Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలు టీటీడీ పట్టించుకోవడం లేదు

– మీ ఆదేశాలను టీటీడీ అధికారులు ఖాతరు చేయడం లేదు
– తెలంగాణ భక్తులు ఇబ్బంది పడుతున్నారు
– ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ

హైదరాబాద్: ఇటీవ‌ల ఏపీ స‌ర్కారు ఇచ్చిన మార్గ‌ద‌ర్శకాల ప్ర‌కారం, తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తిరుప‌తి దేవుడి దర్శనం కోసం సిఫార్సు లేఖలు ఇవ్వడానికి అనుమతించబడినందుకు తాము సంతోషంగా ఉన్నామ‌ని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. అయితే, టీటీడీ అధికారులు ఏపీ ముఖ్యమంత్రి ఆదేశాలను సరిగ్గా పట్టించుకోవడం లేదని చంద్ర‌బాబుకి నివేదించారు. ఈ విషయమై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో సురేఖ రాశారు.

తెలంగాణ ప్రజాప్రతినిధులు, తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడి భక్తులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. టీటీడీ అధికారులు తెలంగాణ భ‌క్తుల‌ను అనుమ‌తించ‌క‌పోవ‌డంపై తీవ్ర గందరగోళం నెల‌కొంటుంద‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు దృష్టికి మంత్రి సురేఖ తీసుకెళ్ళారు. ఈ విషయాన్ని వెంటనే ప్ర‌త్యేకంగా పరిశీలించి, సదరు ఆదేశాలను సక్రమంగా పాటించేలా టిటిడి అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ప్ర‌త్యేకంగా విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విష‌యంలో చంద్రబాబు జోక్యం తెలంగాణకు చెందిన చాలా మంది భక్తులలో ఆనందాన్ని నింపుతుంద‌ని నివేదించారు.

తెలంగాణ నుండి తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య ఈ మ‌ధ్య బాగా పెరిగిందని, రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా, తెలుగు ప్రజల భక్తి… ముఖ్యంగా తెలంగాణ ప్ర‌జ‌ల భ‌క్తి తిరుమ‌ల తిరుప‌తి వేంక‌టేశ్వ‌రుడిపై తగ్గలేదని మంత్రి నొక్కి చెప్పారు.

LEAVE A RESPONSE