Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు

-ప్రజాతీర్పును గౌరవిస్తాం. 5 ఏళ్లూ పాలిస్తాం
-గడువును పూర్తిగా వినియోగించుకుంటాం
-చివరి రోజు వరకు సేవ చేస్తాం. అదే మా విధానం
-సీఎంకి పాజిటివ్‌ ఓటింగ్‌పై అంతులేని విశ్వాసం
-చేసేదే చెబుతున్నాం. చెప్పిందే చేస్తున్నాం
-అందుకే వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి..
-ప్రతి చోటా మమ్మల్ని విశేషంగా ఆదరిస్తున్నారు
-సీఎంగారి ఢిల్లీ పర్యటనలపై ప్రతిదీ వెల్లడిస్తున్నాం
-ఆయన పర్యటనల ఫలితాలూ స్వయంగా చూస్తున్నాం
-కేంద్రం నుంచి రావాల్సివన్నీ ఆయన అడుగుతున్నారు
-అయినా ఏవేవో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు
-మీడియాతో తాడేపల్లిలోని క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన వైయస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి

ముందస్తు అనేదే లేదు:
రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించినంత వరకు చాలా స్పష్టత ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తు అన్న ఆలోచన లేదు. మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. మాకు పూర్తి సమయం కావాలి. చివరి రోజు వరకు సేవ చేస్తాం. పని చేస్తాం. పూర్తి గడువును వినియోగించుకుంటాం. ప్రజలు అర్ధం చేసుకునేలా మేము చేసిన పనులు వివరిస్తాం. అప్పుడే ఎన్నికలకు వెళ్తాం. ఇదే విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పాం. మళ్లీ చెబుతున్నాం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదు.

వారికి గెలుపుపై నమ్మకం లేదు:
ఎవరైతే ఈ టైమ్‌ దాటిపోతే కష్టం అనుకుంటారో.. లేక ప్రత్యర్థులు పుంజుకోక ముందే ఎలాగోలా ఎన్నికల్లో గెలవాలనుకునే వారే ముందస్తుకు వెళ్తారు. గతంలో చంద్రబాబు అలిపిరి ఘటన తర్వాత సానుభూతితో గెలవాలని ప్రయత్నించారు.

చిత్రం ఏమిటంటే.. మీ అంతట మీరే.. ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారు. ఆ సెక్షన్‌ ఆఫ్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అలా వాళ్లు సర్దుకోవడానికా? లేదా కేడర్‌లో ఊపు తీసుకు రావడమా? లేక అలా ప్రచారం చేసి పవన్‌కళ్యాణ్‌ను పూర్తిగా తన జట్టు లోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారా?

లేదా లేనిపోని హడావిడి చేసి, కేడర్‌ను మోటివేట్‌ చేయాలని ఆయన చూస్తున్నారా? లేదా సీట్ల కోసం ఎవరూ రాకపోతే, అభ్యర్థులను ఆకర్షించే ప్రయత్నమా? ఇవన్నీ చేస్తూ ఆ విధంగా జగన్‌గారిని ఎదుర్కోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారా? అనిపిస్తుంది.

ఎన్నికలకు వచ్చే ఏడాది మే వరకు సమయం ఉంది. కాబట్టి చంద్రబాబుకు కూడా కావాల్సిన సమయం దొరుకుతుంది. ఆయన తన పొత్తుల ప్రయత్నాలు చేసుకోవచ్చు. మాకు ముందస్తుకు వెళ్లే ఆలోచన ఏ మాత్రం లేదు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
పర్యటనల ఫలితాలు కనిపిస్తున్నా..:
జగన్‌గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా ఏం చేస్తున్నారనేది చెబుతున్నాం. ఆ ఫలితాలు కూడా చూపిస్తున్నాం. గతంతో పోలిస్తే, మేమేం చేస్తున్నామనేది చెబుతున్నాం.
2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి చీకట్లో ఏదో చేసి వచ్చే వారు. లేదా ఏవో ఒప్పందాల కోసం వెళ్లేవాడేమో.
కానీ సీఎం వైయస్‌ జగన్, ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా, ఎవరిని కలిసినా చాలా స్పష్టతతో ఉంటున్నారు. రాష్ట్రానికి కావాల్సినవన్నీ అడుగుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సినవి అడుగుతున్నారు. మీకు ఆ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి.
జగన్‌గారు వెళ్లి మాట్లాడి వచ్చిన తర్వాత మంత్రులు, అధికారులు ఫాలోఅప్‌ చేస్తున్నారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాలు దక్కుతున్నాయి. సీఎం ఎప్పుడు ఢిల్లీ వెళ్లి, ప్రధానితో ముఖాముఖి ఏకాంతంగా కలిసినా, మాట్లాడినా సరే.. వారు సీట్ల కింద నక్కినట్లు.. అన్నీ విన్నట్లు రాస్తారు. ఏవేవో ఊహించుకుంటారు. దాన్నే రాస్తారు.

మాకు పాజిటివ్‌ ఓటింగ్‌పై నమ్మకం:
ఏ సర్వే అయినా వాస్తవాలను ప్రతిబింబిస్తుంది. ఇటీవల జాతీయ ఛానల్‌ సర్వే కూడా అదే తేల్చింది. మీరు గమనిస్తే.. అధికారంలో ఉన్న పార్టీ ఇంత కంటిన్యూగా.. గడప గడపకూ మన ప్రభుత్వం.. స్పందన.. జగనన్నకు చెబుతాం.. సురక్ష.. వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి చోటా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. అవి సక్సెస్‌ అవుతున్నాయంటే.. ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న వి«శ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

అలాగే మా నాయకులు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నారంటే, వారిపై తమ ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని చాటుతున్నారు. చేసేదే చెబుతున్నాం. చెప్పిందే చేస్తున్నాం. కాబట్టే ధైర్యంగా ప్రజలోకి వెళ్తున్నాం. మాకు పాజిటివ్‌ ఓటింగ్‌పై నమ్మకం ఉంది. సీఎంగారిలో కూడా చాలా క్లియర్‌గా పాజిటివ్‌ ఓటింగ్‌ను కోరుకుంటున్నారు. అందుకే ప్రజల మనస్సు మళ్లీ గెల్చి, ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నారు.

ఆ నిబంధన కొత్తది కాదు:
అమరావతిలో పేదల ఇళ్లకు కేంద్రం నిధులపై షరతు కొత్తది కాదు. అది గతంలో కూడా ఉంది. అందుకే మా వాటా నిధులు ఖర్చు చేస్తాం. అయితే వారికి వచ్చిన అభ్యంతరం ఏమిటో అర్ధం కావడం లేదు. అక్కడ పేదలకు ఇళ్లు రాకూడదని కోరుకుంటున్న.. చిన్న మైనారిటీ, సంపన్న, కులీన, ఫ్యూడల్‌ వర్గాలు మాత్రమే దానికి వ్యతిరేకంగా ఉన్నారు. అది మీడియా అని చెప్పుకుంటున్న వారు పూర్తిగా ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు. రామోజీరావు, రాధాకృష్ణ ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తున్నారో స్పష్టం అవుతోంది. అదే ఆ పత్రికలు, టీవీల్లో కనిపిస్తోంది.

వారి ఆక్రోషం. కడుపు మంట:
చంద్రబాబు ఏ స్థాయికి దిగజారాడన్నది దీంతో మళ్లీ రుజువైంది. కొందరి ప్రయోజనాల కోసం పేదల పొట్ట కట్టాలని ఆయన ఎలా చూస్తున్నాడో అర్ధం అవుతోంది. పేదలకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అంటే.. ఆ పేపర్లలో బ్యానర్లు పెట్టి రాస్తున్నారో చూస్తుంటే వారి ఆక్రోషం, కడుపు మంటను బయట పెడుతుంది.

అందుకే వారి కుట్రలు:
అమరావతిలో పేదలకు ఇళ్లు నిర్మించవద్దని ఎవరూ చెప్పలేదు. ఆ హక్కు, అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎక్కడైనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంటే, కోర్టులు స్పందిస్తాయి. కానీ పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వొద్దని కోర్టులు కూడా ఎలా చెబుతాయి? ఎక్కడా నిబంధనల అతిక్రమణ లేదు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వొచ్చన నియమం కూడా ఉంది. స్థలం ఇవ్వడంతో పాటు, ప్రభుత్వం కూడా ఇళ్లు కట్టించి ఇస్తుంది. కేంద్రం ఏం చెప్పింది. కోర్టు వివాదాలు ముగిశాకే.. తమ వాటా ఇస్తామని చెప్పింది. అంతేకానీ ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదు. కేవలం జగన్‌కి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విపక్షం ఇలా కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది.

అది ఆమె నిర్ణయం:
షర్మిలమ్మ తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేశారు. కాబట్టి తనే నిర్ణయం తీసుకుంటారు. షర్మిల ఇప్పుడు వ్యక్తి కారు. ఆమె ఒక పార్టీ అధ్యక్షురాలు. కాబట్టి తాను ఏ నిర్ణయం తీసుకుంటారనేది తన ఇష్టం.

మా ప్రమేయం ఏమిటి!:
రాష్ట్ర బీజేపీ అ«ధ్యక్ష పదవి మా పార్టీ ప్రమేయం ఉందని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అనేది ఒక పెద్ద పార్టీ. అది వారి నిర్ణయం. మాకు సంబంధించినంత వరకు అది ఆ పార్టీ వ్యవహారం. మాకు ఎలాంటి సంబంధం ఉండదు. మేము ఎప్పుడూ ఆ కోణంలో ఆలోచించబోము. ఆ పని చంద్రబాబు చేస్తారు. ఏవేవో లెక్కలు వేసుకుని రాజకీయాలు చేస్తారు. మాకు సంబంధించినంత వరకు ప్రతి విషయంలో స్పష్టత ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక పూర్తిగా ఆ పార్టీ వ్యవహారం.

LEAVE A RESPONSE