Suryaa.co.in

Political News

ఇది డెమోక్రసీ కాదు .. కామిడోక్రసీ….!

మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన టికెట్ పై శాసన సభకు ఎన్నికైన వారిలో ఓ ముప్ఫయ్ మందిని చీల్చి, ‘రాజ్యాంగ బద్ధం ‘ గా రూపు దాల్చిన ప్రజాస్వామిక పాలక వర్గాన్ని అధికారం నుంచి తప్పించి…., మహారాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ ను ఈ అప్రజాస్వామిక గ్యాంగ్ కు అప్పగించారు. వీరితో బీజేపీ చేతులు కలిపింది . కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న వారు దీనిని ఆశీర్వదించారు. ఈ అక్రమం 2021 లో చోటు చేసుకున్నది.

మన సువిశాల దేశం లో ఎన్నికలు – స్వేచ్చా నిర్వహణ – రాజకీయ పార్టీలు – వాటి నడవడికను పర్యవేక్షించడానికి , నిర్దేశించడానికి సమస్త అధికారాల తో కూడిన ఒక సర్వ స్వతంత్ర ఎన్నికల సంఘాన్ని రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల సంఘమే…. ఈ ఫిరాయింపు దారులదే అసలైన శివసేన అన్నది. ఎన్నికల గుర్తు దానికే ఇస్తున్నాం అన్నది . శివసేన బ్యాంకు ఖాతాలు దానికే చెందుతాయి అని తీర్పు చెప్పింది . అసలు శివసేన వారు సుప్రీం కోర్టుకు పరిగెత్తారు.

పార్టీ ఫిరాయించిన వారందరినీ రాజ్యాంగం పదో షెడ్యూల్ కింద శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని శివసేన శాసనసభా పక్ష నాయకుడు – మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కు 2021 లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఇప్పటికి రెండేళ్లు అయింది. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. సుప్రీమ్ కోర్టు కు కోపం వచ్చింది. స్పీకర్ ను మందలించినంత పని చేసింది. స్పీకర్ పట్టించు కోలేదు.

వచ్చే ఏడాది మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటి దాకా సాగదీసి, ఫిరాయింపుదారులు పూర్తిగా అధికారం అనుభవించేలా చేసి,ఎన్నికల నోటిఫికేషన్ ముందు నిర్ణయం ప్రకటించాలని స్పీకర్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ డ్రామా మొత్తానికి కేంద్ర పాలకుల ఆశీస్సులు సంపూర్ణం గా ఉన్నాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఔన్నత్యం గురించి …..చక్కని హావ భావ ప్రదర్శనతో మన ప్రధాన మంత్రి అసువుగా చెబుతుంటే….. వినేవారికి ఆనందం తో వళ్ళు పులకరించి పోతూ ఉంటుంది .

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన వారిని 2018 లో మెజారిటీ స్థానాలలో అక్కడి ప్రజలు ఎన్నుకున్నారు . దానితో , అక్కడ రాజ్యాంగబద్దం గా కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లో ప్రభుత్వాధికారం చేపట్టింది . రెండేళ్లు తిరిగీ తిరగక ముందే బీజేపీ కి అవసరమైనంత మంది ఎం ఎల్ ఏ లు బీజేపీ లోకి ఫిరాయించారు . వారి చేత అసెంబ్లీ కి రాజీనామా చేయించి. , ప్రభుత్వ పాలనాధికారాన్ని కాంగ్రెస్ నుంచి గుంజేసుకున్నారు . ఫిరాయింపుదారులకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చి , వారిని గెలిపించి , పాలనాధికారాన్ని చేజిక్కించుకున్నారు . రాజ్యాంగం వారిని ఏమీ అనలేదు.

కర్ణాటక లోనూ సే(షే)మ్ టు సే(షే)మ్ స్టోరీ . కాంగ్రెస్ , జేడీ (ఎస్) శాసనసభ్యులను రాత్రికి రాత్రి దొంగిలించేశారు . ముంబై కొట్టుకుపోయారు . వారికి పోలీసులను కాపలా పెట్టారు . చివరకు కర్ణాటక లో ప్రభుత్వ పాలనాధికారాన్ని ఒక బొమ్మ(య్) కు అప్పగించారు . రాజ్యాంగం …కుయ్ …అంటే ఒట్టు .

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభకు 2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 102 స్థానాలు గెలుచుకుంది. మొత్తం 175 స్థానాల్లో 88 వస్తే,ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. టీడీపీ కి 88 కి మరో 14 స్థానాలు అదనం గా వచ్చాయి. అంటే – 102 స్థానాలు వచ్చాయి.

అయినా ; వైసీపీ టికెట్ మీద గెలిచిన ఓ 23 మంది శాసన సభ్యులు తెలుగుదేశం లోకి ఫిరాయించారు. ఫిరాయించిన వారెవరూ వైసీపీ కి రాజీనామా చేసి, టీడీపీ టికెట్ పై శాసనసభకు తిరిగి ఎన్నికవ్వలేదు. ఆ కండువా అవతల పారేసి, ఈ కండువా కప్పుకున్నారు. తెల్లవారేసరికి తెలుగుదేశం లో చేరారు. అందులో ముగ్గురు నలుగురు మంత్రులు కూడా అయ్యారు. వీరందరి మీదా అనర్హత వేటు వేయాలని వైసీపీ శాసన సభా పక్షం…. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఏమైందో తెలియదు. అయినా ; మన ప్రజాస్వామ్యం వారిని ఏమీ అనలేదు. రాజ్యాంగం కూడా…. !

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత శాసన సభలో వైసీపీ కి 151 మంది శాసన సభ్యులు ఉన్నారు . మెజారిటీ కి అవసరమైన వారి కంటే ఓ 63 మంది అదనం గా ఉన్నారు , చేతులు పైకి ఎత్తడానికి . అయినా టీడీపీ కి చెందిన ముగ్గురు శాసన సభ్యులు వైసీపీ లోకి ఫిరాయించారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని టీడీపీ శాసన సభా పక్షం… స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. శాసన సభ కాలపరిమితి ముగుస్తున్నప్పటికీ, గౌరవ స్పీకర్ ఆ ఫిర్యాదు ను పట్టించుకోలేదు.

రాజ్యాంగం అంటే మన స్పీకర్ కు చాలా గౌరవం. అది ఏమీ అనదని ఆయనకు తెలుసు. మహారాష్ట్ర , తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ లో, ఒక పార్టీ టికెట్ పై గెలిచిన సభ్యుడు, తన సభ్యత్వానికి రాజీనామా చెయ్యకుండానే…. మరో పార్టీ లోకి జంప్ అయితే ; “ఇలా ఎందుకు చేసావ్? మేము మిమ్ముల్ని
గెలిపించింది…. వేరే పార్టీ లోకి ఫిరాయించడానికా?” అని అడిగే హక్కు – గెలిపించిన ఓటర్లకు లేదు. ఎందుకంటె , రాజ్యాంగానికి లేని ఇబ్బంది ఓటర్ కు ఎందుకు ?అన్నది పాయింట్ .

మన ఓటర్లకు ఓట్ వేయడం ఒక్కటే డ్యూటీ. అది మినహా ఏ హక్కునూ మన రాజ్యాంగం లోని అధికరణలను రాసిన వాళ్లెవరూ ఇవ్వలేదు. తాము ఓటస్తే గెలిచి, చట్ట సభల్లో అడుగుపెట్టిన వారు ఎటువంటి వారు అయినా వారిని అడిగే హక్కు ఓటర్లకు లేదు.

ఒక్క జైలు శిక్షలు పడిన వారు తప్ప , ఎవరైనా చట్ట సభల్లో ప్రవేశించి; ప్రభుత్వ యంత్రాంగాన్ని పాదాక్రాంతం చేసుకోవచ్చు . జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారూ దర్జాగా చట్ట సభల్లో అడుగు పెట్టవచ్చు .ప్రభుత్వ యంత్రాంగం చేత సమస్త దగుల్బాజీ పనులూ చేయించుకోవచ్చు . “మేము మిమ్ముల్ని ఒక పార్టీ టికెట్ పై గెలిపిస్తే….. పార్టీ ఎందుకు మారారు?” అని అడిగే హక్కు ఓటర్లకు లేదు.

” ఏడాదికి పాతిక, ముప్పై రోజులే అసెంబ్లీ సమావేశాలు నడిపితే ; మిగిలిన మూడొందల పాతిక రోజులు వీళ్ళు ఏం చేస్తున్నారు? “అని తెలుసుకునే హక్కు ఓటర్లకు లేదు. ఒక్కసారి ఓటేస్తే ; మళ్లీ ఎన్నికల నాటి వరకూ ఓటర్లను పురుగుల్లా చూసినా మన ప్రజాస్వామ్యం గానీ, రాజ్యాంగం గానీ పట్టించుకోవు. ఎన్నికైన వారు…. ప్రతి ఏడాది వారి ఆదాయ వ్యయాలను తమను ఎన్నుకున్న వారికి చెప్పాలనే కట్టుబాటు ఏమీ లేదు.

ప్రజా ప్రతినిధులుగా చట్ట సభలలో ఆశీనులు కావడానికి ఎటువంటి నేర చరితుల కైనా మన రాజ్యాంగానికి అభ్యంతరం లేదు. హంతకులు, మాన భంగాలే. వృత్తిగా బతికే వారు ,దొంగలు, కబ్జా కోరులు, ఫోర్జరీ స్పెషలిష్టులు, దొమ్మీల్లో పేరెన్నిక గన్న వారు, రౌడీ షీటర్లు, వివాహేతర లైంగిక సంబంధాలలో మునిగి తేలేవారు…. ప్రజలకు చెందాల్సిన ప్రకృతి వనరుల దోపిడీ దారులు …….;ఒక నేరం అనేముంది…..; భారత శిక్షస్మృతి లో శిక్షలు వేయడానికి తగిన ఎన్ని నేరాలు ఉన్నాయో…. ఆ నేరాలకు పాల్పడే వారు ఎవరైనా సరే ; చట్ట సభల్లో ప్రవేశించడానికి మన ప్రజాస్వామ్యం గానీ, రాజ్యాంగం గానీ అస్సలు అడ్డు చెప్పవు.

మన చట్ట సభల్లో – అధికార పక్షము, ప్రతిపక్షము అని సభ్యులు రెండు రకాలు. సభలో మెజారిటీ సభ్యుల గ్రూపు అధికార పక్షం అవుతుంది. మెజారిటీ లేని గ్రూపు – ప్రతిపక్షం అవుతుంది. అంటే – ఒక చట్ట సభలో మొత్తం 100 స్థానాలు ఉన్నాయి అని అనుకుంటే….; 51 స్థానాలు కలిగిన గ్రూపును అధికార పక్షం అని ; 49 స్థానాలు కలిగిన గ్రూపును ప్రతిపక్షం అంటాము. రెండు గ్రూపుల లోని వారికీ జీత భత్యాలు, ఇతర ప్రభుత్వ పరమైన సౌకర్యాలు, రాయితీలు, వసతులు సమానమే. అయితే, ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రం మెజారిటీ గ్రూపు పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. మొత్తం ప్రభుత్వ యంత్రాంగం…. మెజారిటీ గ్రూపు కనుసన్నల లోకి వెళ్ళిపోతుంది.

నిజానికి, మెజారిటీ గ్రూప్ సభ్యులు ఎలా గెలిచారో…., మైనారిటీ గ్రూపు సభ్యులూ అలాగే గెలిచారు. వారు కోట్లు కుమ్మరించి గెలిచినట్టే….. వీరూ కోట్లు గుమ్మరించి గెలిచారు. వారూ సారా బ్రాందీ పోసి గెలిచినట్టే…. వీరూ గెలిచారు. వారు ఉత్తుత్తి వాగ్దానాలు చేసి గెలిచినట్టే…. వీరూ ఉత్తుత్తి వాగ్దానాలు చేసి గెలిచారు. గెలవడానికి వారు ఎన్ని అక్రమ పద్ధతులకు పాల్పడ్డారో…. వీరూ అన్ని అక్రమ పద్ధతులకు పాల్పడ్డారు. కాకపోతే , ఒక గ్రూపుకు ఎక్కువ స్థానాలు వస్తాయి. ఒక గ్రూపుకు తక్కువ స్థానాలు వస్తాయి.

అయితే ; మెజారిటీ కంటే ఒక్క స్థానం తక్కువ వచ్చినా ; ఆ గ్రూప్ కు దమ్మిడీ పని ని గానీ, ప్రభుత్వ నిర్వహణ లో కనీస గుర్తింపును గానీ మన రాజ్యాంగం ఇవ్వలేదు. మెజారిటీ గ్రూపు పాద సేవ కు అంకితమై పోయే ప్రభుత్వ యంత్రాంగం….; అసలు ఈ గ్రూప్ లో వారిని కనీసం ప్రజా ప్రతినిధులుగా కూడా గుర్తించదు.

అమెరికా , ఇంగ్లండ్ వంటి పాశ్చాత్య (పాశ్చాత్య అంటే… మన దేశానికి పశ్చిమ వైపు ఉన్న అని అర్ధం ) దేశాల లోనూ ప్రతి ప్రజాస్వామ్య వ్యవస్థలే ఉన్నాయి. కానీ, అక్కడ ప్రభుత్వ పక్షానికి ఎంత విలువ బాధ్యత ఉంటుందో…. ప్రతిపక్షానికీ అంత విలువ, బాధ్యత ఉంటాయి.

అమెరికా లో అధ్యక్షుడుగా డెమోక్రటిక్ పార్టీ కి చెందిన జో బైడెన్ ఉన్నారు. కానీ, రిపబ్లికన్ పార్టీ సహకారం లేకుండా ఆయన ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేరు. ఇంగ్లండ్ లో అయితే, అధికార పక్షం లాగానే, ప్రతి పక్షమూ ఒక ‘ షాడో ‘ కేబినెట్ ను అధికారికం గా ఏర్పాటు చేస్తుంది. అంటే…., అధికార పక్షం ఏ మంత్రి పదవులకు తమ సభ్యులను నియమించుకుంటే….; ఆ పదవులకు ప్రతిపక్షం కూడా తమ సభ్యులను నియమించుకుంటుంది. వీరిని షాడో మినిస్టర్స్ అంటారు. అంటే , హోమ్ మంత్రి కి ఒక షాడో హోమ్ మంత్రి , విద్యా శాఖ మంత్రికి ఒక షాడో విద్యాశాఖామంత్రి – ఇలా అన్న మాట . ఆయా శాఖల అధికారులు తమ తమ మంత్రులకు రిపోర్ట్ చేసినట్టు గానే ; షాడో మంత్రులకూ రిపోర్ట్ చేయాలి. ఈ షాడో వ్యవస్థ వ్యయాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

ఇక్కడ మనకు…. ప్రతిపక్షం అంటే……!?
అధికార పక్షం వెనకాల తిరిగే వాళ్లకు కూడా లోకువే. ఒక ఎస్ .ఐ కూడా కేర్ చెయ్యడు . “వారూ మీ లాగే అబద్దాలు ఆడి, దొంగోట్లు వేయించుకుని, డబ్బు -సారా పోసి, ఉత్తుత్తి హామీలు ఇచ్చి గెలిచిన వారే కదా! వాళ్ళనూ కలుపుకు వెళ్లి…., ఇద్దరూ చెరో అర్ధ రూపాయి తినండి..” అని మన రాజ్యాంగం ఎందుకు చెప్పలేదో తెలియదు.

అయినా సరే మనది ప్రజాస్వామ్యం. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఏ విలువలూ లేని పాలనా తీరు తెన్నుల ప్రజాస్వామ్యం . ఏ బాధ్యతా, జవాబుదారీ తనం లేని పాలక పార్టీల ప్రజాస్వామ్యం . చూస్తుంటే…. “ఇది డెమోక్రసీ కాదు….. “కామెడోక్రసీ” అని మన (వి )నాయకులు తమ చర్యలకు ద్వారా మనకు గుర్తు చేస్తున్నారు. మన డెమోక్రసీ అటువంటిది కాబట్టే -ఇటువంటి వారు మన పాలకులయ్యారు . పాపం వాళ్ళ తప్పేముంది !?

భోగాది వేంకట రాయుడు
medhomadhanam@gmail.com

 

LEAVE A RESPONSE