Suryaa.co.in

Andhra Pradesh

చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలకేం చేస్తారు?

-రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది
-సంక్రాంతి కానుక, క్రిస్‌మస్‌ గిఫ్ట్‌, రంజాన్‌ తోఫా ఏమయ్యాయి?
-మేం ఐదేళ్లపాటు కరెంట్‌ ఛార్జీలు పైసా పెంచలేదు
-200 యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితం అన్నారు.. ఇచ్చారా?
-చెత్తపై పన్ను వేసిన సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచారు
-కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయి
-టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు

కమలాపురం: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప జిల్లా కమలాపురంలో నిర్వహించిన ‘రా..కదలిరా’ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు. విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని ధ్వజమెత్తారు..

”గతంలో ఇచ్చిన సంక్రాంతి కానుక, క్రిస్‌మస్‌ గిఫ్ట్‌, రంజాన్‌ తోఫా ఏమయ్యాయి? వైకాపా నేతలు ఇసుక నుంచి తైలం తీస్తారు. పెన్నా నది నుంచి ఇసుకను దొంగ రవాణా చేస్తున్నారు. 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టి జగన్ పొట్ట నింపుకొంటున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక నాసిరకం మద్యం వచ్చింది. జగన్‌.. మందు బాబులనూ మోసం చేశారు. ఆర్టీసీ, కరెంటు ఛార్జీలు పెంచారు. చెత్తపై పన్ను వేసిన సీఎంగా జగన్‌ చరిత్రలో నిలిచారు. మేం ఐదేళ్లపాటు కరెంట్‌ ఛార్జీలు పైసా పెంచలేదు. వైకాపా వచ్చాక బాదుడే బాదుడు. ఐదేళ్లలో పేదవాడిపై మోయలేని భారం వేశారు. ఎన్నికలకు ముందు 200 యూనిట్లలోపు విద్యుత్‌ ఉచితం అన్నారు.. ఇచ్చారా?

తెలుగుదేశం పార్టీకి పాలన ఎలా చేయాలో తెలుసు. సంపద ఎలా సృష్టించాలో, పేదవాడికి ఎలా న్యాయం చేయాలో తెలుసు. అధికారంలోకి వస్తే విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా. కడప స్టీల్‌ ప్లాంట్‌కు రెండు సార్లు రిబ్బన్‌ కట్‌ చేశారు. రిబ్బన్‌లు కట్‌ చేయడం, రంగులేయడం, పథకాలకు పేర్లు పెట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ పనిమీద లేదు. రాయలసీమను రతనాల సీమ చేసే బాధ్యత నాది.

కాలువల్లో నీళ్లు కాదు.. రైతుల కన్నీళ్లు పారుతున్నాయి. గోదావరి నీళ్లు బనకచర్లకు రావాలనేదే నా లక్ష్యం. నీళ్లు తప్ప రాయలసీమకు అన్ని అనుకూలతలు ఉన్నాయి. ఉపాధి కోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడి ప్రాజెక్టుల కోసం తెదేపా ప్రభుత్వం ఖర్చు చేసిన దాంట్లో 20శాతం కూడా ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు” అని చంద్రబాబు విమర్శించారు..

LEAVE A RESPONSE