Suryaa.co.in

Telangana

బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల చీకటి ఒప్పందం ఇదే

– కేవలం వాటాల కోసం మాత్రమే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు
– కేసీఆర్ ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఒకే కాంట్రాక్టర్ నడుపుతున్నాడు
– పురపాలక శాఖలో, ఐటీ శాఖ అనేక అక్రమాలలో కేటీఆర్ పాత్ర ఎంత ఉందో దర్యాప్తు చేయాలి
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్ : గత వారం రోజుల నుండి అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీలు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాల్లో రకరకాల ప్రకటనలు, ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విభజన చట్టం అమలు చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కోరారు. కృష్ణా, గోదావరి నదులకు బోర్డులను ఏర్పాటు చేయాలని విభజన చట్టం చెప్పింది.

అప్పుడు జరిగిన అపెక్స్ మీటింగ్ లలో అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్ – చంద్రబాబు .. తర్వాత కాలంలో కేసీఆర్ – జగన్ అందరూ కూడా కేఆర్ఎంబీ, గోదావరి రివర్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. రెండవ అపెక్స్ సమావేశంలో అప్పటి పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు, కేంద్ర జల వనరుల శాఖా మంత్రి సమాధానం చెప్పారు.

290 టీఎంసీలకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం పెట్టారు. బచావత్ ట్రిబ్యునల్ ఉన్నప్పటికీ నీటి కేటాయింపులు జరపాలనే ఉద్దేశ్యంతో, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కమిటీని ఏర్పాటు చేసినా కూడా కేసీఆర్ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కొత్తగా కేంద్రానికి అప్పగించడం అనే దాని మీద రాధ్దాంతం చేస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వాన్ని, జగన్ ప్రభుత్వాన్ని ఇప్పటి వరకు ఒకే కాంట్రాక్టర్ నడుపుతున్నాడు.. కాబట్టే రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కేంద్రాన్ని తప్పుబట్టాలనే చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాల యొక్క హక్కులను హరించాలని బోర్డులను ఏర్పాటు చేయలేదు. నదులు పారుతున్న రాష్ట్రాలలో సమస్యలు తలెత్తకుండా రైతుల సంక్షేమం కోసం, చిట్టచివరి ఆయకట్టుకు కూడా నీరందాలనే లక్ష్యంతో ట్రిబ్యునల్ బోర్డులను రాజ్యాంగ బద్దంగా ఏర్పాటు చేశారు.

కృష్టా, గోదావరి బోర్డులను విభజన చట్టం కోసం ఏర్పాటు చేసారు. రాష్ట్రాల హక్కులను హరించడం కోసం కాదు. తుంగభద్ర, కావేరీ, నర్మద నదులపై బోర్డులు ఉన్నాయి. నాటి ప్రభుత్వాలు రివర్ బోర్డులను రాజ్యాంగబద్ధంగా ఏర్పాటుచేయడం జరిగింది.. కానీ, పెత్తనం కోసం కాదు. నదుల నిర్వహణలో తలెత్తే వైరుధ్యాల పరిష్కారానికి బోర్డులను ఏర్పరచడం జరిగింది. గతంలో కృష్ణా బోర్డుమీద విరుద్ధంగా వ్యవహరించిన సందర్భాలు లేవు.

కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం.. కృష్ణా నదీజలాల పునఃపంపిణీ విషయంలో బోర్డులు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది.. ఇప్పుడు మాటమార్చి కేంద్రాన్ని నిందించేలా దుష్ప్రచారం చేస్తోంది. నదీ జలాల పంపిణీ విషయంలో ఎలాంటి వివాదాలు, సమస్యలు తలెత్తుకుండా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చిట్టచివరి పంట వరకు నీటిని అందించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది.

బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు రాజకీయంగా చేస్తున్న ఆరోపణలు, తెలంగాణ ప్రజలను తప్పుదోవపట్టించే విధంగా ఉన్నాయి. కేవలం వాటాల కోసం మాత్రమే ఈరకమైన ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీల చీకటి ఒప్పందం ఇదే. అపెక్స్-1,2 సమావేశాల్లో మాట్లాడిన మాటలకు భిన్నంగా నిన్న శాసనసభలో మాట్లాడారు.

ఇటీవలి కాలంలో పురపాలక శాఖలో, ఐటీ శాఖలో అనేక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డట్టు విచారణలో అనేక విషయాలు బయటికి వస్తున్నాయి. అప్పటి మంత్రి కేటీఆర్ చుట్టూ తిరిగిన ఉన్నతాధికారులే భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. దీంట్లో కేటీఆర్ పాత్ర ఎంత ఉందో దర్యాప్తు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కేటీఆర్ దగ్గరి వ్యక్తులుగా ఉన్న మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కథనాలు ఎందుకు వస్తున్నాయి..?

అప్పటి అవినీతిని కాపాడుకునేందుకే కేటీఆర్ వారిని కాంగ్రెస్ పార్టీలోకి పంపిస్తున్నారా? బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీ… బీఆర్ఎస్ పార్టీతో సన్నిహిత సంబంధాలను బలపరుచుకునేందుకేనా ఈ నాటకాలు? బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమే కృష్ణా బేసిన్ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారం.

దేశంలో నరేంద్ర మోదీ కి అనుకూలంగా వీస్తున్న పవనాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కొట్టుకుపోతాయనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు.

LEAVE A RESPONSE