– చైర్మన్ దీపక్ రెడ్డి గుణపాటి
విజయవాడ: పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన యువతను అందించేలా సీడ్ యాప్ ద్వారా కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ (సీడ్ యాప్) నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన దీపక్ రెడ్డి గుణపాటి తెలిపారు. డాక్టర్ నందమూరి తారక రామారావు పరిపాలనా భవనం రెండో బ్లాక్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉపాధి కల్పన, వ్యవస్థాపన అభివృద్ధి సంస్థ కార్యాలయం లో చైర్మన్ గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్తగా ఎంపిక చేసిన 20 మంది చైర్మన్లతో ముఖ్యమంత్రి మాట్లాడి లక్ష్యాలను నిర్ధేశించారన్నారు. ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారని, అందుకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.
పరిశ్రమలకు అవసరమైన మాన్ పవర్ ను అందిస్తామని, సెక్టర్ల వారీగా పరిశ్రమల వారితో చర్చిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న పథకాలకు ఎటువంటి నిధుల కొరత లేకుండా తప్పక కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుంగా కృషి చేసి అభివృద్ధి చేస్తానన్నారు. తొలుత ఆయనకు కార్యాలయ సిబ్బంది సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఎల్ సీ బీటీ నాయుడు, సీడ్ యాప్ సీఈవో ఎంకేవీ శ్రీనివాసులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.