-
తాజా భేటీపై చర్చ లాంటి రచ్చ
-
కేసుల విచారణపై ప్రభావం చూపుతుందన్న వాదన
-
ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మోహన్‌బాబు
-
పోలీసుస్టేషన్‌లో తండ్రీకొడుకుల పరస్పర ఫిర్యాదులు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సినీ నటుడు మోహన్‌బాబు, ఆయన తనయుడు విష్ణు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దానిపై విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపి, సినీ నటుడిగా మోహన్‌బాబును సీఎం కలవడంలో ఏమాత్రం తప్పు లేదు. పైగా ఆయన తనయుడి సినిమా కన్నప్ప ప్రమోషన్‌లో భాగంగా సీఎంను కలసి ఉండవచ్చు. అది కూడా తప్పు కాదు.
ఈమధ్య కాలంలో పాన్‌ఇండియా సినిమాల ప్రమోషన్లు ఇలాగే ఉంటున్నాయి. ఆయా సినిమాల హీరో, దర్శకులు ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకూ వెళ్లి వారితో ఫొటోలు దిగుతున్నారు. సినిమా వాళ్లు ఎప్పటికయినా పనికివస్తారన్న కోణంలో రాజకీయ నాయకులు.. ప్రభుత్వంలో ఉన్న వాళ్లను కలిస్తే లాభమన్న కోణంలో సినిమా వాళ్లూ ఆలోచిస్తారు. సరే ఎవరి కోణం వారిది.
కానీ ఇప్పుడు మోహన్‌బాబు-ఆయన తనయుడు విష్ణు ఉన్న పరిస్థితి వేరు. అదే ఈ రచ్చలాంటి చర్చకు అసలు కారణం. మోహన్‌బాబు తనయులైన విష్ణు-మనోజ్ మధ్య చాలాకాలం నుంచి ఘర్షణలు జరుగుతున్నాయి. అందులో మోహన్‌బాబు తొలి నుంచి విష్ణుతో ఉంటుండగా, మరో కుమారుడు మనోజ్ విడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఫాంహౌస్ కోసం కుటుంబంలో విబేధాలు రోడ్డెక్కి ..అవి పోలీసుస్టేషన్లు, కోర్టుల వరకూ వెళ్లాయి. పైగా మోహన్‌బాబుపై జర్నలిస్టులను కొట్టిన కేసు నమోదవగా, ఆయన కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. ఇక తిరుపతిలో కేసుల కథ తెలిసిందే. ప్రస్తుతం మోహన్‌బాబు కుటుంబంపై పోలీసుస్టేషన్‌లో కేసులు విచారణలో ఉన్నాయి.
ఈ క్రమంలో ఒక వర్గంగా ఉన్న మోహన్‌బాబు-విష్ణు స్వయంగా ముఖ్యమంత్రిని కలిస్తే, దాని ప్రభావం పోలీసుల విచారణపై పడుతుందన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. తండ్రీకొడుకులు స్వయంగా సీఎంనే కలిశారు కాబట్టి, పోలీసుల విచారణ నిష్పక్షపాతం ఎలా ఉంటుంది? సీఎం దగ్గర పలుకుబడి ఉంది కాబట్టే వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చినందున, ఇక వారిపై భవిష్యత్తులో నిష్పాక్షిక విచారణ- చర్యలకు పోలీసులు ఎందుకు సాహసిస్తారు? మరో కొడుకు మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ సానుకూలంగా ఎలా జరుగుతుంది? రేపు మనోజ్ మళ్లీ తండ్రి, సోదరుడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు దానిని సీరియస్‌గా తీసుకుంటారా? ఇవన్నీ పోలీసుల విచారణపై ప్రభావితం చేసేవే కదా? అన్నది ఇప్పుడు ఇటు సినిమా-అటు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
మోహన్‌బాబు కుటుంబంపై కేసులు, కోర్టుల విచారణ, బెయిల్ వ్యవహారం తెలిసినందున.. సీఎంఓ అధికారులు ఆ కోణంలో ఆలోచించి, అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ఉండే సరిపోయేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి మోహన్‌బాబు అండ్ సన్ వచ్చింది.. మర్యాదపూర్వకంగా.. సినిమా ప్రమోషన్ కోసమే.. అయినప్పటికీ, ప్రజల్లో వేరే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుందన్నది రేవంత్‌ను అభిమానించేవారి వాదన. విమర్శలకు తావిచ్చే ఇలాంటి కీలక అంశాలపై సీఎంఓ అధికారులు, సీఎం అపాయింట్‌మెంట్ వ్యవహారాలు చూసే వ్యక్తులు ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తున్నారు.
అయితే మోహన్‌బాబు ఇటీవల బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ సీఎంను కూడా కలిశారు కదా? అన్న ప్రశ్నలూ -వాదన తెరమీదకు రాకపోలేదు. కానీ గుజరాత్‌లో మోహన్‌బాబు కుటుంబంపై కేసులు లేవన్న విషయాన్ని విస్మరించకూడదని గుర్తు చేస్తున్నారు.