ఎస్సీ, ఎస్ టి, బీసీలకే వైకాపాలో ఎక్కువ అన్యాయం

-జగన్మోహన్ రెడ్డిని చూసి కాదు… నన్ను చూసి ఓటేయమన్న వీరభద్ర స్వామి
-రెడ్ల పౌరుషానికి ప్రతీక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి… ఆయన కాంస్య విగ్రహ ప్రారంభోత్సవాన్ని అడ్డుకోవడం దారుణం
-నిర్దోషి అయితే 381 సార్లు వాయిదా ఎందుకు కోరినట్టు?!
-వైయస్సార్ పై అభిమానంతో యాత్ర సినిమాను సక్సెస్ చేసిన అభిమానులు… జగన్ బయోపిక్ గా వస్తున్న యాత్ర -2 ను ఆదరించే అవకాశాలు శూన్యం
-ఇప్పటికైనా అంగన్వాడీలను ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడాలి
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

వైకాపాలో ఎస్సీ, ఎస్ టి, బీసీ వర్గాలకే ఎక్కువగా అన్యాయం జరుగుతోందని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఇప్పటివరకు వైకాపా కు బాగా మద్దతునిచ్చిన దళిత సామాజిక వర్గం, ఇప్పుడిప్పుడే దూరం అవుతోందన్నారు. సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… బ్రదర్ అనిల్ రంగ ప్రవేశం తరువాత వారు మరింత దూరం అవుతారన్నారు.

వీరభద్ర స్వామి మాట్లాడినట్టుగా మాట్లాడితే నెగ్గే చాన్స్
జగన్మోహన్ రెడ్డి ని చూసి కాదు, నన్ను చూసి ఓటు వేయమని విజయనగరంలో వీరభద్ర స్వామి కోరినట్లుగానే, కోరితే వైకాపాలో ఒకటి, అర నెగ్గే వారు నెగ్గుతారని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైకాపాలో వీరభద్ర స్వామి వ్యాఖ్యలు విచిత్ర పరిణామంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి సూపర్… తోపు ఆయన్ని చూసి ఓటు వేయాలని మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడినట్లుగా మాట్లాడితే అసెంబ్లీ ముఖం కూడా చూడడం కష్టం. వీరభద్ర స్వామి లాగా నిజాయితీగా మాట్లాడితేనే ప్రజలు విశ్వసిస్తారు. అప్పుడే వారు విజయవకాశాల రేసులో నిలబడే అవకాశం ఉంది. శింగనమల రిజర్వ్ నియోజకవర్గంలో నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జొన్నలగడ్డ పద్మావతి పనితీరు బాగాలేదని, తీసివేశారు.

ఇటీవల పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు కు టికెట్ లేదని చెప్పారు. దీనితో ఎమ్మెస్ బాబు మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి చెప్పినట్లుగానే చేశాను. నేను ఏమి తప్పు చేశానని ప్రశ్నించారు. అయినా, రిజర్వుడ్ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకు తప్పు చేసే అవకాశం ఉందా?, మీరు తప్పిస్తానంటే ఎలా అన్న జొన్నలగడ్డ పద్మావతి, కేవలం రెడ్ల ఓట్లతోనే నెగ్గలేదు. అన్ని కులాల వారు, మతాలవారు మద్దతునిస్తేనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని చెప్పారు.

గతంలో ఎమ్మెల్యే శ్రీదేవి మాదిరిగానే జొన్నలగడ్డ పద్మావతి కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అభిమానించేవారు . శ్రీదేవి ముందే కళ్ళు తెరిచి మేల్కొనగా,ఇప్పటికే ఆలస్యం అయినప్పటికీ, పద్మావతి కళ్ళు తెరిచింది. రోజుకు ఒకరిద్దరి చొప్పున ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగి పార్టీకి దూరం అవుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. ఎట్లీస్ట్ మాటల్లోనైనా మార్పు కనిపిస్తే, ఎమ్మెల్యేలకు కనీసం ఓదార్పు గానైనా ఉండేది.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం వల్ల ఆయనపై బెంగతో చనిపోయారని చెప్పి రెండేళ్ల తర్వాత వారి కుటుంబాలను పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేకపోతున్నామని, ఎందుకు ఇవ్వలేకపోతున్నామో పిలిచి ఒక్క నిమిషం మాట్లాడి, వారిని ఓదార్చలేరా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యేలకు ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే చావు కబురు చల్లగా చెప్పాలా? అంటూ ఎద్దేవా చేశారు. అరకు ఎంపీ మాధవి, పార్లమెంట్లో చక్కగా మాట్లాడేది. మంచి పనితీరును కనబరిచింది. ఆమెకు లోక్ సభ టికెట్ లేదని చెప్పారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తామని పేర్కొన్నట్లు తెలిసిందన్నారు.

తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలకు ఉయ్యాలవాడ విగ్రహ ప్రారంభోత్సవానికి అడ్డంకులు
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ కాలేజీ బయట 30 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ప్రారంభోత్సవాన్ని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు అడ్డుకున్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు కంటే ముందే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిబ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధతో స్ఫూర్తి చెందిన మెగాస్టార్ చిరంజీవి, ఆయన పాత్రలో నటించారు. రెడ్ల పౌరుషానికి ప్రతీక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అటువంటి మహానుభావుడు విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించాలనుకుంటే, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకు అడ్డుకోవడం దారుణం. పదిమంది ప్రత్యేక అతిధులతో పాటు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర రెడ్డి సంఘం ఆహ్వానించింది.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అడ్డుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పురుషులందు పుణ్య పురుషులు వేరయా… రెడ్లలో నకిలీ రెడ్లు వేరయా అంటూ ఎద్దేవా చేశారన్నారు. పడుకున్న నాగుపాములను తొక్కి వాటి చేత పగబట్టించుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల చర్యలు ఉన్నాయన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎక్కడ చూసినా వైయస్ విగ్రహాలే ఉండాలా? అంటూ ప్రశ్నించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కి మీరిచ్చే గౌరవం ఇదేనా అని చర్చ జరిగినప్పుడు, తాము కప్పుకున్న రెడ్డి తోలు తొలగనుందన్నారు.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరిని ఉద్దేశించి ఈ మాట అన్నారో తెలియదు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర గర్వించదగ్గ నాయకుడు. లేకపోతే చిరంజీవి లాంటి మహానటుడు ఆయన జీవిత గాధ ఆధారంగా సినిమా రూపొందిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై చిత్రం రూపొందించడం ఆయన కు , చిరంజీవికి, రెడ్డి సామాజిక వర్గానికి గర్వకారణమన్నారు. అటువంటి మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భగ్నపరచి, అవమానించడం దారుణం. కొందరిని అతిగా విశ్వసించిన ఒకరిద్దరు రెడ్లు నన్ను అసభ్య పద జాలం తో దారుణంగా దూషించారు. అటువంటి వెధవలపై మాత్రమే నేను గతంలో కోప్పడడం జరిగింది.

బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా వారు నకిలీరెడ్లు అయి ఉంటారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతోమంది నాకు ఆప్త మిత్రులు ఉన్నారు. రెడ్డి అంటే ఇతరుల చేత గౌరవించబడేవారు. గ్రామ పెద్దగా కొనసాగేవారు. గ్రామాభివృద్ధి కోసం తమ యావదాస్తిని త్యాగం చేసే వారు. రెడ్డి అనే టైటిల్ సమాజం వారికి ఇచ్చిన గౌరవం అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి విగ్రహ ప్రతిష్టను ఆపివేయడం దుర్మార్గం. ప్రభుత్వం తన తప్పును తెలుసుకొని వాళ్ల కుల పెద్దలను పిలిచి జరిగిన దానికి క్షమించమని కోరాలన్నారు. విగ్రహ ప్రతిష్టను ఆపాలనుకోవడం సరికాదు. కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నామకరణం చేసి తిరిగి ప్రారంభించిన మహానుభావుడైన జగన్మోహన్ రెడ్డి, ఆయన విగ్రహ ప్రారంభోత్సవాన్ని ఆపడం సమంజసం కాదని విన్నవించుకుంటున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఏ కేసులో ఎన్నెన్ని వాయిదాలు కోరారో న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లాను
జగన్మోహన్ రెడ్డి ఏ కేసులో ఎన్నెన్ని వాయిదాలను కోరారో న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లినట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నేను దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం, ఆయన కు నోటీసులు జారీ చేయడం జరిగింది. వాయిదాల మీద వాయిదాలను జగతి పబ్లికేషన్స్ కోరుతున్నట్లుగా ఈనాడు దినపత్రికలో వార్త కథనాన్ని చూశాం. లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన జగతి పబ్లికేషన్ లో జగన్మోహన్ రెడ్డి మూడు నెలల తర్వాత వ్యాపార భాగస్వామిగా చేరారు.

ప్రభుత్వం నుంచి వివిధ పనులకు, ప్రాజెక్టులకు అనుమతులు పొందిన కొందరు పెద్దలు… జగతి ఉద్భవించిందని, భవిష్యత్తులో బీభత్సమైన లాభాలు ఖాయమని పది రూపాయల విలువ చేసే షేర్ ను 350 రూపాయలకు కొనుగోలు చేసి, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులను పెట్టారు . వారు పెట్టుబడులు పెట్టిన రోజో , ఆ మరుసటి రోజో వారి ప్రాజెక్టులకు, పనులకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావటం జరిగిందని సిబిఐ తన అభియోగ పత్రంలో పేర్కొంది.

జగతి పబ్లికేషన్ కేసులో వాయిదాల మీద వాయిదాలు పొందినట్లుగా ఈనాడు దినపత్రిక తన కథనంలో రాయడం చూసాం. తనపై మోపిన కేసులలో ఇన్ని వాయిదాలు కోరడం సమంజసం కాదని నేను గతంలో మాట్లాడాను. బహుశా మరో రెండు వారాల్లో ఈ కేసుపై న్యాయస్థానం వాదనలు వినే అవకాశం ఉంది. త్వరలోనే లిస్ట్ కావచ్చు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను వేసిన కేసు జనవరి 23వ తేదీకి వాయిదా వేశారు. అదేమవుతుందో చూడాలని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

యాత్ర 2 టీజర్ పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్
యాత్ర 2 టీజర్ పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నిజాన్ని చెబితే ఎవరూ పేరడీలు చేయరు. అదే అబద్ధాన్ని చెబితే ఎన్ని రకాల పేరడీలు చేస్తారో, యాత్ర 2 టీజర్ విడుదల అయిన తర్వాత సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మిమ్స్ చూస్తే అర్థమవుతుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా యాత్ర చిత్రాన్ని రూపొందించగా, ఆయన మరణానంతరం జగన్మోహన్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా యాత్ర 2 రూపొందించినట్లు అర్థమవుతుంది. ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై అభిమానంతో యాత్ర సినిమాను ప్రేక్షకులు ఆదరించారు.

యాత్ర 2 చిత్రాన్ని ఆదరించే అవకాశాలు మాత్రం శూన్యం. యాత్ర 2 చిత్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించిన సీన్స్ ఉంటాయో? ఉండవోనని రఘురామ కృష్ణంరాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు. మధ్య నిషేధం అమలు చేయకపోతే, మళ్లీ ఎన్నికలకు రానని, మద్యం షాపులు లేకుండా చేయకపోతే మళ్లీ ఓట్లు అడగనని అన్న సీన్ ఉంటుందా?, అలాగే అధికారంలోకి వచ్చిన వారం రోజుల వ్యవధిలో సిపిఎస్ రద్దు చేస్తానన్న సీన్ ఉంటుందా??, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను… అమరావతియే రాజధాని అని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్న సీన్ ఉంటుందా?? అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నవరత్నాల మధ్య వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉండేది.

2019 ఎన్నికల నాటికి వైయస్సార్ ఫోటోతో పాటు, జగన్మోహన్ రెడ్డి ఫోటోను కూడా చేర్చారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత వైయస్సార్ ఫోటో మాయమై, జగన్మోహన్ రెడ్డి ఫోటో మాత్రమే మిగిలింది. యాత్ర 2 చిత్రంలో జగన్మోహన్ రెడ్డి ని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అన్యాయంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టినట్లుగా, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పాత్రధారి మహేష్ మంజ్రేకర్ కావాలని కేసులు వేసినట్లుగా చూపించారు. అన్యాయంగా కేసులు పెడితే, నిర్దోషిగా నిరూపించుకోవలసిన జగన్మోహన్ రెడ్డి, 381 సార్లు వాయిదాలను ఎందుకని అడగాల్సిన అవసరం వచ్చిందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత యాత్ర 3 చిత్రాన్ని మహి వి రాఘవ రూపొందిస్తారో, లేకపోతే మరెవరైన రూపొందిస్తారో చూడాలన్నారు. యాత్ర 2 టీజర్ చూడని వారు చూడాలన్న రఘురామ కృష్ణంరాజు, చిత్ర టీజర్ పై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన మీమ్స్ కూడా చూడాలన్నారు.

మీ ఇంట్లో నలుగురికి పదవులు కావాలి కానీ మాకు నాలుగు రాళ్ల జీతాన్ని పెంచరా?
అంగన్వాడి లతో చర్చించిన మంత్రి బొత్స సత్యనారాయణ దురుసుగా వారి పట్ల ప్రవర్తించడం వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ ఇంట్లో నలుగురికి పదవులు కావాలి కానీ మాకు నాలుగు రాళ్ల జీతాన్ని పెంచరా ? అంటూ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జీతాన్ని పెంచమని ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలిచి సముదాయించాలి. గతంలో ఏదో చేయాలని అనుకున్నాను… కానీ ఇప్పుడు ఇది మాత్రమే చేయగలుగుతున్నానని చెప్పి వారిని అనునయించాలి. రాష్ట్రంలోని ఒక లక్షా నాలుగు వేల మంది అంగన్వాడిలు, హెల్పర్లు రాష్ట్ర ప్రభుత్వంపై రణభేరి మోగించారు. అంగన్వాడీ లపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్మా చట్టానికి కూడా వారు కొత్త లాజిక్ ను వెతికారు. ఎస్మా చట్టాన్ని తమపై
ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే అన్ని రకాల బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీల సేవలు నిరపమానం. అంగన్వాడీలకు ఇచ్చిన హామీల విషయమై జగన్మోహన్ రెడ్డి మాట తప్పారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పరు మడమ తిప్పరని జనం అనుకోకపోయినా తనకు తాను అనుకుంటారు. అలాగే అంగన్వాడీలకు ఇచ్చిన మాట తప్పవద్దని రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Leave a Reply