– ప్రభుత్వంపై పెరిగిన బాధ్యత
– కూటమికి కొంత సమయమిద్దాం
– సోషల్‌మీడియా సైనికులకు సంయమనం అవసరం
– తాజా ఎన్నికల ఫలితం తేల్చింది ఇదే
ఇప్పుడు నెగ్గిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తరువాత ఈ ఫలితాలను తప్పక విశ్లేషించి తీరాలి.
దాదాపుగా మొదటి నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రధానంగా వామపక్ష పార్టీల వారు.. లేదు అంటే ప్రముఖ విద్యావేత్తలు నెగ్గుతూ వుండేవారు. అటువంటి స్థితిలో జగన్ మోహన్ రెడ్డి పాలనా హయంలో జరిగిన రాయలసీమ పశ్చిమ, రాయలసీమ తూర్పు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడుకి మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న తీరు చూసిన తర్వాత, చదువుకున్న వర్గాలలో జగన్ రెడ్డి పాలనా తీరు పట్ల ఎంత వ్యతిరేకత పెరుగుతుంది అనేది స్పష్టం చేసింది.
అయినా రియలైజ్ అవ్వని వైసీపీ నాటి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేత ప్రెస్ మీట్ పెట్టించి.. ఈ ఓటమి మా మీద పెద్ద ప్రభావం చూపదు. ఎందుకంటే మా ఓటర్లు వేరే వున్నారు అనే అవివేకపు స్టేట్మెంట్ ఇప్పించి, ఇంకా ఇంకా నవ్వుల పాలు అయ్యారు. వాస్తవంగా నాటి ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే లోకేష్ యువ గళం పాదయాత్ర నడుస్తూ ఉంది.
రాష్ట్రంలో వున్న నిరుద్యోగ యువత, అలాగే వారి కుటుంబ సభ్యులకు నాటి లోకేష్ ప్రసంగాలు.. లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన తరువాత 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అని ఇస్తున్న వాగ్దానాలు.. చదువుకున్న యువత అలాగే చదువుకున్న అన్ని వర్గాల వారిని ఆలోచింపచేస్తూ ఉండడం కూడా, ఆనాటి గెలుపుకి కొంత దోహదం చేసింది. అదే ఒరవడి కొనసాగిస్తూ తరువాత జరిగిన సాధారణ ఎన్నికలలో కూడా.. చదువుకున్న వర్గాలు, అదే నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి పార్టీల పట్ల కనపరిచారు అనేది ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మనకు అందరికి తెలిసిందే.
ఇప్పుడు జరిగిన కృష్ణా గుంటూరు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానాలు కూడా కూటమి కైవసం చేసుకున్న తీరు.. అలాగే వారికి దక్కుతున్న అధిక్యతలు చూసిన తర్వాత ఆయా విద్యావంతుల వర్గాలలో ప్రభుత్వం పట్ల వారి నమ్మకం చెక్కుచెదరలేదు అని స్పష్టం అవుతోంది. అదే సమయంలో ఈ ఫలితాలు చూసిన తర్వాత ప్రభుత్వ బాధ్యత, కూటమి పార్టీల బాధ్యత మరింత పెరిగింది అనేది వాస్తవం.
నేడు కౌన్సిల్ లో వున్న 5 పట్టభద్రుల స్థానాలకి 5 టీడీపీ చేతిలో వున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో వున్న మొత్తం విద్యావంతులకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా టీడీపీ తన బాధ్యతను సక్రమంగా నిర్వహించి తీరాలి. యువతకు లోకేష్ పాదయాత్ర సందర్భంగా.. కూటమి ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్ధానం చేసిన విధంగా 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి. అంటే కనీసం 25-30 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించాలి.
అలా రప్పించాలి అంటే సమర్ధ పాలన.. మెరుగైన పాలసీలు.. మంచి రోడ్, పోర్ట్, పవర్, ఎయిర్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మెరుగైన మానవ వనరులు వుండి తీరాలి. అన్నిటికన్నా ముఖ్యంగా శాంతి భద్రతలు వుండి తీరాలి. ఖచ్చితంగా చంద్రబాబు అనుభవం, వారి పాలనాదక్షత కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ లక్ష్యం చేరుకోవడం కష్టం కాదు.
కానీ అది సాధించే క్రమంలో మనం అందరం ఏరి కోరి తెచ్చుకున్న ఈ ప్రభుత్వానికి అలాగే చంద్రబాబు కి మన అందరి నైతిక మద్దతు అవసరం. మన నాయకత్వంతో ఏదైనా అభిప్రాయభేదాలు వున్నా, వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుందాం. ప్రజల ఆశలు ఆకాంక్షలు ఎలా వున్నాయి అని స్పష్టం అవుతున్న నేపథ్యంలో, మనం మన నాయకత్వం విషయంలో కొన్నాళ్ళు, బహిరంగంగా వ్యతిరేకత అయినా.. అసంతృప్తి అయినా వ్యక్తం చేయకుండా ఉంటే బెటర్ అని నా సూచన.
నాకు వున్న సమాచారం మేరకు స్పష్టమైన అవగాహన మేరకు, నూటికి నూరుశాతం మనం అందరం కోరుకునే దుష్ట శిక్షణ కూడా జరిగి తీరుతుంది. కాకుంటే పెద్దలు వారి విధానంలో పూల్ ప్రూఫ్ గా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఆచరణలో కూడా పెడుతున్నారు. కాబట్టి నా సహచర పార్టీ సోషల్ మీడియా సైనికులకు నా వినమ్ర పూర్వక అభ్యర్థన ఏంటంటే.. మనం ఖచ్చితంగా సంయమనం పాటిద్దాం.. మన నాయకుడు- మన ప్రభుత్వం పట్ల అదే ప్రేమ కొనసాగిద్దాం.
– చైతన్య