-వైసీపీకి రాజకీయ సమాధి కట్టాలి
-మద్యనిషేధమని చెప్పి నాసిరకంతో రేట్లు పెంచారు
-సహజవనరులను అడ్డగోలుగా దోచుకుంది
-నారాకోడూరు బహిరంగ సభలో డాక్టర్ పెమ్మసాని
-అరాచక పాలనను అంతం చేయాలని ధూళిపాళ్ల పిలుపు
వైసీపీకి, జగన్‌కు రాజకీయ సమాధి కట్టాలని గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి నారా కోడూరులో మాట్లాడారు. ‘ఈ ప్రాంత యువత ఉద్యోగాలు కావాలని అడిగితే జగన్ ప్రభుత్వం ఒక్క పరిశ్రమ స్థాపించడం కోసం అయినా ప్రయత్నం చేసిందా? ప్రభుత్వ వ్యవస్థల్లో అత్యంత తక్కువ వేతనాలు అందుకుంటున్న అంగన్‌వాడీల కంటే తక్కువగా వాలంటీర్లకు ఈ జగన్ రూ.5 వేల జీతం ఇస్తున్నారు.
పరిపాలన చేయవయ్యా జగన్ అంటే బటన్ నొక్కుతూ కూర్చున్నారు. ఆ బటన్ నొక్కడానికి ఏ ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నా చాలు… నువ్వు ఎందుకు అయ్యా జగన్ అని ప్రశ్నించారు. మహిళల పాలిట మద్యం మహమ్మారిగా మారిందని చెబుతూ, మూడు దశల్లో అంతమొందిస్తానని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఐదేళ్లు గడుస్తున్నా అమలుచేయలేదు… మూడుసార్లు మద్యం రేట్లు పెంచుకుంటూ పోయారు. కాలువలకు నీళ్లు నింపాలన్న ప్రణాళిక కూడా తెలియని ఈ ప్రభుత్వానికి ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందా? అని ప్రశ్నించారు.
పేదలకు చెందవలసిన ఆర్థిక వనరులను అడ్డగోలుగా తవ్వి అవినీతి సొమ్ముగా ఈ ప్రభుత్వం మార్చుకుందని దుయ్యబట్టారు. ఆ అవినీతి సొమ్ముతోనే సోషల్ మీడియా ద్వారా వైసీపీ తన మైలేజ్ పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది…ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే వైసీపీని మళ్లీ గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పరిటాల రవి వంటి మంచి నాయకుడిని పొట్టన పెట్టుకున్నా తెలుగుజాతిలో ఫ్యాక్షనిజం ఉండకూడదని అనుకున్నారే తప్ప అధికారం చేతిలో ఉన్నా చంద్రబాబు నాయుడు జగన్‌ను నాశనం చేయాలని అనుకోలేదు. మనస్ఫూర్తిగా నారాకోడూరు ప్రజలు ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి, వైసీపీకి, జగన్‌కు రాజకీయ సమాధి కట్టాలని కోరుకుంటున్నాను. నేను ఏదీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదు. నాకు ఒక్క అవకాశం ఇస్తే మీ రుణం తీర్చుకుంటాను’ అని అభ్యర్థించారు.
మండే సూర్యున్ని అరచేతితో ఆపగలమా: ధూళిపాళ్ల
పొన్నూరు అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ మండే సూర్యున్ని అరచేతిలో పట్టి ఆపగలమా? పవన్ కళ్యాణ్‌ను ఇంట్లో ఉంచి ఆపగలరా? అని జగన్‌ను అడుగుతున్నాను. అభివృద్ధి రూపంలో తాను, నరేంద్ర కలిసి ఓటర్ల రుణం తీర్చుకుంటాం. కిలారు రోశయ్య ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు? ఆయన ఐదేళ్లు నియోజకవర్గానికి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని హితవుపలికారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన అంతమై అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని, వ్యవసాయం, తాగు, సాగునీటి సరఫరా, రైతాంగం పరంగా ఈ ఐదేళ్లలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నామన్నారు. నీళ్లు లేకపోవడం వల్ల తెల్ల జొన్న సాగు, దిగుబడి పడిపోయిందన్నారు.
వ్యవసాయం, నీటి సరఫరా గురించి అవగాహన లేని మంత్రులకు ఉన్న ఒకే ఒక పని బూతులు తిట్టడమేనని విమర్శించారు. రైతులకు జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క ప్రోత్సాహం అందలేదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక సౌలభ్యాలు కల్పించిందని తెలిపారు. ఈ ప్రచారంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టీడీపీ మంచాల గ్రామ పార్టీ అధ్యక్షుడు గూడపాటి శ్రీనివాసరావు, జనసేన పార్టీ చేబ్రోలు మండలం అధ్యక్షుడు చందు శ్రీరాములు, పొన్నూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు పున్నారావు, చేబ్రోలు మండల టీడీపీ అధ్యక్షుడు వెంకట రామరాజు పాల్గొన్నారు.