– దేశంలోనే 64 లక్షలమందికి పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే
– ప్రతి నెలా రూ. 4 వేలు పింఛను ఇచ్చే రాష్ట్రమూ ఒక్క ఏపీనే
– గత విధ్వంస పాలనతో ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయమైంది
– విర్రవీగిన వారికి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు
– నాకు ప్రజలే హైకమాండ్, నేను సమాధానం చెప్పాల్సింది ప్రజలకే
– గోదావరి జలాలను బనకచర్లకు తీసుకెళ్లగలిగితే రాష్ట్ర ముఖ చిత్రం మారిపోతుంది
– పల్నాడు జిల్లా యలమందల గ్రామంలో పింఛను పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
నరసరావుపేట: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గడిచిన ఐదేళ్లలో ప్రజల ముఖాల్లో చిరునవ్వు మాయమైందని, ఇంటి నుంచి బయటకు స్వేచ్ఛగా వచ్చే పరిస్థితులు కూడా లేవని అన్నారు.
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించేవారని, తాను అలాంటి సీఎం కాదని, సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యత అని అన్నారు. తనకు హైకమాండ్ అంటూ ఏం లేదని, 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్ అని ముఖ్యమంత్రి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావు పేట నియోజకవర్గం యలమందలలో పించన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
లబ్ధిదారులకు ఇంటికెళ్లి పింఛను అందజేత- స్వయంగా కాఫీ పెట్టిన ముఖ్యమంత్రి
లబ్ధిదారులు తలారి శారమ్మ, ఏడుకొండలు ఇంటికి వెళ్లి వారికి ముఖ్యమంత్రి పింఛను అందజేశారు. ఏడుకొండలు ఇంట్లో ముఖ్యమంత్రి స్వయంగా కాఫీ చేశారు. కుటుంబసభ్యులకు ఇచ్చి తానూ తాగారు. అనంతరం వారితో మాట్లాడి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏడుకొండలు కుమారుడు ఇల్లు కట్టుకునేందుకు రుణంతో పాటు అతనికి స్వయం ఉపాధి కోసం బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 5 లక్షల రుణం అందివ్వాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఏడుకొండలు సొంతగా నడుపుతున్న టైర్ల షాపుకు ప్రభుత్వం నుంచి రూ. 60 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరో లబ్ధిదారు శారమ్మ ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. కరోనాలో భర్తను కోల్పోయిన శారమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికంగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. డాక్టర్ చదువుదామనుకుంటున్న శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని, కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ. 3 లక్షల రుణం అందించాలని అధికారులను ఆదేశించారు.
పేదలకు పెన్షన్ ఇచ్చిన ఘనత టీడీపీదే
పేదరికం లేని సమాజం స్థాపించాలని, కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకొని వృద్ధిలోకి తీసుకురావాలన్న ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా ముందుకెళ్తున్నాము. దేశంలో 64 లక్షల మంది పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఒక్క ఏపీనే. అలాగే ప్రతినెలా పేదలకు రూ. 4 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రమూ ఏపీనే. అధికారంలోకి రాగానే ఏప్రిల్ నెల నుంచి పింఛను ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నాము.
ఒక రోజు ముందుగా 31వ తేదీనే పింఛను అందిస్తున్నాము. మంచి నాయకత్వం ఉంటే అంతా మంచే జరుగుతుంది. ప్రతి లబ్ధిదారునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ అందాలన్నదే నా ఆశయం . సిబ్బంది ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా ఆఫీస్ లో ఇస్తే ఊరుకోము. వెంటనే మెమో పంపిస్తాము. ఫోన్లో జీపీఎస్ ద్వారా వెంటనే సమాచారం మాకు వచ్చేస్తుంది.
గాడి తప్పిన పాలనను పట్టాలెక్కిస్తున్నాం
జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం గత ఐదేళ్లలో చూశాను. అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దారి మళ్లించేశారు. జే ట్యాక్స్ కు భయపడి పారిశ్రామికవేత్తలు ఏపీ వైపే చూడలేదు. గాడి తప్పిన పాలనను పునరుద్ధరిస్తున్నాను. ఇప్పటికే పేదవాళ్ల ఆకలి తీర్చడానికి 198 అన్న క్యాంటీన్లు ఏర్పాటుచేశాము. అవసరమైతే మరిన్ని పెడతాం. చెత్తపై పన్ను ఎత్తేశాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం .మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం.
మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు 10 శాతం కేటాయించాం. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎన్డీఏ పాలనలో రైతులకు అన్నీ మంచిరోజులే. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి సాంకేతికతను జోడిస్తున్నాం. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు వేస్తున్నాం. గంజాయి, డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాము. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకున్నాను. దేశంలో ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన మన్మోహన్ సింగ్ కు ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా మనం సంతాపం తెలపాలి.
గోదావరి జలాలతో తెలుగుతల్లికి జలహారతి
పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం నీటి భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. నదుల అనుసంధానంతో నీటి కొరత తీర్చి, కరువు లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము. వరదలతో గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. ఈ సంవత్సరం కృష్ణా నదికి వచ్చిన వరదలతో 800 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి – గోదావరి నుంచి 300 టీఎంసీల నీటిని ఒడిసిపట్టి బనకచర్లకు తరలిస్తే మన రాష్ట్ర ముఖచిత్రం మారిపోతుంది. ఆ దిశగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము.
కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రుణం తీర్చుకోలేము. వారు పార్టీ కోసం చేసిన సేవలు వెలకట్టలేనివి. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇస్తున్నాను. టీడీపీ సభ్యత్వాలు 90 లక్షలు దాటడం రికార్డు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా టీడీపీని అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ అభివృద్ధి అందించడమే లక్ష్యంతో ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పింఛన్ల పంపిణీ అనంతరం యలమందల గ్రామంలోని కోదండ రామాలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.