వేల కోట్లు ఖర్చు పెట్టినా తెరాసకు ఓటమి తప్పదు: ఈటల

వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తెరాసకు ఓటమి తప్పదని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. ఉప ఎన్నిక ఫలితం తర్వాత కేసీఆర్‌ పాలనను కూల్చడమే కర్తవ్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. ఆబాది జమ్మికుంటలో యువతతో నిర్వహించిన సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావుతో కలిసి ఈటల మాట్లాడారు.
అక్రమ సంపాదనను నమ్ముకొన్న తెరాస అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తోందని ఈటల ఆరోపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా యువశక్తిని నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. మద్యం, డబ్బులు.. వంటి వాటికి హుజూరాబాద్‌ ప్రజలు లొంగరని పేర్కొన్నారు. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ.. ఇప్పటివరకు తాను రాసినట్లు ఐదు అసత్యపు లేఖలు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మాన్ని కాపాడుకొనే బాధ్యత యువతపైనే ఉందని ఈ సందర్భంగా ఈటల పేర్కొన్నారు.
తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 27 తర్వాత ఇతర ప్రాంతాల నుంచి హుజూరాబాద్‌ వచ్చిన వాళ్లంతా వెళ్లిపోతారన్నారు. ఆ తర్వాత మద్యం సీసాలు, డబ్బు హుజూరాబాద్‌కు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత యువతపైనే ఉందని ఈటల స్పష్టం చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల విజయం ఖాయమని.. భారీ మెజారిటీతో గెలుస్తారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.