– త్యాగధనులకు సీటు దక్కేనా?
– టికెట్లు దక్కని కులాలకు చాన్సు ఇస్తారా?
– పార్టీకి పనిచేసిన వారిని అందలమెక్కిస్తారా?
– గతంలో ఎవరూ ఊహించనివారిని ఎంపిక చేసిన నాయకత్వం
– సీనియర్లు, పొలిట్‌బ్యూరోలో చర్చ తర్వాతనే ఎంపిక
– ఈసారి పొలిట్‌బ్యూరో నిర్ణయమా? సొంత ఎంపికనా?
– పెరుగుతున్న ఆశావహుల జాబితా
– అందరి చూపూ బీద, బీటీ నాయుడు, రాజు, వర్మ, వంగవీటి, ఉమ వైపే
– కాపులలో వర్మ, వంగవీటి, బూరగడ్డలో ఎవరికి చాన్స్?
– దళిత కోటాలో జవహర్, పనబాక
– జనసేన నుంచి నాగబాబు ఖరారు
– ఒక సీటు కోరుతున్న బీజేపీ
– వచ్చేది ఐదు.. దక్కేది ఎవరికో?
(మార్తి సుబ్రహ్మణ్యం)
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి భారీ సంఖ్యలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్ల కోసం టీడీపీలో పోటీ మొదలయింది. ఖాళీయిన ఐదు స్థానాలూ కూటమి ఖాతాలోకే వెళ్లనుండటంతో ఈ పోటీ పెరిగింది. ఇందులో ఒకటి జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఖరారు చేశారు. దానితో టీడీపీ కోటాలో నాలుగు స్థానాలు దక్కుతాయి. అందులో ఒకటి బీజేపీ కోరుతున్నప్పటికీ, ఈసారి ఆ పార్టీకి ఇచ్చే అవకాశాలు లేవంటున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీలయిన యనమల రామకృష్ణుడు, బిటి నాయుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పరుచూరి అశోక్ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం రిటైరయిన సిట్టింగ్ ఎమ్మెల్సీలకు మళ్లీ రెన్యువల్ అవకాశం లేదని తెలుస్తోంది.
వీరిలో సీనియర్ అయిన యనమలకు సైతం రెన్యువల్ చేయరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈపాటికే ఆయన అల్లుడు , కూతురు, వియ్యంకుడికి ఎంపి, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినందున ఇక ఆయన అవకాశాలకు తెరపడినట్లేనంటున్నారు. పైగా ఇటీవల ఆయన పార్టీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అదీకాకుండా.. లోకేష్‌కు పగ్గాలు అప్పగించే క్రమంలో సీనియర్లను క్రమంగా తప్పించి, యువకులకు అవకాశాలు కల్పించాలని నిర్ణయించినందున.. ఇకపై యనమల వంటి సీనియర్లకు విశ్రాంతి అనివార్యంగా కనిపిస్తోంది.
ఇదిలాఉండగా, మాజీ ఎమ్మెల్సీ బీద ర విచంద్ర, మంతెన సత్యనారాయణరాజు, మాజీ మంత్రి కేఎస్ జవహర్, తాజాగా రిటైరయిన బిటి నాయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, వర్మ, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య, టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జి కోనేరు సురేష్ సీట్లు ఆశిస్తున్నారు.
కాగా ప్రస్తుత టీటీడీ బోర్డు సభ్యురాలైన కేంద్రమాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా సీటు ఆశిస్తున్నారు. టీటీడీలో ఆమె సంతృప్తిగా లేరని, అందుకే ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నట్లు చెబతున్నారు. టీటీడీ అధికారుల వ్యవహారశైలిపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన తనకు టీటీడీ అధికారులు తగిన గౌరవం ఇవ్వడం లేదన్న అసంతృప్తే దానికి కారణమంటున్నారు.
అయితే మాజీ మంత్రి జవహర్‌కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వనందున, ఆయన పార్టీకి రాజీనామా చేసే ప్రయత్నం చేశారు. దానితో జవహర్ ను పిలిపించిన నాయకత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఈ సీటు మాల వర్గానికి చెందిన పనబాక లక్ష్మికి దక్కుతుందా? లేక మాదిగ వర్గానికి చెందిన జవహర్‌కు దక్కుతుందో చూడాలి. పార్టీ వర్గాలు మాత్రం జవహర్‌కే ఎక్కువ అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వర్గీకరణ వ్యవహారం చర్చల్లో ఉన్న సమయంలో, మాదిగ వర్గానికి చెందిన ఆయనకు సీటు ఇవ్వడం ద్వారా ఆ వర్గాలను మెప్పించే అవకాశం ఉందంటున్నారు.
ఇక గత ఎన్నికల్లో సీటు ఆఫర్ చేసినా పోటీ చేయకుండా, రాయలసీమ ఎన్నికల ఇన్చార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు, యాదవ కోటాలో ఎమ్మెల్సీ లభించే అవకాశం కనిపిస్తోంది. యనమల రిటైర్ అవడం కూడా ఆయనకు సానుకూల అంశంగా మారింది. నాయకత్వం ఎలాంటి బాధ్యత అప్పగించినా దానిని పూర్తి చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకున్న బీదకు అన్ని వర్గాల్లోనూ సానుభూతి ఉండటం విశేషం. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న బీద.. ఇటీవలి ఎన్నికల సమయంలో, నియోజకవర్గాల్లో టికెట్ల నేపథ్యంలో స్థానికంగా కూటమి మధ్య నెలకొన్న విబేధాలను సమర్ధవంతంగా పరిష్కరించారు.
ఆయనతోపాటు గత ఎన్నికల్లో జోనల్ ఇన్చార్జిగా పనిచేసిన మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజుకు సైతం.. సీటు ఇవ్వటం న్యాయమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఎన్నికల ముందు రాజు కూడా టికెట్ ఆశించకుండా, బీద రవిచంద్ర మాదిరిగానే అభ్యర్ధులు-పార్టీ నాయకత్వం మధ్య వారధిగా వ్యవహరించారు. స్థానిక వివాదాలను పరిష్కరించారు. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న మంతెనకు సీటు ఇవ్వాలని క్షత్రియ సామాజికవర్గ నేతలు సైతం కోరుతున్నారు. అయితే ఈసారి క్షత్రియ కోటా ఉంటుందా? ఉండదా అన్న అంశంపైనే మంతెన భవితవ్యం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మంతెనకు సైతం బీద రవిచంద్ర మాదిరిగానే అందరివాడన్న పేరున్న విషయం తెలిసిందే.
ఇక కాపు కోటాపైనే పీటముడి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ సీటు ఆశిస్తున్నారు. వీరిలో పవన్ కల్యాణ్‌కు పిఠాపురం సీటివ్వడంతో, వర్మకు అన్యాయం జరిగిందన్న భావన కార్యకర్తల్లో నాటుకుపోయింది. పైగా ఇటీవలి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో, ఆయన పేరు కూడా లేకపోవడంతో వర్మపై సానుభూతి మరింత పెరిగింది. ఈ క్రమంలో ఈసారయినా వర్మకు ఎమ్మెల్సీ సీటు దక్కుతుందా లేదా అన్న దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కూడా కాపు కోటాలో సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ లభించని కారణంగా.. రాజీనామా చేయబోయిన ఆయనను నాయకత్వం బుజ్జగించి, అధికారంలోకి వచ్చిన తర్వాత, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కృష్ణా జిల్లా కాపువర్గాల్లో బూరగడ్డ కూడా ఒక బలమైన నాయకుడే.
ఇక కాపు నేత దివంగత వంగవీటి రంగా తనయుడైన వంగవీటి రాధాకు, కాపు కోటాలో ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం చాలాకాలం నుంచి వినిపిస్తున్నదే. గత ఎన్నికల్లో రాధా కూడా వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ముగ్గురిలో ఇమేజ్ పరంగాచూస్తే వంగవీటి రాధానే సహజంగా ముందువరసలో ఉంటారు. కాపు కోటా భర్తీనే పార్టీనాయకత్వానికి పరీక్షగా పరిణమించింది.
కమ్మ కోటా నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమ సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ పార్టీ అప్పగించిన బాధ్యత నిర్వర్తించారు. తాజాగా గుంటూరు-కృష్ణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సహాయ నిరాకరణ చేసిన నేపథ్యంలో, ఉమ పొన్నూరుకు వెళ్లి నరేంద్రను బుజ్జగించి అక్కడ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సీటు వస్తుందా? రాదా అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాదిగ కోటాలో సీటు ఆశిస్తున్నారు. గతంలో ఆయనకు రాజ్యసభ అవకాశం చేజారిపోయిన విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో ఆయన తనయుడి కి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినందున, ఈసారి వర్లకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా? లేక యనమలకు ఇచ్చిన అవకాశాన్ని ఆయనకూ కొనసాగిస్తారా అన్నది చూడాలి.
బీసీ వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, బాబుకు వీరవిధేయుడైన బుద్దా వెంకన్న కూడా సీటు ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీపై ధైర్యంగా విరుచుకుపడ్డవారిలో ఒకరైన వెంకన్నకు శ్రేణుల్లో సానుభూతి ఉంది. పైగా గత ఎన్నికల్లో ఆయన విజయవాడ సీటు ఆశించినప్పటికీ దానిని బీజేపీకి కేటాయించడంతో, అక్కడ సుజనాచౌదరి విజయం సాధించారు. ప్రతిపక్షంలో ఉండగా బాబు కోసం, బుద్దా వెంకన్న తన రక్తంతో గోడపై బాబు పేరుతో సంతకం చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
కాగా బీసీ కోటా నుంచి తాజాగా రిటైరయిన బిటి నాయుడు కూడా సీటు ఆశిస్తున్నారు. బోయ వర్గానికి చెందిన నాయుడు, మళ్లీ రెన్యువల్ కోసం సీరియస్‌గా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఎవరికీ రెన్యువల్ చేయకూడదన్న విధాన నిర్ణయం తీసుకుంటే, ఆయనకు అవకాశాలు మూసుకుపోయినట్లే అంటున్నారు.
ఇక గత ఎన్నికల్లో వైసీపీ నమోదు చేయించిన వేలాది దొంగ ఓట్లను తొలగించడంలో కీలకపాత్ర పోషించిన టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జి కోనేరు సురేష్ కూడా సీటు ఆశిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓట్ల ఏరివేత, ఆమేరకు నాయోజకర్గాలవారీగా కార్యకర్తలకు శిక్షణ ఆయన ఆధ్వర్యంలో జరిగిన విషయం తెలిసిందే. గత ఎన్నికల సమయంలో వైసీపీెఅక్రమాలపైై మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య, సురేష్ ఈసీకి ఫిర్యాదుచేయడంలో ప్రముఖపాత్ర వహించారు. అధికారం వచ్చిన తర్వాత మాజీ ఐఏఎస్ కృష్ణయ్యకు పీసీబీ చైర్మన్ ఇచ్చినందున, అవే బాధ్యతలు నిర్వహించిన సురేష్ ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు.
కాగా ఈసారి ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న వారిలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు చె ందిన వారే ఎక్కువమంది ఉండటం విశేషం. కాపు నేతలయిన వంగవీటి రాధా, బూరగడ్డ వేదవ్యాస్, మాదిగ వర్గం నుంచి వర్ల రామయ్య, బీసీ వర్గం నుంచి బుద్దా వెంకన్న, కమ్మ సామాజికవర్గం నుంచి దేవినేని ఉమ, కోనేరు సురేష్ అదే జిల్లా వారు కావడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. బీద రవిచంద్ర, జవహర్, వంగవీటి రాధా, మంతెన సత్యనారాయణరాజు, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి సీట్లు దక్కుతాయో చూడాలి. కమ్మ వర్గం నుంచి ఈసారి అవకాశం ఉంటుందా? లేదా? అన్న అంశంపైనే దేవినేని ఉమ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఇదిలాఉండగా, బీజేపీ సైతం తమకూ ఒక సీటు కావాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో.. అది బీజేపీకే ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించినందున, ఈసారి ఎమ్మెల్సీ స్థానం బీజేపీకి ఇవ్వకపోవచ్చంటున్నారు.
‘కాపు’కాసేదెవరికి?
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు కోటా ఎవరిని వరిస్తుందన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పొత్తులో నష్టపోయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అంశంపైనే రాజకీయ వర్గాల్లో ఆసక్తి కనిపిస్తోంది. జనసేన నుంచి కాపు వర్గానికి చెందిన నాగబాబు పేరు ఇప్పటికే ఖరారయింది. దానితో మళ్లీ టీడీపీ కూడా కాపులకు సీటు ఇస్తుందా? లేదా? అన్నదే ఆ చర్చల సారాంశం.
మరోవైపు.. పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో, మళ్లీ అక్కడి నుంచే వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చే సాహసం చేస్తుందా? ఒకవేళ వర్మకు సీటు ఇస్తే, నియోజకవర్గంలో సమాంతర వ్యవస్థకు కారణమవుతుందన్న ముందుచూపుతో, అనవసర ప్రయోగం ఎందుకని వర్మను పక్కనబెడుతుందా అన్న చర్చ జరుగుతోంది. ఇక కాపులలో ఎక్కువ ఇమేజ్ ఉన్న వంగవీటి రాధాకు ఇవ్వకపోతే కాపులలో రియాక్షన్ ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చ జరుగుతోంది. రాధా పార్టీలోనే ఉన్నప్పటికీ, వంగవీటి వారసత్వ స్థాయిలో ఆయన చురుకుగా లేకపోవడం కొంత మైనస్ పాయింటని చెబుతున్నారు. ఏతావతా.. పవన్ కల్యాణ్ లాంటి ‘పెద్ద కాపు’ వెంట ఉన్నందున, కాపు కోటాను నాగబాబుతో సరిపెడుతుందా? లేక ‘ముందుచూపు’ కోణంలో వంగవీటి రాధా లాంటి కాపు నేత కు సీటిస్తుందో చూడాలి.
అందరి చూపు బాబు వైపే
కాగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిన నేపథ్యంలో పార్టీ నేతలు అధినేత, సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రచారంలో ఎంతమంది పేర్లు వినిపిస్తున్నప్పటికీ చంద్రబాబు-లోకేష్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. అయితే కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు పాత సంప్రదాయం ప్రకారం.. పొలిట్‌బ్యూరో అభిప్రాయం తీసుకుని అభ్యర్ధుల ఎంపిక చేస్తారా? లేదా గత ఏడాది నుంచి జరుగుతున్నట్లే.. బాబు-లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ ఊహించని వారిని అభ్యర్ధులుగా ప్రకటించి, ఆశ్చర్యపరిచిన చరిత్ర ఉంది. ఈసారి కూడా అంతే ఉంటుందా? లేదా అందుకు భిన్నంగా ఉంటుందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. అందులో భాగంగా.. ఇప్పటివరకూ అసలు చట్ట సభల్లో అవకాశాలు రాని వర్గాలకు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇస్తారా? లేదా అన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.