– వక్ఫ్ బోర్డులో దళితులు ఉంటే ఓవైసీకి ఎందుకు అభ్యంతరం?
– రాష్ట్రాన్ని అమ్మడానికేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది?
– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, దోపిడీ విపరీతంగా పెరిగాయయని, అనేక ప్రాజెక్టుల్లో కమీషన్ల సంస్కృతి పెరిగిపోయిందని ప్రజలు భావించే కుటుంబ పాలనను తిప్పికొట్టి, కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు.కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనతి కాలంలోనే అదే మార్గంలో పాలన కొనసాగిస్తోంది.
బిల్లుల విడుదల కోసం 6-7% కమీషన్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రులు ఆయా జిల్లాల్లో కమీషన్ల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు తెరిచారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లగచర్ల భూసేకరణతో పాటు, ఫ్యూచర్ సిటీ పేరిట వేల ఎకరాలను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
రాష్ట్రంలో వేల ఎకరాల భూబ్యాంకు ఉంది. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూమినే ఎందుకు అమ్మాలని చూస్తోంది? హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థులు, వీసీ, రిజిస్ట్రార్, భారతీయ జనతా పార్టీతో పాటు పర్యావరణవేత్తలు, సామాజిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.
ఆ భూములు యూనివర్సిటీకి చెందిన భూములని విద్యార్థులు, వీసీ, రిజిస్ట్రార్ తో పాటు వివిధ సామాజిక సంఘాలు చెబుతున్నాయి. అటవీ, పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కుతూ, అరుదైన జీవజాతులకు ప్రమాదం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలకు సంబంధించిన భూముల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బిజెపి ఎంపీలు కలిసి, భూములను రక్షించాలని బిజెపి ఎంపీల బృందం కోరింది. గతంలో కోకాపేట భూములను రూ.100 కోట్లు ఎకరా ధరకు బీఆర్ఎస్ ప్రభుత్వం విక్రయించింది. అదే లెక్కన, హెచ్‌సీయూ భూముల విలువ సుమారు రూ. 46,000 కోట్లు. మరి, ఈ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి కట్టబెట్టాలని చూస్తోంది?
భూములు అవసరమైతే ఫార్మాసిటీ లేదా ఫ్యూచర్ సిటీలో సేకరించొచ్చు. మరి, ప్రత్యేకంగా హెచ్‌సీయూ భూములనే ఎందుకు అమ్మాలని చూస్తున్నట్లు? గత ప్రభుత్వం భూములను ఇష్టానుసారంగా అమ్మింది కాబట్టే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ సర్కారును గద్దెదించారు. ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థలకు కేటాయించిన భూములు అమ్మి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పరిపాలన చేస్తోంది.
హెచ్‌సీయూ భూములను నేషనల్ ఎన్విరాన్‌మెంట్ పార్క్‌గా డిక్లేర్ చేయాలి. పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే యత్నం వెనుక అవినీతి దాగి ఉంది. హెచ్ సీయూ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనివ్వం. బిజెపి దీనిపై పోరాటం కొనసాగిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల పట్ల నిజమైన నిబద్ధత ఉంటే, భూముల అమ్మకాన్ని తక్షణమే విరమించుకోవాలి.
భూములు యూనివర్సిటీవా, ప్రభుత్వానిదా అనే విషయం కంటే, వాటిని అమ్మడం ఎంతవరకు న్యాయం? రాష్ట్రాన్ని అమ్మడానికేనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది? హెచ్‌సీయూ భూముల అమ్మకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే ప్రజల నుంచి ప్రతిఘటన మరింత తీవ్రమవుతుంది.
భూముల అమ్మకానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన వారిని అక్రమంగా అరెస్టు చేసిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఈ కేసులను విత్‌డ్రా చేసుకోవాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధ పాలన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే దారిలో నడుస్తోంది. హెచ్ సీయూకు సంబంధించిన 400 ఎకరాల భూమిపై కొంతమంది పారిశ్రామికవేత్తల దృష్టి ఉంది.
గతంలో బోఫోర్స్ కుంభకోణంతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు హెచ్ సీయూ భూముల అమ్మకంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ప్రారంభమవుతుంది.
పార్లమెంటులో ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. దానిపై చర్చ కొనసాగుతోంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై వివిధ పార్టీల నాయకులు, ఆయా పార్టీలు ఏదైనా స్టడీ చేశాయా? లేదా..? దేశంలో అనేకమంది ముస్లిం సోదరులు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రావాలని కోరుకుంటున్నారు.
కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారులు సామాన్య ముస్లింలకు చెందే వక్ఫ్ ఆస్తులను, లక్షల ఎకరాల భూములను అనుభవిస్తూ, వారికి అనుకూలంగా అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
ముస్లింలను బీసీల్లో చేర్చి బీసీల రిజర్వేషన్లు అనుభవిస్తున్నప్పుడు లేని అభ్యంతరం.. వక్ఫ్ బోర్డులో దళితులు ఉంటే ఓవైసీకి ఎందుకు అభ్యంతరం? వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకించేవాళ్లు ముస్లిం ద్రోహులే. దేశంలోని కోట్లాది మంది పేద, సామాన్య ముస్లిం మహిళలతో పాటు పేదల పక్షాన మోదీ ప్రభుత్వం నిలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల విషయంలో అనేక రకాల విజ్ఞప్తులు స్వీకరించింది. అభ్యంతరాలు తెలుసుకుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేస్తే, వారే ముస్లిం పేదల హక్కులకు ద్రోహం చేస్తున్న వారవుతారు.