Suryaa.co.in

Political News

ఇది దారి తప్పిన వ్యవస్థ… జనం కోరి తెచ్చుకున్న అవస్థ

మనం సాధారణంగా ప్రభుత్వం అని…ఏ యంత్రాంగాన్ని అంటామో…ఆ ప్రభుత్వంలో స్థూలంగా రెండు రకాల పాత్రధారులు ఉంటారు. మొదటి వారు ఎన్నికలలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు,మరీ ముఖ్యంగా మంత్రివర్గ సభ్యులు. రెండవ రకం పోటీ పరీక్షల ద్వారా ఎన్నిక చేయబడిన ఉద్యోగులు.

మన రాజ్యాంగం ప్రకారం కేంద్ర- రాష్ట్ర స్థాయిలో ప్రజలచే ఎన్నుకోబడి ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రిచే మంత్రులుగా నియమించబడిన వారు వారికి కేటాయించిన శాఖను ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో నడుపుతారు. అందుకే ప్రతి శాఖకు ఒక మంత్రి ఉంటారు. ఆ శాఖ కార్యక్రమాల నిర్వహణకు కింది నుంచి పై వరకు కొన్ని వేల మంది ఉద్యోగులు ఉంటారు.

మంత్రి పదవి అశాశ్వతం. మన దేశ చరిత్రలో ఒకరోజు మంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా చేసిన రబ్రీ దేవి లాంటి వాళ్ళు ఉన్నారు. నెల రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు.
మొదటిసారి 13 రోజులు,రెండవసారి 13 నెలలు ప్రధాన మంత్రిగా పనిచేసిన వాజ్ పాయ్ లాంటి వారు ఉన్నారు.

1989లో వీపీ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు.
1990లో చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయ్యారు.1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు….అంటే… మూడు సంవత్సరాలలో ముగ్గురు ప్రధాన మంత్రులు మారారు.
1996లో వాజ్పేయి 13 రోజులు ప్రధానమంత్రిగా చేసిన తర్వాత 1996 లోనే దేవగౌడ ప్రధానమంత్రి అయ్యారు.
1997లో ఐకే గుజ్రాల్ ప్రధాన మంత్రి అయ్యాడు.
1998లో మళ్లీ 1999లో వాజ్ పాయ్ ప్రధానమంత్రి అయ్యారు.
ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో….రెండున్నర సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేకమంది మంత్రులను తొలగించారు.

ఒక వాక్యంలో చెప్పాలంటే….ఎన్నికల ద్వారా పదవుల్లోకి వచ్చే రాజకీయ పదవులు శాశ్వతం కాదు. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాల కాలపరిమితి ఉన్నప్పటికీ,అస్థిర రాజకీయాల కారణంగా…మంత్రులు… ముఖ్య మంత్రులు…ఏ రోజైనా వాళ్ల పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చు
బ్యూరోక్రసీలో మంత్రులను టెంపరరీ ఎగ్జిక్యూటివ్ అంటారు.

మరి అద్దాంతరంగా….మంత్రులు,ప్రధాన మంత్రులు రాజీనామా చేసినప్పుడు…పరిపాలన నిర్వహించేది,ప్రభుత్వ ఉద్యోగులే. వివిధ శాఖల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు…వివిధ రకాల విద్యార్హతలతో పోటీ పరీక్షలు రాసి,ప్రతిభ ఆధారంగా ఉద్యోగంలో ప్రవేశిస్తారు.

ఒకసారి ఉద్యోగంలో ప్రవేశించిన ప్రభుత్వ ఉద్యోగి,60 సంవత్సరాలు లేదా 62 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు…పదవీ విరమణ వయసు వచ్చేంతవరకు ఉద్యోగంలో ఉంటాడు.
ఎమ్మెల్యేపదవి శాశ్వతం కాదు
మంత్రి పదవి శాశ్వతం కాదు
ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు
ప్రధానమంత్రి పదవి శాశ్వతం కాదు
రాష్ట్రపతి పదవి శాశ్వతం కాదు.

కానీ ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ ఉద్యోగం కూడా….ఒక జీవితకాలం ఉంటుంది. చాలామంది ఉద్యోగులు దాదాపు 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగంలో గడుపుతారు.

బ్యూరోక్రసీలో ప్రభుత్వ ఉద్యోగులను పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఆధునిక ప్రపంచం ఈరోజు అనుసరిస్తున్న బ్యూరోక్రసీ వ్యవస్థలో….ఏడు ప్రధాన లక్షణాలు ఉంటాయి.
అందులో అత్యంత ప్రధానమైనది…న్యూట్రాలిటీ(తటస్థ విధానము)
మంత్రులు/ముఖ్యమంత్రి/ప్రధాన మంత్రులు—-వస్తారు / పోతారు.
కానీ ప్రభుత్వ ఉద్యోగి….శాశ్వతం.
అలాంటి ప్రభుత్వ ఉద్యోగి…తన విధి నిర్వహణలో రాజకీయాలకు అతీతంగా…
నిష్పక్షపాతంగా విధానాలను అమలు చేయాలి.

ఉద్యోగ నిర్వహణలో వ్యక్తిగత రాజకీయ ఇష్టా-ఇష్టా లకు అతీతంగా పనిచేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పని చేసిన అధికారులే, వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లో పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పని చేసిన అధికారులే, ఇప్పుడు జగన్ ప్రభుత్వం లో పనిచేస్తున్నారు.

ప్రభుత్వాలు మారినప్పుడుకేవలం మంత్రివర్గం మాత్రమే మారుతుంది. ఉద్యోగుల తో కూడిన మిగతా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పాతదే కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు రాగద్వేషాలకు అతీతంగా/రాజకీయ పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా/తటస్థ వైఖరితో/నిష్పక్షపాతంగా పనిచేయాలి.

కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిపాలన జరుగుతున్న విధానం చూస్తే…………రాజ్యాంగాన్ని పక్కనపెట్టి…. బాహుబలిలో శివగామి చెప్పినట్టు….ఇది నా మాట…నా మాటే శాసనం.
అనే రాచరిక పరిపాలన కనిపిస్తుంది.
వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు/మరీ ముఖ్యంగా పోలీసు శాఖ ఉన్నతాధికారులు
పనిచేస్తున్న తీరు చూస్తుంటే…. ప్రభుత్వ ఉద్యోగుల్లా కాకుండా…. అధికార పార్టీ నాయకుల్లా పనిచేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి…సిఐడి అధికారులు/ప్రభుత్వ న్యాయవాదులు మీడియా సమావేశాలు నిర్వహించి రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వడం చూసిన తర్వాత…. నాలాంటి వాళ్లకు గుండె మండిపోతుంది.
ఇది దారి తప్పిన వ్యవస్థ. జనం కోరి తెచ్చుకున్న అవస్థ.
ఈ పరిస్థితులను మార్చాలంటే…. ముందు జనం/మనం మారాలి.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE