– ఫిబ్రవరి 1 నుండి అమల్లోకి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు
– భూ కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు
– త్వరలో తల్లికి వందనంతోపాటు మిగిలిన హామీలు అమలుచేస్తాం
– నైరాశ్యంలో ఉన్న ప్రజలందరిలో ఆశాభావాన్ని నింపిన యువగళం
– దావోస్ పర్యటన ద్వారా రాష్ర్టంలో 20 లక్షలకు మించి ఉద్యోగాలు
– మీడియాతో రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్
అమరావతి: ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, దీనికి సంబంధించి ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేశామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అయితే రాజధాని గ్రామాల్లో మాత్రం రిజిస్ర్టేషన్ విలువల్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు. రాష్ర్టంలో గ్రోత్ సెంటర్లుగా ఉండి, మార్కెట్ విలువ 10 రెట్లు అదనంగా ఉన్న ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్ విలువలు పెరుగుతాయని చెప్పారు.
కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు అక్కడి మార్కెట్ విలువల కన్నా ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంతాల్లో విలువలు తగ్గుతాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మార్వోలను అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున భూ అక్రమణలకు పాల్పడ్డారని, అలా పేదల భూములను అక్రమ పద్దతుల్లో వశం చేసుకున్న వారందరనీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. నేరం రుజువైన అధికారులపైన కఠిన చర్యలు కచ్చితంగా తీసుకుంటామని చెప్పారు. భూ వివాదాలకు సంబంధించి సమగ్రంగా అధ్యయనం చేసేందుకు 22ఎ భూములు, 596 జీవోలతోపాటు మరో నాలుగు అంశాలపై కలెక్టర్లతో కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు.
సోమవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో తననకు కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గత ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా సరిగ్గా రెండేళ్ల క్రితం ఈ రోజున ప్రారంభించిన యువగళం పాదయాత్ర ప్రభంజనంలా సాగిందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. అనాటి సర్కార్ ఎన్ని ఆటంకాలు కల్గించినప్పటికీ, అడ్డుకునేందుకు కుట్రలు పన్నినప్పటికీ ప్రజాబలంతో ముందుకు సాగి ఆ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారని చెప్పారు.
యువగళం ప్రభావంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నాయకులతో సమన్వయం చేసుకుంటూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. సీఎం చంద్రబాబు, మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ ఉపాధి కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నారని చెప్పారు.
ఇందుకు దావోస్ పర్యటనే సాక్ష్యమన్నారు. గత ఐదేళ్ల పాలన కారణంగా రాష్ర్టానికి పారిశ్రామికవేత్తలు రావాలంటనే భయపడిపోయారని, అలాంటిది కూటమి ప్రభుత్వ చేస్తున్న కృషి కారణంగా రాష్ర్టానికి తిరిగి పెట్టుబడులు వస్తున్నాయని, గత ఏడు నెలల కాలంలోనే ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని అన్నారు.
దావోస్ పర్యటన ద్వారా సిఎం చంద్రబాబు, నారా లోకేష్ ప్రపంచ పారిశ్రామికవేత్తలతో భేటి అయ్యి రాష్ర్టానికి ఉన్న అవకాశాలను వివరించి బ్రాండ్ ఏపీని పున:ప్రతిష్టించారని చెప్పారు. 20 లక్షల మంది యువకులకు ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ ప్రస్తుతం వస్తున్న పెట్టుబడుల ప్రవాహం చూస్తుంటే అంతకుమించి ఉపాధి కల్పన జరిగే అవకాశముందన్నారు.
కూటమి ప్రభుత్వం వరుసగా ప్రజలకిచ్చిన హామీలన్నింటీనీ అమలు చేస్తోందని, అటు సంక్షేమం విషయంలోనూ వెనక్కితగ్గడం లేదన్నారు. త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని, కేంద్ర ప్రభుత్వం తదుపరి తమ వాటాను విడుదల చేయగానే రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ప్రారంభిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.