Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ బడ్జెట్.. సాధ్యాసాధ్యాలు

అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా, రాష్ట్రాన్ని ఆర్ధికంగా పరిపుష్టం చేయాలనే ధ్యేయంతో రూ.3,22,359 కోట్లతో 2025-26 సంవత్సరానికి రాష్ట్ర ఆర్ధిక పద్దును ఎన్డీయే ప్రభుత్వం ఆవిష్కరించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఫిబ్రవరి 28న శాసన సభలో ప్రవేశ పెట్టారు.

రాష్ట్ర గతిని, స్థితిని మార్చే సానుకూల, ప్రగతిశీల బడ్జెట్ను ప్రవేశ పెట్టామని, ఇది ఆంధ్రప్రదేశ్ పునాదిగా నిలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు, అయితే బడ్జెట్ మోసాల పద్దని. సూపర్ సిక్స్ హామీలను విస్మరించారని, కలర్ ఎక్కువ కంటెంట్ తక్కువని విపక్షం విమర్శిస్తోంది. సంక్షేమానికి, అభివృద్ధికి, ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు సమ ప్రాధ్యాన్యత నిస్తూ స్వర్ణాంధ్ర విజన్-2047 సాకారం దిశగా ప్రయత్నం ఆరంభించామని అధికార పక్షం దీటుగా జవాబిస్తోంది.

అభివృద్ధి దిశగా..

గత బడ్జెట్ తో పోలిస్తే ప్రస్తుత బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయింపులు పెరిగాయి. రాష్ట్ర జీవనాడి పోలవరంకు రూ.6,705 కోట్లు, గ్రోత్ ఇంజన్ అమరావతికి రూ.6000 కోట్లు కేటాయించడం వలన వాటి నిర్మాణం వేగం పుంజుకుంటుంది. అభివృద్ధి ఉంటేనే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగాలంటే మూలధన వ్యయం పెరగాలి. ఏటా నిలకడగా 15శాతానికి పైగా జి ఎస్ డి పి వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాన్ని చేరేందుకు రూపొందించిన పది మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా బడ్జెట్లో ఏకంగా రూ.40,635 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించడం ఒక సాహసమనే చెప్పాలి.

ఆర్ధిక వ్యవస్థకు ఇరుసు లాంటి వ్యవసాయాన్ని ప్రాధమిక రంగంగా గుర్తించి అన్నదాతలకు అండగా, సేద్యానికి వెన్నుదన్నుగా నిలిచేలా రూ.48,341.14 కోట్లతో (గత ఏడాది కంటే రూ.4,939 కోట్లు అధికం) వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 22.86శాతంగా నమోదయ్యిందని, రానున్న ఆర్ధిక సంవత్సరంలో వృద్ధి రేటును మరింత పెంపుదల చేసే లక్ష్యంతో పనిచేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం రూ.12,773.25 కోట్లను, అలాగే ఉచిత పంటల భీమా, వ్యవసాయ అనుబంధ రంగాలకు సముచిత నిధులు కేటాయించడం వలన రైతులకు ప్రయోజనం దక్కునుంది. కీలకమైన పాఠశాల విద్య, ఉన్నత విద్య (రూ.34,311 కోట్లు), వైద్య ఆరోగ్యం (రూ.19,265 కోట్లు), పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి (రూ.18,847 కోట్లు), జలవనరులు (రూ.18,019 కోట్లు), పట్టణాభివృద్ధి (రూ.13,862 కోట్లు), ఇంధన (రూ.13,600 కోట్లు), రోడ్లు భవనాలు (రూ.8,785 కోట్లు), గృహ నిర్మాణ (రూ.6,318 కోట్లు) శాఖలకు 2025-26 ఆర్ధిక పద్దులో రూ.1,33,007 కోట్లు కేటాయించడం శుభ పరిణామం.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పించడం వలన 46 వేల పాఠశాలలకు విద్యుత్ భారం నుండి విముక్తి కలుగుతుంది. గత ప్రభుత్వంలో వలె కాకుండా తమ పరిధిలో చేసిన పనులకు తామే చెల్లించుకునే ఆర్ధిక స్వేచ్ఛను నగరపాలక సంస్థలు,మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించినందువలన పనులలో వేగం పెరిగే అవకాశం ఉంది.

గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన కేంద్ర ప్రాయోజిత పధకం జలజీవన్ మిషన్ ను రూ.2,800 కోట్లతో అమలు చేసి ఇంటింటికి మంచి నీరు అందించేందుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. పి-4 విధానంలో చేపట్టే పనులకు 20 శాతం వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడం కోసం రూ. 2000 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడం ఒక వినూత్న విధానం.

సంక్షేమం.. సూపర్-6

బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచి వారిని ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా బలోపేతం చేయాలనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా బిసి సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయించి అగ్రతాంబూలం ఇచ్చారు. అలాగే షెడ్యూలు కులాల సంక్షేమం కోసం రూ.20,281 కోట్లు, షెడ్యూలు తెగల కోసం రూ.8,159 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం రూ.5,434 కోట్లు కేటాయించి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలుస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం పునరుద్ఘాటించింది.

ఎన్టీఆర్ భరోసా పింఛనుల కోసం రూ.27,518 కోట్లు కేటాయించారు. సూపర్-6లో అమలులో భాగంగా ఇప్పటికే అమలు చేస్తున్న దీపం 2.0 పధకానికి రూ.2,801 కోట్లు, త్వరలో ప్రారంభిస్తున్న మరో రెండు పధకాలు ‘తల్లికి వందనం’ కోసం రూ.9,407 కోట్లు, ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ కలిపి రూ.9,400 కోట్లు కేటాయించడం ద్వారా ఎన్నికల హామీల అమలులో మరో ముందడుగు వేశారు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా పధకం అమలు చేసి నాణ్యమైన వైద్యం సత్వరం అందించడానికి ప్రభుత్వం సంకల్పించడం వలన ప్రజలకు ఆరోగ్య భరోసా లభిస్తుంది.

భయపెడుతున్న అప్పులు..రెవెన్యూ లోటు.. ద్రవ్య లోటు

బడ్జెట్ గణాంకాలు ఆకర్షణీయంగా ఉన్నా ఆచరణలో అవి వాస్తవ రూపం దాల్చడం లేదనేది గత అనుభవాల సారాంశం. 2021-22 నుండి 2024-25 వరకు బడ్జెట్లలో ప్రతిపాదిత రూ.10,59,742.35 కోట్లకు గాను చేసిన ఖర్చు రూ.9,45,610.13 కోట్లు. అంటే ప్రతిపాదిత బడ్జెట్లో సుమారు 89 శాతం మాత్రమే వాస్తవంగా ఖర్చు చేస్తున్నారు. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు కూడా ఏటికేడు పెరుగుతోంది. 2023-24లో రూ.38,682 కోట్లు ఉన్న రెవెన్యూ లోటు 2024-25 నాటికి రూ.48,311 కోట్లకు .. రూ.62,719 కోట్లు ఉన్న ద్రవ్య లోటు రూ.73,362 కోట్లకు పెరిగింది.

పరిస్థితి ఇలా ఉన్నప్పుడు బడ్జెట్ గణాంకాలలో పేర్కొన్న విధంగా రెవెన్యూ లోటును రూ.33,185 కోట్లకు (జి ఎస్ డి పిలో 1.82%) పరిమితం చేయడం అత్యంత కీలకం. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.9,74,556 కోట్ల అప్పులతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆర్ధిక శ్వేతపత్రంలో వివరించారు. అప్పులు చేసినా ఆస్తులు సృష్టించకుండా రెవెన్యూ వ్యయానికి ఎక్కువ ఖర్చు పెట్టడం వలన రాబడి పెరగకపోగా రుణభారం పెరిగిపోయింది.

2020-21లో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు, వడ్డీల రూపంలో చెల్లించాల్సిన మొత్తం రూ.33.752.91 కోట్లు అయితే వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.59,428.28 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కార్పొరేషన్ రుణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈమొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 77 శాతం బహిరంగ మార్కెట్ రుణాలు, 21 శాతం కేంద్ర ప్రభుత్వ రుణాలు, 2 శాతం ఇతర మార్గాల ద్వారా అన్ని రుణాలు కలిపి రూ .1.04 లక్షల కోట్లు (నెలకు రూ.8,580 కోట్లు) అప్పుల సమీకరిస్తామని తెలిపారు.

అప్పుల సమీకరణలో ఇబ్బందులు లోకపోయినా రెవెన్యూ వసూళ్లు పెంచడమే పెద్ద సవాలు. రెవెన్యూ వసూళ్లలో 2023-24 నుండి 2024-25 నాటికి వృద్ధి రూ.2,264 కోట్ల మాత్రమే. గత బడ్జెట్ రెవెన్యూ వసూళ్ల అంచనాలలో కూడా రూ.14 వేల కోట్లు సమీకరించడం సాధ్యం కాలేదు. అటువంటి పరిస్థితిలో ప్రస్తుత బడ్జెట్లో పేర్కొన్న విధంగా (గత బడ్జెట్ కన్నా రూ.41,945 కోట్లు అధికం) రూ.2,17,976 కోట్లు రెవెన్యూ రాబడి సాధించాలంటే ఇంతవరకు వస్తున్న సగటు నెల రాబడిని రూ.12,857 కోట్ల నుండి రూ.18 వేలకు పెంచుకోగలిగితేనే సాధ్యమవుతుంది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జి ఎస్ డి పి) పెరుగుదల, మూలధన వ్యయాన్ని పెంచడం, గత ప్రభుత్వ హయాంలో నిలిపివేసిన 95 కేంద్ర ప్రాయోజిత పధకాలను (74 పథకాలు పునఃప్రారంభం) పట్టాలెక్కించడం, నిర్మాణ రంగం పెరగడం, పెట్టుబడుల ఆకర్షణ వంటి వాటి వల్ల జీఎస్టీ, ఇతర రాబడులు పెరిగి ఆదాయం వృద్ధి చెందుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఇక రాష్ట్ర జి ఎస్ డి పి 2021-22 సంవత్సరానికి 11,31,629 కోట్లు మాత్రమే ఉండగా గత ఏడాదిలో 12.94శాతం వృద్ధి నమోదుతో రూ.16.06 లక్షల కోట్లకు చేరిందని 2024-25 ఆర్ధిక సర్వే వెల్లడించింది.

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 16.16శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా జి ఎస్ డి పి 18.65 లక్షల కోట్లు, తలసరి ఆదాయాన్ని రూ.3.11 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్షిస్తోంది. ఇక ఆర్ధిక వ్యవస్థ క్రమశిక్షణకు రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు గీటు రాళ్లు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు పెరగకుండా ఆర్ధిక క్రమశిక్షణను పాటిస్తూ, అప్పులను నియంత్రించి మూలధన వ్యయాన్ని పెంచడమే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రధానమైన అంశం.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మొత్తం రుణాలను తక్కువ శాతానికి పరిమితం చేయడం ఎంతో ముఖ్యం. రాష్ట్ర ఆర్ధిక పరిమితులకు లోబడి అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధ్యాన్యత ఇస్తూ, ఎన్నికల హామీలను నెరవేర్చే లక్ష్య సాధనలో బడ్జెట్ ముందడుగని చెప్పవచ్చు. మౌలిక సౌకర్యాల కల్పన, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, పారిశ్రామిక, సేవా తదితర రంగాల్లో వృద్ధి సాధించడం మరియు ఆర్ధిక, మానవ వనరుల సద్వినియోగంతో రాష్ట్రాన్ని బలమైన ఆర్ధిక శక్తిగా మార్చాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం విజయం సాధిస్తే రాష్ట్రాభివృద్ధికి రాచబాట పడినట్లే.

– లింగమనేని శివరామ ప్రసాద్
(రాజకీయ, సామాజిక విశ్లేషకులు)
– 7981320543

LEAVE A RESPONSE