Suryaa.co.in

Telangana

వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్ధయాత్రలకు వెళ్లినట్టుంది

– బీజేపీ నేతల విమర్శలపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల ఫైర్

హైదరాబాద్: చాలా మంది రైతులకు రుణమాఫీ జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ ఆరోపణ చేయడం వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్లు ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమయ్యాయి? రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, గత పది సంవత్సరాలలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే నికరాదాయం పెరగని వాళ్ళందరికి మీ దగ్గర సమాధానం ఉందా? స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేసి, రైతులను ఆదుకోమని, రాజధాని వీధులకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఙప్తులు ఎప్పుడన్న పట్టించుకొన్నారా?

బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా? కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తలనుండి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత మీకుందా? కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు భరోసా కల్పించే బాధ్యత మాది.

ఇప్పటికే సన్న వడ్లను రూ.500 బోనస్ ప్రకటించాం. పంటలకు అన్నిటికీ మద్ధతు ధరతో కొనే విధంగా ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి తగ్గట్టుగానే గత యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోయిన, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ఈ ప్రభుత్వం 392 కోట్ల రుపాయలు వెచ్చించి రైతుల నుండి కందులను, సోయాబీన్ లను, శనగలను, పొద్దుతిరుగుడును, జొన్నలను మద్ధతు ధరతో కొనుగోలు చేయడం జరిగింది.

కేంద్రంలో రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని వారు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా, మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే, వారి అక్కసు ఈ విధంగా వ్యక్తం చేస్తూ మాట్లాడటం సరికాదని యావత్తు తెలంగాణ అభిప్రాయం.

గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం అమలు చేయని వందల హామీలలో ‘భారత రైతులకు కనీసం మద్ధతు ధర విషయం ఇచ్చిన హామీ’ ఈ హామీ అమలు చేయక పోవడం వలన తెలంగాణ రాష్ట్ర రైతులే గత తొమ్మిదేళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.

2023-24 సంవత్సరానికి CACP అంచనా వేసిన క్వింటాలు ధాన్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు 1911 రూపాయలు కాగా, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటాలు మద్ధతు ధర 2876 రూపాయలుగా ప్రకటించాల్సిన కేంద్ర ప్రభుత్వం, గతంలో ఇచ్చిన హామీని ఉల్లంఘించి తప్పుడు పద్ధతుల్లో లెక్కించి, క్వింటాలు ధాన్యానికి ప్రకటించిన ధర కేవలం 2203 రూపాయలు మాత్రమే.

ఫలితంగా రాష్ట్ర రైతులు ప్రతి క్వింటాలుకు 664 రూపాయలు నష్టపోయారు. దీనిపై బీజేపీ పెద్దలు దీక్ష చేసినట్లైతే తెలంగాణ రైతాంగం వారికి రుణపడి ఉండేది. ఆహార భద్రత చట్టం క్రింద కేంద్రం ప్రధానంగా బియ్యం, గోధుమలను మాత్రమే వివిధ రాష్ట్రాల నుండీ కొంత ఎక్కువ మోతాదులో సేకరిస్తున్నది. ఇది ఒకరకంగా మోనోక్రాపింగ్ కు దారితీసి, పర్యావరణ సంక్షోభానికి కూడా కారణమవుతున్నది.

కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ ద్వారా, పప్పు ధాన్యాలను నూనె గింజలను ఒక మేరకు సేకరిస్తున్నా, వాటి పరిమాణం చాలా తక్కువ. పైగా అన్ని రాష్ట్రాల లోనూ వీటిని ప్రతి సంవత్సరం సేకరించడం లేదు.చిరు ధాన్యాలను కూడా ఆహార భధ్రత చట్టం క్రింద పంపిణీ చేయాలని నిర్ణయించినా, దాని అమలును రాష్ట్రాల విచక్షణకు వదిలేశారు. కనుకనే, తెలంగాణ సహా, అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో పండుతున్న చిరు ధాన్యాలను సేకరించడం లేదు. పంపిణీ చేయడం లేదు.

రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వము పంటలభీమా పథకంలో రైతువాటా కూడా కట్టడానికి సిద్ధపడుతుండగా, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వము అటువంటి ప్రయత్నం చేయకపోవడం శోచనీయం. ఆర్థికవనరులు మితంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే రైతుకూలీలకు భరోసా, కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించి, అమలు ప్రయత్నాలు చేసే సందర్భములో కేంద్ర పెద్దలు పెద్దమనస్సులో సహకరించాల్సింది పోయి విమర్శలు చేయడం వారిని వారు దిగజార్చుకోవడమే.

ఇప్పటికైనా రైతు ఉద్యమం సందర్భంగా అమరులైన 708 మందికి పైగా రైతు కుటుంబాలకు తక్షణ పరిహారం చెల్లించి, రైతుల డిమాండ్లు పరిష్కరించేవిధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా తెలంగాణ రైతాంగం తరఫున బిజెపి పెద్దలకు విజ్ఙప్తి చేస్తున్నాను.

రుణమాఫీ 2024లో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను ఒక్కొక్కటి పరిష్కరించుకుంటు అర్హలైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచేసే విధంగా చర్యలు తీసుకొంటున్నామని, దానిమీద ఏమైన సందేహాలు బిజెపి పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, రైతాంగాన్ని గందరగోళంలో నెట్టొద్దని విజ్ఙప్తి చేశారు.

ఇప్పటివరకు 22 లక్షల మందికి 18 వేల కోట్లు రుణ మాఫీ చేసాం. రుణమాఫీ కానివారికి సంబంధించి కుటుంబ సభ్యుల నిర్ధారణ సర్వే చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆధార్ వివరాలు సరిగాలేని ఖాతావివరాలు కూడా సరిచేయడం జరిగింది. వీరిలో 2 లక్షలలోపు రుణం ఉన్న కుటుంబాలన్నింటికి రుణమాఫీ చేసి, తర్వాత ఇంకా మిగిలి ఉన్న 2 లక్షలకు పైన ఉన్న కుటుంబాలకు షెడ్యూలు ప్రకటించి దాని ప్రకారం మాఫీ చేస్తాం.

రుణమాఫీ 2024 అమలుకు మా నాయకుడు రాహుల్ గాంధీగారు ప్రకటించిన తేదీ నుండి తీసుకొంటే రుణమాఫీ వర్తించే కుటుంబాలు తక్కువగా ఉండటం చేత, 12 డిసెంబర్2018 నుండి తీసుకొని, గత ప్రభుత్వము రుణమాఫీ చేయని కుటుంబాలకు కూడా వర్తింపచేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై గల ప్రేమను అర్ధం చేసుకోవచ్చని తెలిపారు.

భారతదేశ వ్యాప్తంగా రైతులందరికి రుణమాఫీ ప్రకటించి అమలు చేసింది మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, తరువాత రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మేరకు రుణమాఫీ ప్రకటించి అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ. అదికూడా అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే.
వీలయితే పిఎంకిసాన్ కింద రైతులకు అందించే సహాయాన్ని పెంచాలని, కుటుంబానికి సంవత్సరానికి 6000 కాకుండా ఎకరానికి 7500 ఇచ్చినట్లైతే భారతదేశ యావత్ రైతాంగం వారికి రుణపడి ఉంటుంది.

గత పది సంవత్సరాలలో కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకదాని మీద ఒకటి పరస్పర నిందలు మోపుకుంటు, రాష్ట్ర రైతు ప్రయోజనాలను పూర్తిగా కాలరాశారని, తమ ప్రభుత్వం ఆ విధంగా కాకుండా రైతులను ఆదుకునే విషయంలో రాజకకీయాలను పక్కన బెట్టి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నది.
అందుకు తెలంగాణలో ఉన్న మీరందరూ కూడా మాతో పాటు కలిసి కట్టుగా కేంద్రప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్రానికి నిధులు వచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను.

LEAVE A RESPONSE