– కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదు
– కాంగ్రెస్ 8, బీజేపీ 8 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం ఇచ్చింది గుండుసున్నా
– 8+8 = పెద్ద గుండు సున్నా
– జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం చేయడం కొత్త కాదని, ఉచిత బస్సు ఇచ్చామని చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారాన్ని తుస్సు చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇస్తాని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్… ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.
బుధవారం నాడు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆహ్వానిస్తూ జగిత్యాల తెలంగాణ చౌరస్తా లో ఎమ్మెల్సీ కవిత వాల్ రైటింగ్ రాశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ఉచిత బస్సు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని, ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ఇచ్చాం కానీ తులం బంగారం మాత్రం ఇవ్వమని రేవంత్ రెడ్డి అంటున్నారని, కళ్యాణ లక్ష్మీ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఎండగట్టారు. రుణ మాఫీ, రైతు భరోసా 50 శాతం మందికి ఇంకా రానేలేదని, గ్రామ గ్రామాన కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి డబ్బులు ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పారని, మరి పసుపు ధరలు పడిపోతే బోర్డు నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా ? అని ప్రశ్నించారు. రెండు కోట్ల ఉద్యోగాలు, బోర్డుకు చట్టబద్ధత, మనిషికి 15 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎంపీ అర్వింద్ పిచ్చి మాటలు మాట్లాడుతారని, అంతకు మించి ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడిన దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు.. అయినా కేంద్రం బడ్జెట్ లో తెలంగాణ 8 రూపాయలు కూడా ఇవ్వలేదని, 8+8 = పెద్ద గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు.