Suryaa.co.in

Andhra Pradesh

భీమవరంలో ఈసారి పవన్ కళ్యాణ్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం ఖాయం

-నరసాపురం ఎంపీగా, పోటీ చేయబోయే అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదే నా సవాల్
-పవన్ కళ్యాణ్ వివాహాలకు ఓట్లకు ఏమైనా సంబంధం ఉందా?, ముఖ్యమంత్రి మాటలు ఆయన దివాళా కోరుతనాన్ని సూచిస్తున్నాయి
-గతంలోనూ విద్యార్థులకు ఫీజులు, వసతి సౌకర్యం కోసం ప్రభుత్వం నిధులను ఖర్చు చేసింది … కాకపోతే జగన్మోహన్ రెడ్డి వాటి పేర్లను మార్చారంతే
-రోజుకు ఇద్దరి చొప్పున వేసుకున్న నెల రోజుల వ్యవధిలో వైకాపా నుంచి 60 మంది ఎమ్మెల్యేలు ఔట అనుమతి లేకుండా సినిమా తీయడమే కాకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం దారుణం
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

రానున్న ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 వేల ఓట్ల మెజారిటీతో అద్వితీయమైన విజయాన్ని సాధిస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. మూడేళ్లకు మించి ఒక్కొక్క భార్యతో వైవాహిక జీవితాన్ని గడప లేని పవన్ కళ్యాణ్ కు ఓటు వేస్తారా అంటూ భీమవరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ వివాహాలకు, ఓట్లకు సంబంధం ఏమిటి?!, ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ఆయన భావా దారిద్ర్యాన్ని, దివాళా కోరుతనాన్ని తెలియజేస్తోందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… భీమవరం లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని నరసాపురం ఎంపీగా, రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా నేను ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నానని తెలిపారు . నేను గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నాను… పవన్ కళ్యాణ్ నూటికి నూరుపాళ్ళు విజయం సాధించడం ఖాయమని పేర్కొన్నారు. గతంలో భీమవరంలో కులాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు కుల, మతాలకతీతంగా అందరూ కలిసిపోయారు. ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో తెదేపా, జనసేన కూటమి విజయ దుందుభి మ్రోగించడం ఖాయం
రానున్న ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి విజయ దుందుభి మ్రోగించడం ఖాయమని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. నూటికి నూరుపాళ్ళు సర్వేలన్నీ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలియనిది కాదు. తెదేపా, జనసేన కూటమిని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెదేపా, జనసేన కూటమి చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలయ్యింది. అదే కలవరంతో విద్యా దీవెన సభలో విద్యార్థుల గురించి మాట్లాడాల్సింది పోయి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గురించి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడమే కాకుండా, టీవీ5, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల గురించి , వాటి యజమానులైనా రామోజీరావు, రాధాకృష్ణ లపైయధావిధిగా విమర్శలు చేశారు. అయినా ఫలితం శూన్యం.

పబ్లిక్ ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. ప్రజల్ని ఇంకా మీరు మార్చలేరు. ప్రజా శ్రేయస్సు కోసమే కలిసి పనిచేయాలని తెదేపా, జనసేన పార్టీలు నిర్ణయించాయి. ఆ రెండు పార్టీలతో కలిసి ప్రజల కోసం మరొక పార్టీ కూడా కలిసే అవకాశం ఉంది. అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన కలల రాజధాని విశాఖపట్టణానికి వెళ్లలేరు. వెళ్లిన మూడునాళ్ల మించి ఉండలేరని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఇకనుంచి అయినా అబద్ధాలు చెప్పడం మానేయాలి. 2023 – 24 విద్యా సంవత్సరానికి ఉన్న బకాయిలను చెల్లించడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల మనసును దోచుకునే ప్రయత్నం చేసుకుంటే మంచిదని జగన్మోహన్ రెడ్డికి రఘు రామకృష్ణంరాజు హితవు పలికారు.

వచ్చి అబద్దాలను చెబుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా ఎటువంటి ఆలస్యం లేకుండానే బటన్ నొక్కే కార్యక్రమాన్ని చేపడుతున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలను చెబుతున్నారని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. 2022- 23 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆఖరి విడత విద్యా దీవెన వాయిదా సొమ్మును, 2023-24 లో విద్యా సంవత్సరం చివరి అంకంలో అందజేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరం ఆఖరి విడత బటన్ నొక్కుడు కార్యక్రమం అంటే, ఇంక మిగిలిన విద్యా దీవెన సొమ్మంతా ఎగిరిపోయినట్టే లెక్క. ఎక్కడ ఆలస్యం లేకుండా బటన్ నొక్కుతున్నానని ఒకవైపు ముఖ్యమంత్రి చెబుతూనే, మరొకవైపు ఏడాది మొత్తం వాయిదాలను చెల్లించకుండా పచ్చి అబద్దాలను చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.

విద్యార్థులకు గత ప్రభుత్వాల హయాంలో ఆర్ టి ఎఫ్ పేరిట ట్యూషన్ ఫీజు, ఎంటిఎఫ్ పేరిట వసతి సౌకర్యానికి నిధులను చెల్లించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా ఈ నిధులు చెల్లించారు. అటువంటి పథకాలకు జగన్ మోహన్ రెడ్డి కేవలం పేర్లను మాత్రమే మార్చి, తానే కొత్తగా ఇస్తున్నట్లుగా ప్రచారాన్ని చేసుకుంటున్నారు. గతంలో ఒక్కొక్క విద్యార్థికి 20వేల రూపాయలు చెల్లించగా ప్రస్తుతం పదివేల రూపాయలను మాత్రమే ఇస్తున్నారు. దీని వల్ల నాలుగు ఏళ్లలో ఒక్కొక్క విద్యార్థికి 40 వేల రూపాయల నష్టం జరిగినట్లే. గతంలో నేరుగా కాలేజీలకు, వసతి గృహాలకు డబ్బులను చెల్లించేవారు. విద్యా దీవెన, విద్యా వసతి కార్యక్రమం పేరిట తల్లిదండ్రుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం వల్ల, కాలేజీల యాజమాన్యాలు ముందే డబ్బులు చెల్లించాలని విద్యార్థులను వారి తల్లిదండ్రులను పట్టుబడుతున్నాయి. కాలేజ్ పాస్ అవుట్ అయిన విద్యార్థులకు టీసీలు ఇవ్వడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

విద్యార్థులు కూడా 18 ఏళ్లు దాటి ఓటు హక్కు రావడంతో, వారిని కూడా మంచిగా చేసుకునేందుకు తల్లి బిడ్డల ఖాతాలలో విద్యా దీవెన వాయిదా మొత్తాన్ని జమ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఇవ్వాల్సిన మొత్తాన్ని ఈ ఏడాది డిసెంబర్లో ఇస్తున్నారన్నారు. భీమవరంలో బటన్ నొక్కే కార్యక్రమం నాలుగు సార్లు వాయిదా పడిన తర్వాత, ఎట్టకేలకు నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లను కొట్టివేయడంతో పాటు, పట్టణంలో దుకాణాలన్నింటిని మూసివేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు సెలవు ప్రకటించారు. జనాలను తరలించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

విద్యా దీవెన సభ లోనూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. ప్రజల అవస్థలను చూసి , గతంలో మాట్లాడి నేను అవస్థలు పడ్డాను. నన్ను చిత్రహింసలు పెట్టినా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాను. ప్రజల కష్టాలను చూసిన పవన్ కళ్యాణ్, ప్రతిపక్షాల ఓట్లు చీలవద్దని భావించి, ప్రతిపక్షాలంతా ఐక్యంగా కలిసి పనిచేయాలని భావించారు. ఎవరికి ఎన్ని సీట్లన్నది ముఖ్యం కాదని, ఎవరికి బలమున్న చోట వారు పోటీ చేస్తారన్న ఉద్దేశంతో తెదేపాతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. మూడు నెలల క్రితం ఆ పార్టీతో పొత్తును ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఇబ్బందులు పెట్టాలని ఉద్దేశంతో కాపు నేతలతో ఆయనపై పాలకులు విమర్శలు చేయించారు. కాపు కులస్తులను రెచ్చగొట్టేవిధంగా, వారిని తాకట్టు పెట్టడమే కాకుండా, పవన్ కళ్యాణ్ కూడా అమ్ముడుపోయారని ఆరోపణలు చేశారు. అంతులేని ఐశ్వర్యం కలిగిన జగన్మోహన్ రెడ్డికి మినహా, మరెవరికి ఇతరులను కొనగలిగే సామర్థ్యం ఉంటుంది. పవన్ కళ్యాణ్ నిప్పులాంటి మనిషి, ఆ నిప్పును జగన్మోహన్ రెడ్డి ముట్టుకోలేకపోయారు. నిప్పును ముట్టుకోలేక తప్పుడు అబండాలను వేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు .

సంక్రాంతికి, రిపబ్లిక్ డే కి కూడా వ్యూహం చిత్రం విడుదల కాకపోవచ్చు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మకథగా తీసిన వ్యూహం చిత్రం సంక్రాంతి పండగకు, రిపబ్లిక్ డే కి కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి తెర వెనుక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం చిత్రం పై హైకోర్టులో వాడీ వేడి వాదనలు కొనసాగాయి. రాత్రి 11 గంటలకు సెన్సార్ సర్టిఫికేట్ ఫై హైకోర్టు స్టే విధించింది . జనవరి 11వ తేదీన రివైజ్డ్ కమిటీ రిపోర్ట్, అబ్జర్వేషన్ ను ఫైల్ చేయాలని ఆదేశించారు. ఈ సినిమాను రాంగోపాల్ వర్మ కాకపోతే మరొక దర్శకుడి తో రూపొందించి ఉండేవారు.

సినిమాలో చూపించే వ్యక్తుల అనుమతి తీసుకోకుండా వారి పాత్రలను చిత్రం లో చూపించడానికి వీలు లేదు. వ్యూహం చిత్రంలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల పాత్రలను చూపించారు. పవన్ కళ్యాణ్ పేరును ప్రవణ్ కళ్యాణ్ గా పేర్కొంటూ, ఇది వేరే క్యారెక్టర్ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను చూపించడానికి ఆయన అనుమతి తప్పనిసరి. ఎటువంటి అనుమతి లేకుండా ఆయన పాత్రను చూపించడమే కాక, వ్యక్తిత్వ హననానికి పాల్పడడాన్ని న్యాయవాది వున్నం మురళీధర్ రావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత, సినిమా విడుదలపై కచ్చితంగా స్టే విధిస్తారని నేను భావించాను. అలాగే జరిగింది.

ఈ సినిమాకు నిర్మాతగా ఎవరి పేరు ఉన్నా, తెర వెనుక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నదనేది నిర్వివాదాంశం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి జీవిత గాధను సినిమాగా తీయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తరఫున న్యాయవాది గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ రాజకీయ నాయకులకు తోలు మందం ఉండాలని, విమర్శలను వారు మనసు మీదకు తీసుకుని బాధపడవద్దని చెప్పడం జరిగిందని తెలిపారు . అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎవరైనా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన, ఇతరులు పెట్టిన పోస్టులను ఫార్వర్డ్ చేసిన వారి మీద కేసులు పెట్టి వేధించడం చేస్తారని, అలాగే ఎవరైనా ఏకవచనంతో సంబోధిస్తే, అగౌరవపరిచినట్లుగా భావించి కేసులు నమోదు చేయిస్తారన్నారు.

జగన్మోహన్ రెడ్డి మాత్రం తనకంటే వయసులో పెద్దవారిని కూడా ఏక వచనంతో సంబోధిస్తూ ఆనందపడతారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. అంటే మిగతా రాజకీయ నాయకులు తోలు మందంతో ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం పల్చటి చర్మాన్ని కలిగి ఉన్నారా? అని ఎద్దేవా చేశారు. వ్యూహం చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, సినిమా రూపకల్పనలో ప్రాథమిక అంశాలను మర్చిపోయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వ్యక్తిత్వాలను కలిగి ఉన్న పాత్రలను రూపొందిస్తూ, కేవలం కల్పిత పాత్రలు అంటే సరిపోదన్నారు. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ను పోలి ఉన్న పాత్రను చూపించడమే కాకుండా, అదే పేరు పెట్టాక ఎలా కల్పితం అవుతుందని ప్రశ్నించారు.

చిత్రంలో ఒకరిని హీరోగా చూపించాలనుకున్నప్పుడు, సహజంగానే ఎదుటి వారిని ప్రతి నాయకుడిగా చూపెడతారు. గతంలో పద్మాలయ మూవీస్ వారు కూడా మండలాధీశుడు పేరిట రాజకీయ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాలో ఎన్టీఆర్ పేరుగాని, ముఖ్యమంత్రి పాత్రను కానీ చూపెట్టలేదు. మండలానికి అధ్యక్షుడు పేరు పెట్టి, మాండలికాన్ని మాత్రమే మార్చారు. మండలాధీశుడు సినిమా ఎన్టీఆర్ పేరుకు, పదవికి సంబంధం లేకుండా ఉంది. నిజజీవితంలోని వ్యక్తుల పేర్లను నేరుగా పాత్రలకు పెట్టి సినిమా రూపొందించడం కరెక్ట్ కాదని వున్నం మురళీధర్ రావు వాదించారు.

వ్యూహం చిత్రం జగన్మోహన్ రెడ్డి చూడడానికే ఉపయోగపడుతుంది. ఎందుకంటే, ఆ చిత్రంలో హీరో పాత్రకు పొడుగైన వ్యక్తిని ఎంపిక చేశారు. పొడవుగా ఉండే నారా చంద్రబాబు నాయుడు పాత్ర కు పొట్టి వ్యక్తిని ఎంపిక చేశారు. ఈ సినిమా ను ఎన్నిసార్లు చూసినా జగన్మోహన్ రెడ్డికి తనవి తీరకపోవచ్చు. రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా సెన్సార్ చిక్కుల్లో ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తోలు మందంగా పెంచుకోవాలి. ప్రతి చిన్న విషయానికి కమాన్ సంజయ్… కమాన్ సునీల్ అని విపరీత చర్యలకు దిగడాన్ని తనకు తానే అడ్డుకట్ట వేసుకోవాలని రఘు రామకృష్ణంరాజు సూచించారు.

మా కూటమి వ్యవహారాలు మేము చూసుకుంటాం… మీ సంగతి మీరు చూసుకోండి
తెదేపా, జనసేన కూటమి వ్యవహారాలను మేము చూసుకుంటామని, పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలతో తల బొప్పి కట్టిన వ్యవహారాలన్నీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చక్కదిద్దుకుంటే మంచిదని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. రోజుకు ఇద్దరు చొప్పున పార్టీని వీడిన నెలకు 60 మంది ఎమ్మెల్యేలు వైకాపాను వీడే అవకాశం ఉంది. బీసీ సాధికార సభలో ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ తాను నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి అభిమానాన్ని చూరగొనలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారన్నారు . ఇంకా నాలుగేళ్లు పదవీకాలం ఉన్న వంశీకృష్ణ కూడా గత నాలుగు ఏళ్లు గా ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఇవ్వలేదని పార్టీ నుంచి వైదొలి గారు.

తెదేపా, జనసేన కూటమి సీట్ల పంపకాల పంచాయితీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు?, జగన్మోహన్ రెడ్డి సింహం వంటి వారిని మా పార్టీ నాయకులు చెబుతుంటారు… ఇప్పుడు ఈ బేల మాటలు మాట్లాడడం ఎందుకనీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకేమిటి బాధ… మీ ఇంట్లో ఆడవారిని ఎవరినైనా పెళ్లి చేసుకున్నారా? అని సూటిగా ప్రశ్నించారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లినప్పుడు ఆయన సతీ సమేతంగా గుమ్మం బయటకు వచ్చి లోపలికి ఆహ్వానించారు. ఒక జంట అన్యోన్యంగా ఉంటే చూసి సహించలేరా? అని రఘురామకృష్ణంరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారన్న విషయం అందరికీ అర్థమైంది. ఇప్పుడు దానికి ఎమ్మెల్యేలను, ఎంపీలను బలి పశువులను, బకరాలను చేయాలని చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పై ప్రజలకు ఉన్న ద్వేషాన్ని 150 మంది ఎమ్మెల్యేలపై, 20 మంది ఎంపీలపై ఉన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం అందరికీ స్పష్టంగా అర్థమయింది. మీరెంతగా మసి పూసి మారేడు కాయ చేయాలని చూసినా… ప్రజలకు జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం లేదని, ఆయన్ని తెగ ప్రేమిస్తున్నారని చెప్పేందుకు చేసే ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసే అవుతాయి. ప్రజలకు విషయం అంతా తెలిసిపోయిందనీ రఘురామ కృష్ణంరాజు అన్నారు.

LEAVE A RESPONSE