అంజద్ బాష మంత్రిగా కాదు.. జగన్మోహన్ రెడ్డికి నౌకరుగా పనిచేస్తున్నారు

– టీడీజీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్

మైనార్టీ మంత్రి అంజద్ బాష మైనార్టీ మంత్రిగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి నౌకరుగా పనిచేస్తున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాల గురించి పత్రికలలో ప్రముఖంగా ప్రచురితమైంది. రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్ బాష ఈ విషయంపై విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడడం అవివేకమే. మైనారిటీల సాధికారత కోసం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. రాష్ట్రంలోని మైనారిటీలకు ఎవరికీ దక్కని సాధికారత ఒక్క అంజద్ బాషాకే దక్కింది.

అంజద్ బాష కళ్ళు ఉండి కబోది లా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర మైనారిటీలు పడుతున్న కష్టాలు, ఇబ్బందుల పైన ఏరోజైనా ఒక్క సమీక్ష చేశారా? గత ప్రభుత్వ హయాంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆడపిల్లల పెళ్లి చేయడానికి ఏ కుటుంబం కూడా చితికి పోకూడదనే ఆలోచనతో ఎవరూ చేయని విధంగా చంద్రబాబు నాయుడు 50 వేల రూపాయలు షాదీ తోఫా పేరుతో అందించేవారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సమయంలో మైనార్టీల ఆడ పిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు అందిస్తామని చెప్పారు.

తన మేనిఫెస్టోలో కూడా పేర్కొన్నారు. ఆ అంశాలు ఇప్పుడు ఎక్కడికెళ్లాయో తెలపాలి. చంద్రబాబు నాయుడు హయాంలో మౌజన్లకు 3000 రూపాయలు, ఇమామ్లకు 5000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇమామ్లకు 5000 మౌజన్లకు 10,000 ఇస్తానని హామీ ఇచ్చిన జగన్ ఎంతమందికి ఇచ్చారో చెప్పాలి. రాష్ట్రంలోని షాదీ ఖానాలలో ఏ ఒక్క షాది ఖానా కైనా తట్టెడు మట్టి వేసి మరమ్మత్తులు చేశారేమో చెప్పాలి. మైనారిటీల సాధికారత ఒక్క వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అంజద్ బాషా, శాసనసభ్యులుగా ఉన్న వారికి తప్ప రాష్ట్రంలోని మైనారిటీలకు ఎటువంటి ఉపయోగం లేదు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు మైనారిటీ కార్పొరేషన్ పెట్టి వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి నిరుద్యోగ యువత వారి కాళ్లపై వారు నిలబడగలిగేట్లుగా చేశారు. వారికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలను వారే పోషించగలిగేలా చేశారు. దౌర్భాగ్యపు పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఛాన్సే లేకుండా చేశారు. అంజద్ బాషా మాట్లాడే మూటకపు మాటలను మైనార్టీ సోదరులు నమ్మరు. రాష్ట్ర మైనారిటీలు ఈ ప్రభుత్వాన్ని చూసి ఇదేమి ఖర్మ రా బాబు మాకు అని గగ్గోలు పెడుతున్నారు.

మైనారిటీలపై దాడులు, అఘాయిత్యాలు, అరాచకాలు ఎక్కువయ్యాయి. ఒక్క గుంటూరు జిల్లాలోని దాదాపు 100 కుటుంబాలు వాళ్ళ ఊర్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజమండ్రిలో ఒక అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే వైసిపి నాయకులు నిందితులఅండగా ఉండి బాధిత కుటుంబాన్ని చిత్రవధ చేశారు. రాష్ట్ర మైనారిటీ ప్రజలు ఒక్క ఛాన్స్ అని జగన్ చెప్పడంతో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మైనార్టీలు మదన పడుతున్నారు. మైనారిటీ నాయకులు హాఫీస్, ముస్తఫా తదితర నాయకులు మైనార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు. మైనారిటీల హాస్టళ్లు అధోగతి పాలయ్యాయి.

పేద ప్రజలకు కనీసం దుప్పట్లు కూడా లేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మైనారిటీ సంస్థలకు చెందిన వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఎక్కడికక్కడ అన్యాక్రాంతమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోందే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. గుంటూరు నగరంలో పట్టపగలు స్థానిక శాసనసభ్యుల ప్రమేయంతో మూడు ఎకరాల భూమి కబ్జా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైనారిటీ అమ్మాయికి దుల్హన్ పథకం వర్తింపు జరగాలంటే పదవ తరగతి చదివి ఉండాలి, 300 యూనిట్లు కరెంటు కంటే అధికంగా కరెంటు వాడకుండా ఉండాలి. ఇద్దరూ ఒకే రాష్ట్రం వాళ్ళై ఉండాలి లాంటి నిబంధనలు పెట్టి వారికి లబ్ది చేకూరకుండా చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఒక మైనారిటీ గాని ఇతర వర్గాల వారికి చెందిన ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే అదే నెలలో ఆ ఇంటికి నేనున్నానంటూ రెండున్నర లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని చంద్రబాబునాయుడు కల్పించారు. ప్రస్తుతం జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని ఏం చేశారో చెప్పాలి. ఎన్నికలకు ముందు ఇస్లామిక్ బ్యాంకు పెడతానన్న జగన్ ఇప్పుడు ఆ ఊసు ఎందుకు ఎత్తడం లేదో చెప్పాలి.

నిజంగా మైనారిటీలపై చిత్తశుద్ధి ఉంటే మైనారిటీల అభివృద్ధిని కాంక్షించాలి. వెంటనే ఇస్లామిక్ బ్యాంకును ప్రారంభించాలి. మసీదులకు మరమ్మత్తులు లేవు. చేయాలి. ఇప్పటికైనా అంజద్ భాష కళ్ళు తెరవాలి. మైనారిటీల సంక్షేమానికి నడుం బిగించాలి. సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి. అధోగతి పాలవుతున్న మైనారిటీలను ఆదుకోవాలి. ప్రభుత్వం మెడలు వంచైనా మైనార్టీల హక్కుల్ని సాధించాలి. మైనారిటీలకు అండగా ఉంటారని ఆశిస్తున్న వారిని అంజద్ బాష అండగా ఉండాలని తెలుగుదేశం తరపున డిమాండ్ చేస్తున్నామని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహ్మద్ తెలిపారు.