Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను సరిగా నిర్వహించలేకపోవడం వల్లనే ప్రజలపై ట్రూ అప్ భారం

-2014-19 ల మధ్య ట్రూ అప్ భారాన్ని ప్రజలపై పడకుండా చంద్రబాబు చూస్తే
-ఇప్పుడు ఆ కాలానికి కూడా జగన్ రెడ్డి వాటిని వసూలు చేస్తున్నారు
-2014-19 మధ్య కాలానికి జగన్ రెడ్డి ట్రూ అప్ పేరుతో రూ. 3,013 కోట్ల భారం
-మా పరిపాలన కాలానికి ప్రజలను దోచుకోవడానికి మాత్రం ట్రూ అప్ కావాలి…. 
-సహాయం చేయడానికి మాత్రం రైతు రుణమాఫీ వద్దా జగన్ రెడ్డి? 
-4 వ విడత రైతురుణమాఫీ కోసం జీవో నెం.38 ద్వారా మార్చి 2019న పీడీ ఖాతాలలో ఉంచిన -రూ.4,100 కోట్లను సైతం దొంగిలించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి
-ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్న మధ్యప్రదేశ్ లోని ఏపీకి చెందిన
-సులియారీ బొగ్గు గనిని ఏపీ జెన్-కో కు ఇవ్వకుండా జగన్ రెడ్డి అదానీకి కట్టబెట్టాడు
-బొగ్గు కొరతతో జెన్-కో సామర్ధ్యానికి తగ్గట్టు విద్యుత్ ఉత్పత్తి చేయలేకపోయింది
-బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు ధర సరాసరిన రూ. 4.31 గా నిర్ణయిస్తే
-జగన్ రెడ్డి బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.15 పెట్టి కొన్నారు
-కృష్టపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంటు ప్రైవేటీకరణకు అత్యధిక బొగ్గు ధరలే కారణమైతే మధ్యప్రదేశ్ లో సొంత బొగ్గు గనిని అదానీలకు ఎందుకుదోచిపెట్టావ్ జగన్ రెడ్డి?
-జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

రివర్స్ లో వెళ్లి ట్రూ అప్ ఛార్జీలు
జగన్ రెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమం నిర్విరామంగా ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలపై విపరీతంగా బాదుతున్నారు. చంద్రబాబు గారి హయాంలో ప్రజలపై ఎలాంటి ఛార్జీల భారం మోపలేదు. ఒక్క నిమిషం కూడా కరెంట్ కోతలు లేవు. జగన్ రెడ్డి పాలనలో మొదటి నెల నుంచే ప్రజలపై భారాలు మోపుతున్నారు. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీలు. ఇందులోనూ ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపుతున్నారు.

విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి.. విద్యుత్ ప్లాంట్లను సరిగా నిర్వహించకపోవడం, బొగ్గు కొనుగోళ్లలో అసమర్థత, ప్రభుత్వ ఆధీనంలోని ఏపీ జెన్ కో విద్యుత్ ప్లాంట్లలో సరిగా విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడం, పీపీఏల రద్దు వంటి తుగ్లక్ నిర్ణయాల వల్ల బహిరంగ మార్కెట్ లో రూ.15 నుంచి రూ.20 వరకు కూడా పెట్టి విచ్చలవిడిగా విద్యుత్ కొనుగోలు చేశారు. ఈ అదనపు కొనుగోలు భారాన్నంతా ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోపుతున్నారు. భారాలు మోపే విషయంలోనూ జగన్ రెడ్డి రివర్స్ లో వెళ్లారు. 2014-19 మధ్య కాలానికి కూడా ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లింది.

ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. చంద్రబాబు గారి పాలనలో ప్రజలపై పైసా భారం వేయలేదు. ట్రూ అప్ అనే పదానికే చోటివ్వలేదు. ఇప్పుడు ఆ కాలానికి కూడా ట్రూప్ చార్జీలు వసూలు చేయడానికి జగన్ రెడ్డి ఎవరు? ఈ రివర్స్ ట్రూ అప్ బాదుడుకి సంబంధించి 26-11-2020న ఏపీ ఎలక్ట్రిసిటీ కమిషన్ నుంచి ఉత్తర్వు కూడా తెచ్చుకున్నారు. 2014-19 మధ్య కాలానికి సంబంధించి 2016-17, 2017-18, 2018-19 మూడేళ్లకు రూ.3,013 కోట్ల ట్రూఅప్ చార్జీల భారం మోపడానికి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. చంద్రబాబు గారి పాలనా కాలానికి ఇప్పుడు ట్రూఅప్ ఛార్జీలు వేయడం ఏంటి? ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు. పోనీ రివర్స్ లో వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను కూడా ఇదేరకంగా మీరు కొనసాగించారా?

టీడీపీ చేపట్టిన రైతు రుణమాఫీ అమలుకు రివర్స్ లో ఎందుకు వెళ్లలేదు? 
రైతు రుణమాఫీ కింద చంద్రబాబు గారు రూ.15,279 కోట్లు మూడు విడతలుగా చెల్లించడం జరిగింది. నాలుగో విడత రుణమాఫీ కింద కూడా 10-03-2019న జీవో నెం.38 విడుదల చేసి రూ.3,979 కోట్లకు సంబంధించి ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి పీడీ అకౌంట్ నెం.108-CRTలో రూ.4,100 కోట్లు కూడా జమచేయడం జరిగింది. 5వ విడతకు సంబంధించి కూడా మరో రూ.3,979 కోట్లు సాంక్షన్ కూడా ఈ జీవోలో ఇవ్వడం జరిగింది. పది శాతం వడ్డీ కూడా కలిపి ఇవ్వడం జరిగింది. టీడీపీ అధికారం కోల్పోయి దుర్మార్గుడైన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.

అయితే ఖాతాలో రెడీ గా ఉన్న నగదుతో రైతులకు నాలుగో విడత రుణమాఫీ కింద రూ.3,979 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. జీవో నెం.99(25-09-2019) ఇచ్చి గతంలో రూ.4,100 కోట్లు విడుదల చేస్తూ తెదేపా ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.38ని రద్దు చేసి రైతు రుణమాఫీని ఎగ్గొట్టాడు జగన్ రెడ్డి. ఆ నిధులను పక్కదారి పట్టించి దోచుకున్నారు. 2014-19 మధ్య కాలానికి విద్యుత్ ట్రూఅప్ ఛార్జీల భారం మోపుతున్న జగన్ రెడ్డి.. అదే పద్ధతిలో 2014-19 మధ్య చంద్రబాబు గారు రైతుల కోసం చేపట్టిన రుణమాఫీ పథకాన్ని కొనసాగించి నాలుగో విడత రుణమాఫీ కింద నిధులు ఖాతాలో సిద్ధంగా ఉన్నా కూడా రూ.3,979 కోట్లు ఎందుకు ఇవ్వలేదు. భారాలు వేయడానికి మాత్రం వెనక్కి వెళ్లి మరీ భారం వేస్తారు. ప్రజలకు మేలు చేయడానికి మాత్రం ఆ పద్ధతి అవలంబించరు. ఇక్కడ మాత్రం మీకు దోపిడీయే కావాలి. దీనిని బట్టి ప్రజలు జగన్ రెడ్డి నైజాన్ని గ్రహించాలి.

రాష్ట్రంలోని విద్యుత్ ప్లాంట్లలో జరగని ఉత్పాదన
ట్రూఅప్ ఛార్జీల బాదుడు చూస్తే… 2019-20 కాలంలో రూ.2,542 కోట్లు, 2020-21లో రూ.2914 కోట్లు, 2021-22లోనూ వేలకోట్లు బాదుడే. ప్రతి మూడు నెలలకు బాదుడే బాదుడు. ఇలా ట్రూ అప్ ఛార్జీల పేరుతో కనీసం ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు పైబడి వడ్డన వేశారు. పేదవారికి మేలు చేయడం గురించి మాట్లాడే జగన్ రెడ్డి.. ప్రజలపై వేస్తున్న భారాలపై ఏం సమాధానం చెబుతారు? ఈ ట్రూ అప్ ఛార్జీల వడ్డనకు ప్రధాన కారణం థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యానికి తగట్లు లేకపోవడం, ఆ లోటు పూడ్చుకోవడానికి బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం.

నార్ల తాతారావు పవర్ స్టేషన్ లో అక్టోబర్ 12వ తేదీకి కేవలం 42,708 మెట్రిక్ టన్నులే బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఇది రెండు రెండు రోజులకే సరిపోతుందని విద్యుత్ శాఖ అధికారులే సీఎంకు చెప్పారు. దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ లో 7 రోజుల కంటే తక్కువగా సరిపోయే 1,14,458 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలే ఉన్నాయి. ఏ థర్మల్ పవర్ స్టేషన్ చూసినా 2 రోజులు, 7 రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం 20 నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సిన అవసరం ఉంది. కానీ జగన్ రెడ్డి అసమర్థత వల్ల ఆ పరిస్థితి నేడు మన రాష్ట్రంలో లేదు. అందుకే ఇవాళ బొగ్గు కొరత వల్ల విద్యుత్ ఉత్పాదన సరిగా జరగడం లేదు.

అదానీకి మధ్యప్రదేశ్ లో సులియారీ కోల్ మైన్ ను కట్టబెట్టిన జగన్ రెడ్డి
చంద్రబాబు గారి ముందుచూపుతో బొగ్గు కోసం ఏపీఎండీసీ ద్వారా మధ్యప్రదేశ్ లో సులియారి కోల్ మైన్ ను తీసుకోవడం జరిగింది. ఇవాళ అదే కోల్ మైన్ అదానీ వాళ్లకు కట్టబెట్టడం జరిగింది. అదానీకి బొగ్గు.. జెన్ కో కు మసి.. అని పత్రికల్లో ప్రధాన శీర్షికలు వచ్చాయి. జగన్ రెడ్డి చేతిలో ఉన్న కోల్ మైన్ ను ఏపీ జెన్ కో కు ఇవ్వకుండా అదానీకి ఎందుకు కట్టబెట్టారు? ఇదే సులియారి బొగ్గుగని ఏపీ జెన్ కోకు ఇచ్చిఉంటే రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు కొరత ఉండేది కాదు. కావాల్సినంత విద్యుత్ ఉత్పాదన జరిగి ఉండేది. బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలకు కొనాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పటికే అడ్డగోలుగా అదానీకి ఇచ్చేశారు. మేజర్ పోర్టులన్నీ అదానీకే. అన్ని అదానీలకే దోచిపెడితే రాష్ట్ర పరిస్థితి ఏంటి? జగన్ రెడ్డి అసమర్థ విధానాల కారణంగా బహిరంగ మార్కెట్ లో రూ.20 వరకు యూనిట్ కు ఖర్చుపెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఈ ఏడాది మే నెలలో రూ.11.26 పైసలకు యావరేజ్ న కొనుగోలు చేశారు.

ఎందుకు ఇంత అధిక ధర పెట్టి కొనుగోలు చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఫిక్స్ చేసిన పర్చేజ్ కాస్ట్ 4.31 పైసలు. మీరు 11 రూపాయలు, 12, 15 రూపాయల వరకు పెట్టి ఏవిధంగా కొనుగోలు చేస్తున్నారు? ఈ భారం అంతా తిరిగి ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపైనే వేస్తున్నారు కదా. నేడు రాష్ట్రంలోని ప్రజలకు ప్రతినెలా కరెంట్ బిల్లు ముట్టుకుంటేనే షాక్ తగులుతోంది. జగన్ రెడ్డి అవినీతి, అసమర్ధతే వీటన్నింటికి కారణం. ఈ వాస్తవాలను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ బంగారం లాంటి సులియారీ బొగ్గుగనిని అదానీ కట్టబెట్టేశారు.

ఏడాదికి ఐదు మిలియన్ టన్నుల సామర్ధ్యం ఉన్న మధ్యప్రదేశ్ లోని ఏపీకి చెందిన సులియారీ బొగ్గు గనిని ఏపీ జెన్-కో కు ఇవ్వకుండా జగన్ రెడ్డి అదానీకి కట్టబెట్టాడు. కృష్ణపట్నం ప్లాంట్ అమ్మేందుకు నాణ్యమైన బొగ్గు కొరత, అత్యధిక ధరలకు విదేశీ బొగ్గు కొనుగోలు వంటి కుంటిసాకులు చెప్పిన జగన్ రెడ్డి.. విదేశీ బొగ్గు నాణ్యతకు సరిసమానమైన నాణ్యత కలిగిన బి-గ్రేడ్ బొగ్గు దొరికే సులియారీ బొగ్గు గనిని అదానీకి ఎలా కట్టబెట్టారు?

అదే బొగ్గుగని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండి ఉంటే తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు మనకు అందుబాటులో ఉండి ఉండేది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్ ను అమ్మాల్సిన పరిస్థితి కూడా ఏర్పడేది కాదు. అన్నీ తెలిసే జగన్ రెడ్డి తన స్వలాభం కోసం లాలూచీ పడి ఇతరులకు ఈ విధంగా దోచిపెడుతున్నారు. ప్రజలు ఈ వాస్తవాలన్నీ దయచేసి గ్రహించాలి.

LEAVE A RESPONSE