌క్ష‌
-సిఎం కెసిఆర్ రైతుల ప‌క్ష‌పాతి
-రాష్ట్రంలో రైతుల‌కు పంట‌ల పండుగ‌
-ఉచితంగానే రైతాంగానికి అన్ని స‌దుపాయాలు
-స‌మృద్ధిగా నీరు, ఉచిత కరెంటు, పంట‌ల న‌ష్టాల‌కు ప‌రిహారం, రైతు బంధు, రైతు బీమా, చివ‌ర‌కు పంట‌ల కొనుగోలు
-రైతాంగం కోసం క‌ల్లాలు, రైతు వేదిక‌లు
-ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో పండుగ‌లా రైతు దినోత్స‌వాలు
-రాష్ట్రావ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా శ‌నివారం రైతు వేదిక‌లు, మార్కెట్ యార్డుల్లో నిర్వ‌హించిన రైతు దినోత్స‌వాల‌లో రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు

ఎనుమాముల మార్కెట్‌, గ‌విచ‌ర్ల, కంఠాయ‌పాలెం, అమ్మాపురం, ఏడునూతుల, జూన్ 3 ః
రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుప‌డ‌దు. అందుకే రాష్ట్రంలో దండుగ‌లా మారిన వ్య‌వ‌సాయాన్ని పండుగ చేసి, రైతుల పొలాల్లో పంట‌ల సిరులు, వారి క‌ళ్ళ‌ల్లో ఆనందోత్సాహాలు నింపుతున్న ఏకైక ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మాత్ర‌మేన‌ని, రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ ద‌శాబ్ది ఉత్స‌వాల‌లో భాగంగా 3వ తేదీన నిర్వ‌హిస్తున్న రైతు దినోత్స‌వాల సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. వ‌రంగ‌ల్ ఎనుమాముల మార్కెట్‌, సంగెం మండ‌లం గ‌విచ‌ర్ల రైతు వేదిక‌, మ‌హ‌బూబాబాద్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం తొర్రూరు మండ‌లం కంఠాయ‌పాలెం, అమ్మాపురం, జ‌న‌గామ జిల్లా కొడ‌కండ్ల మండ‌లం ఏడునూతుల త‌దిత‌ర గ్రామాల్లోని రైతు వేదిక‌ల వ‌ద్ద వైభ‌వంగా జ‌రిగిన రైతు దినోత్స‌వాల‌లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ, ఈ ప్ర‌పంచంలో రైతు లేకుంటే మానవ మనుగడ లేదు. మ‌న్నుల నుంచి అన్నం తీసే మ‌హిమ మ‌న రైతాంగానిది. అలాంటి రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డే దుస్థితి మ‌న‌కంటే ముందు పాల‌కుల వ‌ల్ల ఏర్ప‌డింది. అందుకే సీఎం కెసిఆర్ తెలంగాణ‌ను తేవ‌డ‌మే కాదు. క‌ష్టాల్లో ఉన్న రైతుల‌ను ఆదుకోవ‌డానికి అనేక చ‌ర్య‌లు తీసుకున్న మ‌న‌సున్న మ‌హ‌రాజు మ‌న ముఖ్య‌మంత్రి అని అన్నారు. రైతుల అభివృద్ధి, వారి శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నమైన, విశేష‌మైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమ‌లు చేస్తూ, రైతుల‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నార‌ని చెప్పారు.

75 సంవత్సరాలలో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన ఏ పాల‌కులు చేయ‌ని విధంగా, వారెవ‌రికీ త‌ట్ట‌ని విధంగా సీఎం కెసిఆర్ అనేక ప‌థ‌కాల‌ను రూపొందించార‌న్నారు. పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌డ‌మేగాక‌, 2 సంవత్సరాలలో కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలను అదనంగా సాగులోకి తెచ్చార‌న్నారు. విద్యుత్ శాఖ‌కు రైతుల ప‌క్షాన ఏటా రూ.10వేల 500 కోట్లు క‌డుతూ, రైతుల‌కు ఉచితంగా 24 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నార‌న్నారు. క‌ల్తీలేని ఎరువులు, విత్త‌నాలు, అందుబాటులో ఉంచి, రుణ‌మాఫీ కూడా చేశార‌న్నారు. రైతు బంధు పెట్టుబడి సహాయంతో పాటు, రైతు ఏ కార‌ణంగా మ‌ర‌ణించినా వారం రోజుల్లోనే వారి కుటుంబానికి రూ.5ల‌క్ష‌లు అందే విధంగా రైతు బీమా తీసుకువ‌చ్చార‌న్నారు. పంట‌ల న‌ష్టాల‌కు దేశంలో ఎక్క‌డా ఇవ్వ‌ని విధంగా ఎక‌రాకు రూ.10వేల ఇచ్చిన ఘ‌త‌న కూడా మ‌న సీఎం కెసిఆర్ దే అన్నారు. అలాగే ఏడాదికి 30వేల కోట్ల‌తో రైతాంగం న‌ష్ట‌పోకుండా వారి పంట‌ల‌ను మొత్తం ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తున్న‌ద‌ని తెలిపారు.

దీంతో దిగుబ‌డులు పెరిగి, రాష్ట్రం దేశానికి ధాన్యం భండాగారంగా మారింద‌ని, మ‌న రైతులు పండించే పంట‌లు, మ‌న దేశానికే కాదు విదేశాల‌కు సైతం ఆహారం పంపిణీ చేసే స్థాయికి చేరింద‌ని, ఇదంగా సీఎం కెసిఆర్ ఘ‌న‌తేన‌ని మంత్రి రైతుల‌కు వివ‌రించారు. ఇందుక‌నుగుణంగా రాష్ట్రంలో మార్కెట్ యార్డుల అభివృద్ధి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెద్ద కవర్ షెడ్ల నిర్మాణం, స్వాగత తోరణాలు, మార్కెట్ యార్డుల్లో ప్లాట్ ఫామ్ లు, రైతు విశ్రాంతి భవనాలు, టాయిలెట్స్ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామ‌న్నారు. 17.35 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను అదనంగా నిర్మించి అందుబాటులోకి తేవడం జరిగిందని, రైతులు తమ సరుకును గోదాములో నిల్వ ఉంచినట్లయితే 180 రోజుల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం క‌ల్పించామ‌ని, సి సి కెమెరాలతో పర్యవేక్షణ, పశు వైద్య ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 3 కోట్ల 50 లక్షల టన్నుల వ‌ర‌కు ధాన్యం పెరిగింద‌ని చెప్పారు.

వ్యాపార‌, ప్రయోగాత్మకమైన పంటల వైపు రైతులను చైత‌న్య ప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అలాగే పంట‌ల కాలంలో వ‌స్తున్న మార్పుల‌క‌నుగుణంగా, రైతులు కూడా త‌మ పంట‌లు వేసే కాలాన్ని కూడా కొద్దిగా ముందుకు జ‌రపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఆ దిశ‌గా ప్ర‌భుత్వం ఆలోచిస్తుంద‌ని, రైతులు కూడా పంట‌ల న‌ష్టాలు, వ‌డ‌గండ్లు, క‌డ‌గండ్లు లేకుండా ఉండాలంటే, ఈ దిశ‌గా ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతాంగానికి వివ‌రించారు.

చెరువుల, కాలువ‌ల పున‌రుద్ధ‌ర‌ణ‌, రిజ‌ర్వాయ‌ర్ల ఏర్పాటు, చెరువుల‌ను నీటితో నింప‌డం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయ‌ని ఇది మొత్తం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభ సూచిక‌గా మంత్రి అభివ‌ర్ణించారు.

ఒక‌వైపు కెసిఆర్ రైతుల కోసం ఇంత‌గా చేస్తుంటే, కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం మాత్రం రైతు వ్య‌తిరేక చ‌ట్టాలు, విధానాల‌తో సాగుతోంద‌ని విమ‌ర్శించారు. రైతుల మీట‌ర్ల‌కు మోట‌ర్లు బిగించాల‌ని కుట్ర ప‌న్నింద‌ని, కెసిఆర్ మాత్రం త‌న బొండిగ‌లో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు రాష్ట్ర రైతుల మోటార్ల‌కు మీట‌ర్లు పెట్ట‌నివ్వ‌న‌ని తెగేసి చెప్పార‌ని మంత్రి తెలిపారు. అంతేగాక కేంద్రం మ‌న ధాన్యాన్ని, బియ్యాన్ని కొనుగోలు చేయ‌డం లేదు. పూర్తిగా స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తోంద‌ని, అయినా కెసిఆర్ మాత్రం రైతుల కోసం ఎంత దూర‌మైనా వెళ్ళ‌డానికి, ఇంకేమైనా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని ఎర్ర‌బెల్లి తెలిపారు. ఈ అంశాల‌న్నింట‌వినీ రైతులు బేరీజు వేసుకోవాలి. గ‌తంలో ఎలా ఉండె. ఇప్పుడు ఎలా ఉంది? అనే విష‌యాల‌ను విశ్లేషించుకోవాలి. చ‌ర్చించుకోవాలి. సీఎం కెసిఆర్ కి అండ‌గా నిల‌వాల‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు రైతుల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సూచించారు.

వినూత్న వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌తో రాష్ట్రంలో వ్య‌వ‌సాయ విప్ల‌వం ః జిల్లా క‌లెక్ట‌ర్ శ‌శాంక‌
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ, తెలంగాణ వస్తే ఏం వస్తది అన్నవాళ్ళ‌కి ఈ 9 ఏండ్ల పాల‌నే ఉదాహ‌ర‌ణ‌, సాగులో గరిష్టంగా జిల్లాలో 2 లక్షల 93 వేల నుండి 445 వేల ఎకరాల్లో సాగులోకి వచ్చింద‌ని, రైతాంగానికి ప్రభుత్వం అండ‌గా నిలిచింద‌ని, రైతుల కోసం ప్రయోగాత్మక పథకాలు ప్రవేశపెడుతుందని, అందుకే ఇవ్వాళ పంట‌ల దిగుబ‌డులు పెరిగి, రైతులు ఆనందంగా ఉన్నార‌ని అన్నారు.

రైతులకు అండగా ప్రభుత్వం: జనగామ అడిషనల్ కలెక్టర్ దేశాయ్
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలవడమే కాక అన్ని విధాలుగా సహకరిస్తూ వారి శ్రేయస్సు కోసం పని చేస్తున్నదని, జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు జనగామ జిల్లా ఏడు మృతుల లో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఆయా పథకాలను వివరించారు.

ఆకట్టుకున్న రైతుల ప్రసంగాలు
ఆ రైతు వేదికల వద్ద పలువురు రైతులు ఉత్తమ రైతులు మహిళా రైతుల పలువురు తమ అనుభవాలను పంచుకున్నారు. తెలంగాణ రాకముందు వారి పరిస్థితి ఎలా ఉండింది తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ రైతు అనుకూల విధానాల వల్ల పొందిన ప్రయోజనాలను వారు వివరించారు .వ్యక్తిగతంగా తాము పొందిన లాభాలను మిగతా రైతులతో పంచుకున్నారు. కొందరు రైతులు తాజా పరిస్థితులను గత అనుభవాలను చెబుతూ కంటనీరు పెట్టారు. సీఎం కేసీఆర్ ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని కొనియాడారు.

ఆయా కార్య‌క్ర‌మాల్లో ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు, రైతులు, ప్ర‌త్యేకంగా మ‌హిళా రైతులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుగారికి మ‌హిళా రైతులు రైతు వేదిక‌ల వ‌ద్ద‌ బ‌తుక‌మ్మ‌లు, కోలాటాలు, డ‌ప్పు వాయిద్యాల‌తో, పూలు చ‌ల్లుతూ ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. అలాగే కొంద‌రు రైతులు మాట్లాడుతూ, త‌మ అనుభ‌వాల ద్వారా రాష్ట్రంలో రైతుల అప్ప‌టి, ఇప్ప‌టి ప‌రిస్థితుల‌ను వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి క‌ళాకారుల సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు రైతుల‌ను విశేషంగా ఆక‌ర్శించాయి.

LEAVE A RESPONSE