రైతుల నోట్లో మట్టిగొట్టి పరామర్శకు వెళుతున్నారా?

-వ్యవస్థలను కుప్పకూల్చి అవినీతిమయం చేశారు
-సాగునీటి ప్రాజక్టుల పేరుతో దండుకుని దివాళా తీయించారు
-కంపెనీల నుంచి కమీషన్లు నొక్కారు
-ప్రతి పథకంలో గోల్‌మాల్‌, దోపిడీ రాజ్యం
-అన్నింటా మీ కుటుంబమే బాగుపడింది
-తెలంగాణను భ్రష్టు పట్టించి… ఏ మొఖం పెట్టుకుని వస్తున్నారు?
-తొమ్మిదేళ్ల పాలనలో ఏ ఒక్కరినైనా ఆదుకున్నారా?
-కేసీఆర్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫైర్‌

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందిం చారు. తెలంగాణను భ్రష్టు పట్టించి ఏ మొఖం పెట్టుకుని సిగ్గు లేకుండా జనంలోకి వస్తు న్నారని ప్రశ్నించారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ హయాంలో వైఫల్యాలు, అవినీతిపై ప్రశ్నిస్తూ తూర్పారబట్టారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థి తులను ప్రభుత్వ వైఫల్యంగా చూపాలని ప్రయత్నించే నీచమైన ప్రవృత్తి ఉన్న ప్రతిపక్ష నాయకులు సిగ్గుపడాలని హితవుపలికారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెం బర్‌ 7, 2023… అంటే వర్షాకాలం అయిపోయిన తరువాత… అప్పటికే నాగార్జున సాగర్‌లో నీళ్లు లేని కారణంగా మొదటి పంటకే నీళ్ళివని మీరు, రెండో పంటకు నీళ్ళివాలని హేతుబద్ధత లేని డిమాండ్లు చేయడం మీ దుర్బుద్ధికి తార్కాణం కాదా? అని ప్రశ్నించారు. ఆ పాపాన్ని ఈ 100 రోజుల ప్రభుత్వంపై రుద్దాలనుకునే మీ నీచమైన బుద్ధిని ఇంకేమనుకోవాలి? అంటూ ప్రశ్నలు సంధించారు.

అనుమతులు లేకుండా అధికారులు చెబుతున్నా వినకుండా పక్క రాష్ట్రాలు నీటిని తరలిస్తున్నా కళ్లు మూసుకొని రిజర్వాయర్లు ఖాళీ చేసిన ప్రబుద్ధులు మీరు కారా? నీటి నిర్వహణ మీద కనీస దృష్టి పెట్టకుండా, మంచినీటి కోసం పక్క రాష్ట్రాలని అభ్యర్థించాల్సిన అధోగతికి ఈ రాష్ట్రానికి తీసుకువచ్చింది మీరు కాదా? రైతుబంధు పథకాన్ని మే మాసం వరకు ఇచ్చిన ఘనత సొంతం చేసుకున్న ప్రభుత్వం మీది కాదా? కేవలం రైతుబంధు పేరు మీద మిగతా పథకాలన్నీ అనగా విత్తన సబ్సిడీ, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, యాంత్రికరణ పథకం, డ్రిప్‌ స్ప్రింకర్ల మీద సబ్సిడీలన్నీ ఎత్తివేసి చిన్న, సన్నకారు రైతులకు కోలుకోలేని దెబ్బతీసింది మీరు కాదా? గోదావరి వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన రైతులకు 1000 కోట్లు ఇస్తామని చెప్పి 1000 పైసలైన ఇచ్చారా? అంటూ ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్ల పాలన లో ఏనాడైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ఏ ఒక్క రైతునైనా ఆదుకున్నారా? కనీసం గత ఎన్నికల ముందు ప్రకటించిన 10 వేలు అయినా నష్టపోయిన రైతులకు ఇచ్చారా? కేవలం మొదటి విడతగా 150 కోట్లు మంజూరు చేసి రెండో విడతగా ఏప్రిల్‌ మాసంలో కురిసిన వడగళ్ల వానలకు నష్టపోయిన రైతులకు 21.09.2023న జీవో నెం.24 ఇచ్చి 304 కోట్లకు డబ్బులు ఏ మేరకు విడుదల చేశారా? అని హితవుపలికారు.

మే మాసంలో సంభంవించిన పంట నష్టాన్ని కనీసం సర్వే చేయించని సిగ్గు లేని మీ పాలనను చూసి అసహ్యించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా రైతులను అధోగతి పాలు చేసి ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పరామర్శకు వెళుతున్నారు. మాయ మాటలు నమ్మడానికి ఇప్పుడు ఏ తెలంగాణ రైతు సిద్ధంగా లేరు…పంటల భీమా పథకా న్ని ఎత్తేసి, అంతకన్నా గొప్ప పథకాన్ని తెస్తామని ప్రగల్భాలు పలికి, రైతుల నోట్లో మట్టి కొట్టింది మీరు కాదా? అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన రాష్ట్రీయ కృషీ వికాస్‌ యోజన, సాయిల్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్‌, జాతీయ ఉద్యాన పథకం ఇలా ఒకటేంటి అన్ని పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వకుండా, ఏ ఒక్క పథకం అమలు చేయకుండా రైతుల ఉసురు పోసుకుంది మీరు కాదా? వ్యవసాయరంగమే కాదు, అన్ని వ్యవస్థలను కుప్పకూల్చి అవినీతిమయం చేసిన ఘనత మీది కాదా? ధాన్యం కోనుగోలులో బ్యాంకు గ్యారంటీలు విచ్చలవిడిగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 వేల కోట్లు అప్పులు మిగిల్చిన మీరు, ఆ కోనుగోలును ఏనాడైనా సక్రమంగా నిర్వర్తించారా? ఉచిత విద్యుత్‌ పేరు మీద, అధిక ధరకు విద్యుత్‌ కోనుగోలు చేసి తక్కువ ధరకు కొనే అవకాశమున్నా, వేల కోట్ల విద్యుచ్ఛక్తి భారం రాష్ట్ర రైతుల మీద వేసి మీరు కోరుకున్న కంపెనీలకు ప్రయోజనాలు చేకూర్చిన మాట వాస్తవం కాదా? రైతులకు నీళ్లిస్తామని చెప్పుకుంటూ నిపుణులు, సహచరుల సూచనలు పెడచెవిన పెట్టి మూర్ఖంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది మీరు కాదా? మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణం ఎవరిది? సమాధానం చెప్పాలని కోరారు. ప్రాజెక్టుల నిర్మాణమని చెప్పి పంపులకు, మోటార్లకు వేల కోట్లు కంపెనీలకు దోచిపెట్టి కమీషన్లు దండుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది మీరు కాదా? కనీసం నాణ్యతా ప్రమాణాలు లేకుండా ఇంత అసంబద్ధమై న ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి ఇన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేసి మన తెలంగాణ సమాజం మీద భారం మోపింది మీరు కాదా? అని ప్రశ్నించారు. విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు, సాగునీటి రంగ ప్రాజెక్టుల నిర్మాణంలో నిపుణుల సూచనలు పెడచెవిన పెట్టి కమీషన్ల కక్కుర్తితో వాటిని రాష్ట్రానికి గుదిబండగా మార్చారని అన్నారు.

ప్రతి పథకంలో గోల్‌ మాల్‌
ధాన్యం కొనుగోలులో గోల్‌ మాల్‌, ధరణిలో భూముల గోల్‌ మాల్‌, వాటిని తిరిగి అమ్మడంలో గోల్‌ మాల్‌, విద్యుచ్ఛక్తి కొనుగోలు గోల్‌ మాల్‌, అప్పులు చేయడంలో గోల్‌ మాల్‌, గొర్రెల పథకంలో గోల్‌ మాల్‌, చేప పిల్లల పంపిణీ పథకంలో గోల్‌ మాల్‌, దళితబంధు పథకంలో గోల్‌ మాల్‌, చివరికి రోగులకు ఇచ్చే సీఎంఆర్‌ఎఫ్‌ పథకంలో గోల్‌ మాల్‌…ఇన్ని చేసినా మీకు సిగ్గుగా అనిపించట్లేదా? అని ప్రశ్నించారు. మీరు చేసే ప్రతి కార్యక్రమంలో అవినీతి, మీ కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు, ఆఖరికి నికృష్ట మైన ఫోన్‌ ట్యాపింగ్‌కు కూడా బరితెగించి కుటుంబసభ్యులు కూడా స్వేచ్ఛగా మాట్లాడు కునే అవకాశం లేకుండా చేసిన మీరు… పాలనా వ్యవస్థలో ఇన్ని అరిష్టాలకు, అక్రమాల కు, అన్యాయాలకు పాల్పడిన మీరు… ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు? అని దుయ్య బట్టారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండదు. పంటలభీమా పథకాన్ని పునరుద్ధరించి దాదాపు 2500 కోట్ల వరకు రైతుల ప్రీమియం కూడా ఈ ప్రభుత్వమే భరించి భవిష్యత్తులో ఏ ఒక్క రైతు కూడా ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోకూడదని ధృడ సంకల్పం తీసుకుంది. మీరు చేసిన నిర్వాకాలను ఇప్పటి ప్రభుత్వం మీద నెట్టివేసే రోజు లు చెల్లాయి..అటువంటి విష ప్రయోగాలు ఈ తెలంగాణ ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజలలో అంతో ఇంతో మిగిలిన మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దని మిత్రుడిగా మీకిచ్చే సలహా అంటూ హితవుపలికారు.

 

Leave a Reply