Suryaa.co.in

Andhra Pradesh

పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి

అమరావతి,26 జూన్:రాష్ట్రంలో ప్రభుత్వ పరంగాను,ప్రభుత్వ ప్రవేట్ భాగస్వామ్యం(పిపిపి) విధానంలోను ఇప్పటికే చేపట్టిన,ప్రతిపాదించిన పర్యాటక ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ఆయన పర్యాటకశాఖపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన పలు పర్యాటక ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులను సహితం సకాలంలో పనులు చేపట్టి నిర్ధిష్ట గడువు ప్రకారం పూర్తి చేసి ప్రజలకు ముఖ్యంగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆయా పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.ప్రతి పర్యాటక ప్రాజెక్టును గడువు లోగా పూర్తి చేసేందుకు వీలుగా ఒక టైం లైన్ పెట్టి ఆప్రకారం పూర్తయ్యేలా చూడాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోను, ప్రముఖ దేవాలయాల ప్రదేశాల్లోను ప్రతిపాదించిన స్టార్ హోటళ్ళు,రిసార్టులు వంటివి సకాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తేవడం ద్వారా ఆయా ప్రాంతాలను పర్యాటక,ఆధ్యాత్మికపరంగా మరింత అభివృద్ధి లోకి తెచ్చేందుకు వీలవుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.రాష్ట్రానికి 970 కిలోమీటర్ల పొడవైన సముద్రతీరం ఉన్నందున బీచ్ టూరిజం అభివృద్ధికి పెద్దఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అటవీ ప్రాంతాలు,జల పాతాలు,గుహలు ఉన్నప్రాంతాల్లో పెద్దఎత్తున పర్యాటకపరమైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవడం ద్వారా పర్యాటకులను మరింత ఆకర్షించ వచ్చని పేర్కొన్నారు.అలాగే వివిధ ప్రాంతాల్లో ఇకో టూరిజం ప్రాజెక్టులు,వివిధ సరస్సులు, రిజర్వాయర్ల వద్ద వాటర్ స్పోర్ట్సు ప్రాజెక్టులను త్వరిత గతిన అందుబాటులో తేగలిగితే రాష్ట్రాన్ని పర్యాటకపరంగా మరింత అభివృద్ధిలోకి తేవచ్చని సిఎస్ జవహర్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీశైలం,అన్నవరం,సింహాచలం దేవస్థానాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రసాద్(PRASAD) స్కీం(Piligrimage Rejuvenation and Spiritual Augmentaion Drive) కింద ఎంపిక చేసిందని అక్కడ టెంపుల్ టూరిజం అభివృద్ధికి పెద్దఎత్తున కృషి జరుగుతోందని తెలిపారు.

రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి కె.కన్నబాబు రాష్ట్రంలో వివిధ పర్యాటక ప్రాజెక్టులు జరుగుతున్నప్రాజెక్టుల ప్రగతి వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సరస్సులు,రిజర్వాయర్లు గల 77 ప్రాంతాల్లో పిపిపి విధానంలో వాటర్ స్పోర్స్టు అభివృద్ధికి ప్రణాళికలు అమలు చేస్తున్నామని వివరించారు.అదే విధంగా బీచ్ ల వెంబడి 289 ప్రాంతాల్లో కోస్టల్ జోన్ టూరిజం అభివృద్ధికి మాస్టర్ ప్రాన్ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇంకా వివిధ ఇకో టూరిజం ప్రాజెక్టులు తదితర ప్రాజెక్టులు గురించి యండి.కన్నబాబు వివరించారు.అంతేగాక వివిధ పర్యాటక ప్రాజెక్టులను ఎప్పటి లోగా పనులు ప్రారంభించి ఎప్పటికి లోగా పూర్తి చేసేది నెలవారీ టైంలైన్ వివరరాలను తెలియజేశారు.ఇంకా ఈసమావేశంలో రాష్ట్రంలో చేపట్టిన వివిధ పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిని వివరించారు.

ఈసమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ,పిసిసిఎఫ్ ఎకె.ఝా తదితర అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE