– గ్రామీణ ప్రాంతాల్లో సర్దుబాటు పేరిట విద్యుత్ కోతలు
– 5 నెలల్లో రూ.1,245 కోట్లు ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు
– ప్రభుత్వ తీరును చూసి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి
విజయవాడ : బొగ్గు కొరత సాకు చూపి రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్ గా మార్చవద్దని, థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలను దిగుమతి చేసుకుని ప్రజలకు విద్యుత్ సరఫరా చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి కోరారు. రూ.4.84కు వచ్చే పవన విద్యుత్ను కొనుగోలు చేయకుండా రూ.11.68 వెచ్చించి పక్క రాష్ట్రాల నుంచి థర్మల్ విద్యుత్ ఎందుకు కొంటున్నారని తులసిరెడ్డి ప్రశ్నించారు.
ప్రజల సొమ్ము పక్క రాష్ట్రాలకు పంచిపెడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరును చూసి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ వేస్తున్నాయని పేర్కొన్నారు. కరెంటు కోతలతో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు అల్లాడుతున్నాయని, వేసవి గాలులు ప్రారంభం కాకుండానే మూడు రోజులుగా అకస్మాత్తు విద్యుత్ అంతరాయాలతో గ్రామాలు ఉక్కపోతకు గురవుతున్నాయని ఆరోపించారు. పట్టణ ప్రాంతాల్లో కరెంటు కోతలు విధిస్తే వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయంతోనే విద్యుత్ పంపిణీ సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో సర్దుబాటు పేరిట విద్యుత్ కోతలు అమలు చేస్తున్నాయని, ఏకబిగిన ఏడేసి గంటలు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కొన్ని రోజులుగా విద్యుత్ డిమాండ్ సుమారు 200 మిలియన్ యూనిట్లుగా ఉంటోందని చెప్పారు. దీనికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో లోడ్ రిలీఫ్ పేరిట కోతలు విధిస్తున్నారని, ఈ నెల ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి ఉందని, కొన్ని రోజులుగా గ్రిడ్ గరిష్ఠ డిమాండ్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య సుమారు 11వేల 500 మెగావాట్లుగా ఉంటోందని పేర్కొన్నారు.
5 నెలల్లో రూ.1,245 కోట్లు మళ్లింపు
ప్రభుత్వం విద్యుత్తు బకాయిల పేరుతో రెండు విడతల్లో 12 వందల 45 కోట్ల ఆర్థిక సంఘం నిధుల మళ్లించినట్లు లెక్కలు చెబుతున్నాయని తులసి రెడ్డి పేర్కొన్నారు. పంచాయతీల బిల్లుల మంజూరు విధానాన్ని సీఎఫ్ఎంఎస్ పేరుతో కేంద్రీకృతం చేయడం వల్ల పల్లె ప్రభుత్వాల ఖర్చుకు కళ్లెం పడుతోందని, నిధులు మళ్లిస్తూ పోతే ఆదాయం తక్కువున్న పంచాయతీల మనుగడ కష్టమేనని వాపోయారు. పంచాయతీలు 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేయడానికి 2021 మార్చి నుంచి 2022 మార్చి వరకు కేంద్రం గడువు పొడిగించిందని, వీటిలో ప్రభుత్వం 344 కోట్ల 93 లక్షల్ని ఇప్పటికే విద్యుత్తు పంపిణీ సంస్థలకు జమ చేసిందన్నారు.
15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలోని పంచాయతీలకు 12 వేల 856 కోట్లు కేటాయించిందని, ఇందులో 2020-21, 2021-22లో పంచాయతీలకు విడుదల చేసిన 2 వేల 848 కోట్లలో దాదాపు 900 కోట్లు విద్యుత్తు పంపిణీ సంస్థలకు ఇటీవల సర్దుబాటు చేశారని, పంచాయతీల్ని నిధులు ఖర్చు చేయనివ్వకుండా బిల్లుల మంజూరు విధానాన్ని సీఎఫ్ఎంఎస్ పేరుతో కేంద్రీకృతం చేయడంలోనే హేతుబద్ధత లేదని తులసిరెడ్డి విమర్శించారు.